ఎర్ర దొంగల అలజడితో అడవి దాటుతున్న ఏనుగులు

ABN , First Publish Date - 2022-07-03T06:50:45+05:30 IST

శేషాచలం అడవులను ఎర్రచందనం ఖజానాగా పేర్కొంటారు. రోజూ టన్నుల కొద్దీ నరికి తరలించేస్తున్నా తరిగిపోని సంపద ఈ అడవుల్లో దాగి ఉంది.

ఎర్ర దొంగల అలజడితో   అడవి దాటుతున్న ఏనుగులు
-తిరుమల మొదటి ఘాట్‌ ఏడవ మైలు వద్ద ఆదివారం రోడ్డు సమీపానికి వచ్చిన ఏనుగుల గుంపు

-స్మగ్లర్ల రాజ్యంగా మారిపోయిన శేషాచలం 


రోజుకు దాదాపు లక్షమంది ప్రయాణించే తిరుమల కనుమదారిలో తరచూ ఏనుగులు ప్రత్యక్షమవుతున్నాయి. రోడ్డు అంచున అడవిలో గుంపులుగా ఉంటూ హడలెత్తిస్తున్నాయి. వాహనాల రణగొణ ధ్వనులకు బెదిరి ఏకంగా రోడ్లు మీదకే వచ్చేసే ప్రమాదమూ లేకపోలేదు. ఇప్పటికి అయితే ప్రయాణీకులు ఎవ్వరికీ ఏనుగుల వల్ల ఏ ముప్పూ వాటిల్లలేదు. భవిష్యత్తులో ఎలా ఉంటుందో అంతుచిక్కడం లేదు. గతంలో ఎన్నడూ లేనిది, ఏనుగులు ఏడాదిగా ఇలా ఎందుకు అడవి దాటి కనిపిస్తున్నాయి? దట్టమైన అడవుల్లో ఉండాల్సిన గజబృందాలు జనావాసాలకు సమీపంగా ఎందుకు వస్తున్నాయి? అడవుల్లో ఏ అలజడి ఏనుగులను బయటకు తరుముతోంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ ఆదివారం ప్రత్యేక కథనం...


తిరుపతి అర్బన్‌, జూలై 2 :


 శేషాచలం అడవులను ఎర్రచందనం ఖజానాగా పేర్కొంటారు. రోజూ టన్నుల కొద్దీ నరికి తరలించేస్తున్నా తరిగిపోని సంపద ఈ అడవుల్లో దాగి ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న ఎర్ర చందనం అక్రమ నరికివేత మూడేళ్లుగా మరీ ఊపందుకుంది. అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్‌ పేరుకే తప్ప క్రియాశీలంగా లేవు. అడవుల్లో కూంబింగ్‌, స్మగ్లర్లపై దాడులు, వెంటాడి పట్టుకోవడం వంటి చర్యలు దాదాపుగా లేవు. వాహనాలు అదుపు తప్పి తిరగబడి ఎర్రచందనం బయటపడితేనో, చెక్‌పోస్టుల్లో దొరికిపోతేనో మాత్రమే చందనం దుంగలు దొరికాయని లెక్కలు చెబుతున్నారు. దుంగలు దొరికినా దొంగలు మాత్రం దొరకరు. అరుదుగా దొంగలూ పట్టుబడ్డా, బలహీనమైన కేసులతో బయటపడి మళ్లీ అడవిబాట పడుతున్నారు. ఈ విధంగా శేషాచలంలో స్మగ్లర్ల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతోంది. వారి కార్యకలాపాలకు అడ్డూ అదుపూ లేదు. విచ్చలవిడిగా చందనం చెట్లు నరికి పోగులుపెడుతున్నారు. 


ఎర్ర దొంగల అరాచకరాజ్యం

అడవులను గుప్పెట పెట్టుకుంటున్న క్రమంలో స్మగ్లర్లు ఏనుగలను కూడా బెదరగొడుతున్నారని అంటున్నారు. గుంపులుగా ఉండే ఏనుగులు తమ స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు అడ్డుపడుతాయనే భయంతో అలజడి సృష్టిస్తున్నారని తెలుస్తోంది. ఏనుగులు తారసపడితే భీకర శబ్దాలు చేసి తరమడం, తుపాకులతో శబ్దాలు చేయడం, రాళ్లు విసరడం, నిప్పు రాజేయడం వంటి చర్యల వల్ల ఏనుగులు అడవి దాటి పరుగులు తీస్తున్నాయని చెబుతున్నారు. శేషాచలంలో ఉండే ఇతర వన్యప్రాణులకు సైతం స్మగ్లర్ల వల్ల ముప్పు ఉంది. అటవీశాఖ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేసిన సమయాల్లో జింకలు, దుప్పులు, బెట్టుడుతలు, అడవిపందులు వంటి వన్యప్రాణుల మాంసం, వాటి చర్మాలు స్మగ్లర్ల వద్ద లభించడమే ఇందుకు సాక్ష్యం. ఎర్రచందరనం దుంగలతో పాటూ వన్యప్రాణుల మాంసం, చర్మం కూడా స్మగ్లర్లకు ఆదాయ మార్గంగా మారిందంటున్నారు. 


అమ్మో..వీరప్పన్‌ దళాలు

శేషాచలం అడవుల్లోకి ప్రవేశించి ఎర్రచందనం చెట్లు నరికి అడవి దాటిస్తున్న కూలీలు చాలా మంది గతంలో వీరప్పన్‌ కు అనుచరవర్గంగా ఉండేవరే అని చెబుతున్నారు. తమిళనాడు పల్లెల నుంచి రకరకాల మార్గాల్లో శేషాచలంకు చేరుకుంటున్న వీరికి జంతు భయం ఉండదు. పైగా గతంలో ఏనుగులను ఎదుర్కొన్న అనుభవమూ ఉంది. ఇప్పటికైతే ఏనుగు దంతాల కోసం వీరు శేషాచలంలోని ఏనుగులను చంపిన సంఘటనలు లేవు గానీ, భవిష్యత్తులో ఉండవని చెప్పలేమని అంటున్నారు. ఇదే మొదలైతే శేషాచలం కూడా మరో మదుమలై గా మారిపోయే ప్రమాదం ఉంటుంది. వీరు చాలా కర్కశంగా వ్యవహరిస్తారని, ఏనుగు దంతాల కోసం దేనికైనా తెగిస్తారని చెబుతారు. ఇప్పటికైతే వీరి ప్రధాన దృష్టి ఎర్రచందనం మీదే ఉంది. దానికి అడ్డులేదు కాబట్టి ఏనుగులు బతికిపోతున్నాయని అనుకోవాలి. 


అలిపిరి దాకా వచ్చేస్తాయేమో!

మనిషితో సమానంగా ఆలోచించి.. స్పందించగలిగే ఏనుగులు ప్రశాంత వాతావరణాన్ని కోరుకుంటాయి. వీటి ప్రశాంతతకు భంగం కలిగితే ఆ ప్రాంతంలో ఉండవు. మరో ప్రాంతానికి వెళతాయి. ఈ క్రమంలోనే కొంతకాలంగా ఏనుగులు తిరుమల ఘాట్‌ వైపు, కరకంబాడి, కల్యాణి డ్యామ్‌, తిరుచానూరు సమీపంలోని శిల్పారామం వరకు వచ్చేశాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏకంగా అలిపిరి వద్దకొచ్చి.. అక్కడి నుంచి తిరుపతిలోకి వచ్చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. దీనివల్ల ఇటు వన్యప్రాణులకు, అటు శ్రీవారి భక్తులకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. 


పెద్దపులి వచ్చేసిందా?

మూడేళ్లుగా అటవీ శాఖ నిస్తేజంగా ఉంది. వన్యప్రాణులను స్మగ్లర్లు అంతం చేస్తున్నా వారిపై ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు మాత్రమే పెడుతున్నారనే ఆరోపణలున్నాయి.   స్మగ్లర్ల బారినపడి ఎన్ని రకాల జంతువులు, పక్షులు ప్రాణాలను కోల్పోతున్నాయో తెలియడం లేదు. అడవుల్లోని వన్యప్రాణుల గణన జరగడంలేదు. వన్యప్రాణులపై శేషాచలంలో కొంతకాలం పాటు జరిగిన అధ్యయనాలు కూడా ఆగిపోయాయి.  తిరుమల అడవుల్లో చిరుతలు, ఎలుగుబంట్లు పెద్ద సంఖ్యలో ఉన్నా, వీటి ఉనికి స్మగ్లర్లకు పెద్ద ప్రమాదం కాదు. సులభంగా వాటిని బెదరగొట్టవచ్చు. పెద్ద పులితోనే ప్రమాదం అంతా. నల్లమల నుంచి లంకమల దాకా పెద్దపులి జాడలు కనిపిస్తున్నాయి. బాట దాటితే శేషాచలంలోకి ప్రవేశించవచ్చు. నిజానికి శేషాచలంలోనూ పెద్దపులి జాడలు కనిపించాయని ప్రచారం ఉంది. పెద్దపులిని ఎదుర్కోవడం అంత సులభం కాదు. స్మగ్లర్లకు కంటిమీద కునుకు ఉండదు. పెద్దపులి తిరుగాడే ప్రదేశాల్లో యధేచ్ఛగా సంచరించలేరు. అయితే, కారణాలు ఏమిటోగానీ శేషాచలంలో పెద్దపులి ఉన్న విషయాన్ని అటవీశాఖ గోప్యంగా ఉంచుతోందనే విమర్శలున్నాయి. 


అలజడితోనే అడవి దాటుతున్నాయి

‘‘ఏనుగులు గుంపులుగానే జీవిస్తాయి. ప్రతి గుంపుకీ ఒక ఆడ ఏనుగు నాయకత్వం వహిస్తుంది. గుంపులో ఏనుగు పిల్లలుంటే వాటికి 14 ఏళ్లు వచ్చేవరకు మిగతా ఏనుగులు దాని సంరక్షణ బాధ్యతలు తీసుకుంటాయి. 14 ఏళ్లు  దాటిన ఏనుగు మగది అయితే దానిని తమ గుంపులోనుంచి తరిమేస్తాయి. ఇలా తరిమివేయబడ్డ మగ ఏనుగు ఒంటరిగా కానీ, తనలా తరిమివేయబడ్డ ఇతర మగ ఏనుగులతో కానీ కలిసి తిరుగుతుంది. ఈ క్రమంలో మరో ఆడ ఏనుగుల గుంపు తారసపడితే వాటితో కలిసి జీవిస్తాయి. పిల్లల సంరక్షణకు ప్రాధాన్యమిచ్చే ఏనుగులు చాలా సున్నిత మనస్తత్వాన్ని కలిగి ఉంటాయి. ఏ మాత్రం తమ ప్రశాంతతకు భంగం కలిగినా ఆ ప్రాంతాన్ని వదిలివెళ్లిపోతాయి. అలాగే తమ పిల్లలను, గుంపును కాపాడుకునే క్రమంలో మనుషులపైనా దాడులు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఆహారం కోసం, తాగునీటి కోసం తాము ప్రయాణించే సుదూర ప్రాంతాలను గుర్తుపెట్టుకోవడం ఏనుగుల జ్ఞాపక శక్తికి నిదర్శనం. భారీ కాయంతో ఉన్నా.. కొండలను సులభంగా ఎక్కేస్తాయి. లోతట్టు ప్రాంతాలకు దిగడానికి మాత్రం వెనకాడతాయి. శేషాచలం అడవుల్లో ఆడ ఏనుగుల గుంపు ప్రస్తుతం కనిపిస్తోంది. అవి ఆహారం కోసం సమీప జనావాసాల్లోకి రావడంలేదు. వాటి ప్రశాంతతకు భంగం కలుగుతుండటం వల్లే వస్తున్నాయన్న విషయం స్పష్టం అవుతోంది. అలా ఎందుకు జరుగుతోందన్న అంశంపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది. ఆడ, మగ ఏనుగులు, పిల్లలు ఎన్ని ఉన్నాయన్న దానిపై సర్వే జరగాలి. అలాగే రేడియో కాలర్‌, ట్రేసింగ్‌ జీపీఎస్‌ను అమర్చాల్సిన అవసరం ఉంది. దీనివల్ల ఏనుగుల ఎప్పుడు ఏ ప్రాంతంలో ఉన్నాయో, ఏవైపు వెడుతున్నాయో స్పష్టంగా తెలుసుకోవచ్చు. ప్రజలను అప్రమత్తం చేయవచ్చు.’’

- అరుణ్‌ కుమార్‌, జూపార్కు వెటర్నరీ డాక్టర్‌


 Updated Date - 2022-07-03T06:50:45+05:30 IST