సస్పెన్షన్‌తో సరిపెట్టేస్తారా?

ABN , First Publish Date - 2022-11-19T00:23:38+05:30 IST

వెలుగు అక్రమాలపై కేసు నమోదయ్యేనా నిగ్గుతేలని నిజాలపై అనుమానాలెన్నో

సస్పెన్షన్‌తో సరిపెట్టేస్తారా?
వరదయ్యపాళెం డీసీసీ బ్యాంకు ముందు నిరసన తెలుపుతున్న బాధిత డ్వాక్రా సంఘాల మహిళలు

సత్యవేడు, నవంబరు 18: వరదయ్యపాళెం మండలం ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ)లో జరిగిన డ్వాక్రా రుణాల స్వాహాకు సంబంధించి బాధ్యులను అధికారులు సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.సీఎల్‌ఎన్‌పల్లె, అంబూరు, కళత్తూరు, వీరాస్వామి నగర్‌, రాచర్ల, ఇందిరా నగర్‌, ఎంజీ నగర్‌, నాగనందాపురం తదితర గ్రామాల్లో గిరిజనులను టార్గెట్‌ చేసిన ఐకేపీ సిబ్బంది వారి పేర్లతో నకిలీ గ్రూపులను సృష్టించి బ్యాంకుల నుంచి కోట్ల రూపాయల రుణాలను స్వాహా చేసిన విషయం తెలిసిందే.ఈ సంఘటనపై ఉ్నతాధికారుల ఆదేశాల మేరకు వెలుగు అధికారులు విచారణ జరిపి రూ.2,50 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఏపీఎం జ్యోతితో పాటు ఇద్దరు సీసీలను, ముగ్గురు సంఘమిత్రలను, ఒక వీవో లీడర్‌ను, ఒక స్వీపర్‌ను సస్పెండ్‌ చేయాలని సిఫార్సు చేయగా ఐకేపీ జిల్లా పీడీ నాలుగు రోజుల క్రితం వీరిని సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు.అయితే ఈ వ్యవహారంపై ఇంత వరకు కేసు నమోదు కాకపోవడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఇంతపెద్ద మొత్తంలో ఆర్థిక నేరానికి పాల్పడిన వారిని అరెస్ట్‌ చేస్తారా లేదా రికవరీ చేసుకుని వదిలేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి నిందితులపై ఫోర్జరీ, చీటింగ్‌కు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే సప్తగిరి గ్రామీణ బ్యాంకు అధికారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. డీసీసీ బ్యాంకు అధికారులు మాత్రం ఇంకా ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.నిందితులను కాపాడేందుకు కొంతమంది అధికార పార్టీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరెవరు... ఎంతెంత?

బినామీ పేర్లతో సాగించిన అక్రమ రుణాల వ్యవహారంలో మొదట్నుంచి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీఎం జ్యోతి 64.10 లక్షలు స్వాహా చేయగా, సీఎల్‌ఎన్‌పల్లె సంఘమిత్ర దేవి రూ.86లక్షలు, అంబూరు సంఘమిత్ర యువరాజు రూ.71.63 లక్షలు, సీసీలు జీవయ్య రూ.90 వేలు, పుల్లయ్య రూ.10.60 లక్షలు, వీవో లీడర్‌ జయమ్మ రూ.7.30 లక్షలు, స్వీపర్‌ తులసమ్మ రూ.8 లక్షలు స్వాహా చేసినట్లు విచారణలో తేలింది. అయితే ఈ భారీ స్కాం తెరవెనుక కనిపించని శక్తులు ఏమైనా ఉన్నాయా అన్నది తేలాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి ఈ అక్రమ రుణాల వ్యవహారం సంవత్సరం క్రితమే వెలుగు చూసినట్లు సమాచారం. ఈ అక్రమాన్ని మొదట గుర్తించింది బ్యాంకు విజిలెన్స్‌ అధికారులే. అయితే తరచూ వెలుగులో జరిగే ఆడిట్‌లో ఎందుకు గుర్తించలేక పోయారన్నది శేషప్రశ్న.ఇందులో ఎవరి స్వలాభం ఎంతన్నది కూడా మిస్టరీగానే మారింది.

ఈ దారుణాల నుండి విముక్తి కల్పించండి

అక్రమ రుణాల వ్యవహారంలో నిందమోస్తున్న గిరిజన మహిళలను ఈ రుణాలను చెల్లించాల్సిందేనని బ్యాంకు అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. దీంతో సీఎల్‌ఎన్‌పల్లె, అంబూరు, కళత్తూరు, వీరాస్వామి నగర్‌, రాచర్ల, ఇందిరా నగర్‌కు చెందిన పలువురు డ్వాక్రా సంఘాల మహిళలు శుక్రవారం వరదయ్యపాళెం సప్తగిరి గ్రామీణ బ్యాంకు, డీసీసీ బ్యాంకుల వద్ద, స్థానిక శ్రీకాళహస్తి - వరదయ్యపాళెం రోడ్డుపై భైఠాయించి నిరసనలు తెలిపారు. రెక్కాడితే గాని డొక్కాడని తమకు జరిగిన అన్యాయంపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు.రుణవిముక్తులను చేయాలని డిమాండ్‌ చేశారు

Updated Date - 2022-11-19T00:23:38+05:30 IST

Read more