అమూల్ పొదిలో విజయా డెయిరీ ఎందుకట?
ABN , First Publish Date - 2022-12-16T00:43:54+05:30 IST
దేశంలోనే పేరు ప్రతిష్టలతో రెపరెపలాడిన చిత్తూరు విజయా డెయిరీని అమూల్ సంస్థలు వైసీపీ ప్రభుత్వం అప్పగిస్తున్న తీరు పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లలో నిరసన వ్యక్తమవుతోంది.
తిరుపతి, ఆంధ్రజ్యోతి: దేశంలోనే పేరు ప్రతిష్టలతో రెపరెపలాడిన చిత్తూరు విజయా డెయిరీని అమూల్ సంస్థలు వైసీపీ ప్రభుత్వం అప్పగిస్తున్న తీరు పట్ల ఉమ్మడి చిత్తూరు జిల్లలో నిరసన వ్యక్తమవుతోంది. మూతబడినప్పటికీ 500 నుంచి 1000 కోట్ల ఆస్తులున్న డెయిరీని అమూల్‌కి ఏడాదికి కేవలం కోటి రూపాయలకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేస్తూ తీసుకున్న నిర్ణయం విస్మయపరుస్తోంది. ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతూ ఉంటే వైసీపీ ఎమ్మెల్యేలు మాత్రం శభాష్.. చాలా మంచి నిర్ణయమని సంబరపడుతున్న తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దీనికి తోడు చంద్రబాబు సారధ్యంలో దొరబాబు వల్లే చిత్తూరు డెయిరీ మూతపడిందని వైసీపీ ఎదురు ప్రచారం మొదలు పెట్టింది. ఈ నేపథ్యంలో విజయా డెయిరీ పుట్టుక, ప్రగతి, మూతబడ్డ పరిణామాలపై ప్రత్యేక కథనం..
ఇలా ఏర్పడింది
సహకార రంగానికి, సంస్థలకు పేరుమోసిన చిత్తూరు జిల్లాలో పాడి రైతులకు కూడా ఒక డెయిరీ వుండాలని ఆనాటి ముఖ్య నేతలు 1969లో చిల్లింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. 1988లో దీన్ని పౌడర్ ప్లాంట్‌గా మార్పు చేశారు. అదే ఏడాదిలోనే చిత్తూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సొసైటీగా మార్చారు. 1989లో అప్పటి సీఎం ఎన్టీ రామారావు దీన్ని సహకార రంగంలో రైతులే నిర్వహించుకునేలా పాడి రైతులకు అప్పగించారు. 600 మంది ఉద్యోగులు, 40 వేల మంది సభ్యులు, లక్ష మంది పాడి రైతులతో మహా వటవృక్షమై విస్తరించి జిల్లాకే జీవనాధారంగా నిలిచింది.
ఇలా ఎదిగింది
డెయిరీ ఏర్పడిన రెండో ఏడాదే (1990-91) పాడి రైతులకు రూ. 30 లక్షలు బోన్‌సగా అందజేసి డెయిరీ రంగాన్ని ఆశ్చర్యపరిచారు. తర్వాతి ఏడాది ఏకంగా రూ. 42 లక్షలు బోనస్ ఇచ్చారు. అప్పుడు డెయిరీ ఛైర్మన్‌గా దొరబాబు ఉన్నారు. పాల సేకరణ 90 వేల లీటర్లు నుంచి 3 లక్షల లీటర్లకు చేరింది. ఏటా 170 టన్నుల నెయ్యి తయారయ్యేది. జిల్లావ్యాప్తంగా 800 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. అందులో మహిళా సంఘాలే 106 ఉండేవి. 800 పాల సేకరణ కేంద్రాల భవనాలు నిర్మించారు. చిత్తూరు, తిరుపతి, తిరుమలల్లో విజయా డెయిరీ పార్లర్లు ఏర్పాటు అయ్యాయి. మదనపల్లె, వి.కోట, పీలేరు, శ్రీకాళహస్తి, పిచ్చాటూరుల్లో మిల్క్ చిల్లింగ్ సెంటర్లు నడిచాయి. తిరుపతిలో 20 ఎకరాలు భూమి కొని బాలాజీ డెయిరీ ప్రారంభించారు. ఆ తర్వాత చెల్లించాల్సిన అప్పులకు బదులు ఎన్డీడీబీకి ఈ డెయిరీని అప్పగించారు.
సాధించిన ఘనత
- చిత్తూరు విజయా డెయిరీ అప్పట్లో దేశంలోనే రెండవ స్థానాన్ని అందుకుంది.
- జున్ను తయారీలో దేశంలోనే మొదటి స్థానం.
- 400 టన్నుల పాల పొడి ఏటా భారత సైన్యానికి సరఫరా అయ్యేది.
- శ్రీవారి ప్రసాదాల కోసం టీటీడీకి ఏటా 120 టన్నుల నెయ్యి సరఫరా చేసేది. మరో 50 టన్నులు కోల్‌కత్తాలో విక్రయించేవారు.
- హైదరాబాదు నగర ప్రజలకు పెద్ద ఎత్తున పాలు సరఫరా చేసేది.
- ఢిల్లీ, కోల్కత్తా, మహరాష్ట్రలకు పెరుగు సరఫరా అయ్యేది. దీనికోసం రేణిగుంట నుంచీ ప్రత్యేకంగా వ్యాగన్లు కూడా ఏర్పాటు చేశారు.
- పాలతో పాటు దూద్ పేడా, ఫ్లేవర్డ్ మిల్క్, ఛీజ్, నెయ్యి, కోవా తదితర ఉత్పత్తులు తయారయ్యేవి.
- ఎక్కువ కాలం నిల్వ వుండేలా అప్పట్లోనే టెట్రా ప్యాక్‌లను విజయా డెయిరీ రూపొందించి మార్కెట్లోకి విడుదల చేసింది.
మూత పడింది ఇలా
పి.వి.నరసింహారావు ప్రధానిగా, మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా వున్నపుడు 1992లో కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రైవేటు డెయిరీలకు అనుమతి ఇచ్చింది. దీంతొ ప్రయివేటు డెయిరీలు మొదలయ్యాయి. సహజంగానే అధికార కాంగ్రెస్ నేతలే జిల్లాలో డెయిరీలు ప్రారంభించారు. ఆ తర్వాత పొరుగు జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు డెయిరీ శాఖలు ఏర్పాటు చేశారు. మూడవ దశలో హెరిటేజ్ డెయిరీ ఏర్పాటైంది. ఇపుడైతే చిత్తూరులోనే 30 దాకా ప్రైవేటు డెయిరీలు నడుస్తున్నాయి. దొరబాబు చైర్మన్‌గా ఉన్నపుడు చిత్తూరు సహకార డెయిరీ తరపున తిరుపతిలో బాలాజీ డెయిరీ ఏర్పాటుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. పేద దేశాన్ని ఆదుకోవడానికి అంటూ అప్పట్లో యూరోపియన్ దేశాల నుంచి పాల పొడి ఉచితంగా వెల్లువలా వచ్చి పడేది. దీంతో ఉత్పత్తులకు గిరాకీ తగ్గింది. మార్కెటింగ్ కష్టమైంది. తమిళనాడులో పాల విక్రయాలకు అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. బెంగుళూరులో అప్పటికే పలు ప్రైవేటు డెయిరీలు పాతుకుపోయి వున్నాయి. దీంతో చిత్తూరు డెయిరీకి నష్టాలు మొదలయ్యాయి. డెయిరీ ఛైర్మన్‌గా దొరబాబు 2003 దాకా పనిచేశారు. తర్వాత రెండేళ్ళ పాటు కలెక్టర్ పర్సన్ ఇంఛార్జిగా వ్యవహరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో, కలెక్టర్ పర్సన్ ఇంఛార్జిగా వుండగానే 2005లో డెయిరీ మూతపడింది. డెయిరీ మూసివేతకూ హెరిటేజ్ సంస్థకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా ఆరోపణలను చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది.
అపారంగా ఆస్తులు
- చిత్తూరులో డెయిరీ 22 ఎకరాల ఆవరణలో వుంది. రైతులు, ఉద్యోగుల శిక్షణ కోసం మరో ఒకటిన్నర ఎకరా కొనుగోలు చేశారు. మొత్తం 23.5 ఎకరాల విలువే ఇపుడు రూ. 300 కోట్లకు పైగానే వుంటుంది.
--వి.కోట, మదనపల్లె, పిచ్చాటూరు, శ్రీకాళహస్తి, పీలేరు చిల్లింగ్ సెంటర్లు కూడా ప్రధాన రహదారుల పక్కనే వున్నందున వీటి విలువ వందల కోట్లలోనే వుంది.
-800 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు ఆయా గ్రామాల్లో ఉన్న బ్యాంకు ఖాతాల్లో ఇప్పటికీ రూ. లక్షలాది నిధులు డిపాజిట్ల రూపంలో మూలుగుతున్నాయి.
జగన్ మడమ తిప్పేశారు
సహకార డెయిరీని తిరగి ప్రారంభిస్తానని, తాను అధికారంలోకి వస్తే పాడి రైతులకు రూ. 4 బోనస్ ఇస్తానని గత ఎన్నికల ప్రచారంలో జగన్ హామీ ఇచ్చారు. బోనస్ ఇవ్వకపోగా పాడి రైతులకు ఇవ్వాల్సిన ఇతర బెనిఫిట్స్ కూడా ఇవ్వలేదు. పైగా ప్రైవేటు డెయిరీలపై కనీస నియంత్రణ లేదు. జిల్లాలో ప్రైవేటు డెయిరీలన్నీ లీటరుకు రూ. 30 చొప్పున రైతులకు చెల్లిస్తుంటే, శివశక్తి డెయిరీ మాత్రం రూ. 23 చెల్లిస్తోంది. సదుం, సోమల మండలాల్లో ఇతర ప్రైవేటు డెయిరీలను అడుగ ు పెట్టనివ్వడం లేదు. దౌర్జన్యం చేసి తరిమివేస్తున్నారు. శ్రీజ డెయిరీ ద్వారా అమూల్‌కు పాలు సేకరించేందుకు ఏర్పాటు చేసిన పరిమిత కేంద్రాల్లోనే 50 శాతం కేంద్రాలు మూతపడ్డాయి. అమూల్‌కు వచ్చే లాభాలను ఆ సంస్థ జిల్లాలో వినియోగించే పరిస్థితి లేదు. ఇంతవరకూ రైతులకు బోనస్ ఇవ్వలేదు. మొత్తం లాభాలను గుజరాత్‌కు తరలించుకుపోతుంది. కేసుల భయంతో, గుజరాత్ నేతలను ప్రసన్నం చేసుకోవడానికే జగన్ అమూల్‌కి అప్పనంగా డెయిరీని కట్టబెట్టేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.