ఎందుకో అంత అసహనం.. రెచ్చిపోతున్న వైసీపీ నేతలు!

ABN , First Publish Date - 2022-05-24T07:48:17+05:30 IST

సమస్య పరిష్కరించాలని కోరితే బడా నాయకులు ఆగ్రహిస్తారు. చోటా నేతలు దాడులు చేస్తారు. గ్రామాల్లో నీళ్లు రావడం లేదంటే కొడతారు.

ఎందుకో అంత అసహనం.. రెచ్చిపోతున్న వైసీపీ నేతలు!

చిత్తూరు, ఆంధ్రజ్యోతి : సమస్య పరిష్కరించాలని కోరితే బడా నాయకులు ఆగ్రహిస్తారు. చోటా నేతలు దాడులు చేస్తారు. గ్రామాల్లో నీళ్లు రావడం లేదంటే కొడతారు. హోటల్లో భోజనం అయిపోయిందన్నా వినట్లేదు. ఎవరైనా తిరగబడి పోలీసు స్టేషన్‌కు వెళ్తే.. పోటీ కేసులు పెట్టించి రాజీకి రప్పించుకుంటున్నారు. వీలును బట్టి, నేతల స్థాయిని బట్టి స్థలాల్ని, ఇళ్లను ఆక్రమించి.. వేధిస్తున్నారు.


- ఇలా జిల్లాలోని వైసీపీ నేతలు ‘అధికారం’ అండగా రెచ్చిపోతున్నారు. చిన్నపాటి వ్యతిరేకతనూ సహించలేక పోతున్నారు. సమస్య ప్రస్తావిస్తే.. వినేందుకూ ఆసక్తి చూపడంలేదు. పరిష్కారం దిశగా అడుగులు వేయడం లేదు. సామాన్యులు తమ సమస్య గురించి చెప్పుకుంటే మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ ఊగిపోతున్నారు. రాజకీయంగా ప్రత్యర్ధులైన టీడీపీ నేతలు, కార్యకర్తల మీద అధికారంలోకి వచ్చిప్పటి నుంచీ దాడులు చేస్తూనే ఉన్నారు. పోలీసుల సాయంతో బాధితులపైనే కేసులు పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. రానురాను సామాన్యులపైనా అదే అసహనం చూపుతున్నారు. సమస్యలు అడిగితే ప్రత్యర్థి పార్టీ ముద్ర వేస్తున్నారు. ఆ మధ్య చిత్తూరు, పలమనేరు, మదనపల్లె వంటి ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులపైనా చేయి చేసుకున్నారు. ఆయా శాఖల్లో ఉన్న లోటుపాట్ల గురించి చెప్పినా, వెంటనే వారిని సస్పెండ్‌ చేయడం.. నోటీసులు ఇవ్వడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జిల్లాలో అనేకం జరిగాయి. 


తాజాగా జరిగిన ఘటనల్ని పరిశీలిస్తే.. భోజనం అయిపోయిందటే హోటల్‌పై దాడి

కుప్పం బైపా్‌సలోని ఓ దాబాకు గత ఆదివారం రాత్రి 11 గంటల తర్వాత వైసీపీకి చెందిన కౌన్సిలర్‌తో పాటు మరో కౌన్సిలర్‌ అనుచరుడు వచ్చి భోజనం కావాలని అడిగారు. అప్పటికే ఆహార పదార్థాలన్నీ అయిపోయాయని చెప్పడంతో ఆగ్రహించి దుర్భాషలాడుతూ అక్కడున్న కుర్చీలు, టేబుళ్లు ధ్వంసం చేశారు. వీరి దాడి గురించి బాధితులు మీడియాకు ఎక్కారు. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సాయంత్రానికంతా మా దాబా మీద దాడి జరగలేదని నిర్వాహకులు చెప్పుకొన్నారు. దీని వెనుక ‘ఏ జరిగిందో’ అందరూ ఊహించగలరు. వైసీపీ కౌన్సిలర్ల హంగామా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు కావడం గమనార్హం. 


నీళ్లు అడిగితే సచివాలయంలోనే కొట్టారు

శాంతిపురం మండలంలోని రాళ్లబూదుగూరు పంచాయతీ కురుబూరు గ్రామంలో తమ వీధిలో తాగునీళ్లు రావడం లేదని ఓ గ్రామస్థుడు వినోద్‌కుమార్‌.. సర్పంచి, ఎంపీటీసీ, సెక్రటరీ తదితరులకు ఫిర్యాదు చేశారు. సమస్య తీరకపోవడంతో స్పందనలోనూ ఫిర్యాదు ఇచ్చారు. అంతే.. స్థానిక సర్పంచి లక్ష్మి (వైసీపీ) భర్త గంగాధరం, ఎంపీటీసీ లక్ష్ముమ్మ కుమారుడు రమేష్‌ అతడిని సచివాలయం వద్దకు పిలిపించారు. మాకు చెప్పకుండా ఫిర్యాదు చేస్తావా అంటూ బూతులు తిట్టారు. కార్యదర్శి వనితారెడ్డి సమక్షంలోనే దాడి చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతలు పోటీగా సెక్రటరీతో అసభ్యంగా మాట్లాడాడని ఫిర్యాదు చేయించారు. దెబ్బకు రాజీ కావాల్సి వచ్చింది. 


డ్రైనేజీ కావాలంటే ఆగ్రహం..

ఇటీవల కార్వేటినగరం మండలంలోని దాసరిగుంటలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు మీద వర్షపు నీళ్లు నిలబడ్డాయని, డ్రైనేజీ సమస్య తీర్చాలని స్థానికులు కోరారు. దీంతో నారాయణస్వామి ఒక్కసారిగా ఆగ్రహించారు. ‘మీ ఇంటి ముందు మట్టి అడ్డంగా పెట్టుకున్నారు. లేకుంటే రోడ్డు మీద నీళ్లు నిలబడేవి కావు’ అని గద్దించారు. ‘ఈ సమస్య గురించి ఫేస్‌బుక్‌లో ఎందుకు పోస్ట్‌ చేశావ్‌’ అంటూ మరో వ్యక్తిని మందలించారు. ఒకవేళ సమస్యకు వాళ్లే కారణమై ఉంటే.. ఇలా చేయడం సరికాదని, అధికారుల చేత పరిష్కారం చేయించి ఉంటే బాగుండేదని గ్రామస్తులు అంటున్నారు. 


రేట్లు పెరగాయంటే రాజకీయ విమర్శ 

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇటీవల తిరుపతి జిల్లా వడమాలపేట మండలం కల్లూరులో మంత్రి రోజా పర్యటించారు. అంజయ్య అనే వ్యక్తి ఇంటి వద్దకు వెళ్లి పథకాలు అందుతున్నాయా అంటూ వివరాలు అడిగారు. ‘పథకాలు ఇస్తున్నారు సరే, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఇలా ఇచ్చి అలా లాగేసుకుంటున్నారు’ అని ఆయన అడిగారు. టీడీపీ వాళ్లు కదా అలాగే మాట్లాడతారు.. పథకాలన్నీ తీసుకుంటూ ఇలా మాట్లాడతారా అంటూ రోజా అసహనం వ్యక్తంచేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు ఇలాగే ఉన్నాయంటూ ముందుకు సాగారు. 


ఇంటిని ఆక్రమించి..!

చిత్తూరు కలెక్టరేట్‌ సమీపంలోని ప్రశాంత్‌నగర్‌లో తన ఇంటిని అధికార పార్టీకి చెందిన సర్పంచి రవి ఆక్రమించుకున్నాడని మానసికంగా కుంగిపోయిన సుందరమ్మ ఐదు రోజుల కిందట మరణించింది. ఈ మేరకు ఆమె కోడలు దేవి ఆరోపించారు. ఆక్రమణ విషయంగా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె వాపోయారు. 

Updated Date - 2022-05-24T07:48:17+05:30 IST