ఎప్పుడొస్తాయో.. ఏమో!

ABN , First Publish Date - 2022-05-30T07:24:57+05:30 IST

డీఎల్‌డీవోలు (డివిజన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌)గా, డీఎల్‌పీవోలు (డివిజనల్‌ పంచాయతీరాజ్‌ ఆఫీసర్‌)గా, జడ్పీ డిప్యూటీ సీఈవోలుగా ఎంపీడీవోలకు పదోన్నతులు ఇచ్చేందుకు మంత్రి మండలి తీర్మానించింది.

ఎప్పుడొస్తాయో.. ఏమో!

పదోన్నతుల కోసం ఎంపీడీవోల ఎదురుచూపు

ఉమ్మడి జిల్లాలో 24 మందికి అర్హత

చిత్తూరు, మే 29 (ఆంధ్రజ్యోతి): డీఎల్‌డీవోలు (డివిజన్‌ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌)గా, డీఎల్‌పీవోలు (డివిజనల్‌ పంచాయతీరాజ్‌ ఆఫీసర్‌)గా, జడ్పీ డిప్యూటీ సీఈవోలుగా ఎంపీడీవోలకు పదోన్నతులు ఇచ్చేందుకు మంత్రి మండలి తీర్మానించింది. తర్వాత ప్రభుత్వం కూడా ఉత్తర్వులు జారీ చేసింది. దీనికోసం పంచాయతీరాజ్‌ శాఖ సిద్ధం కాగా, ఆర్థిక శాఖ కొర్రీలు వేసింది. అంతే.. పదోన్నతుల కోసం ఎంపీడీవోలకు ఎదురుచూపులే మిగిలాయి. పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వాళ్లయితే.. పదోన్నతి లేకుండానే రిటైరైపోతామా అని ఆందోళన చెందుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో తిరుపతి అర్బన్‌పోను మిగిలిన 65 మండలాలకుగాను 24 మంది ఎంపీడీవోలు పదోన్నతులకు అర్హత సాధించారు. వీరంతా ఇతర శాఖల్లో ప్రమోషన్‌ పొందేందుకు ప్రతిపాదనలు పంపించారు. జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కొత్తగా ఏర్పడిన 25 రెవెన్యూ డివిజన్లకు కొత్తగా 25 డీఎల్‌డీవో పోస్టులు, ఇతర శాఖల్లోనూ జిల్లా స్థాయి పోస్టులు మొత్తం కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 130 వరకు ప్రమోషన్లు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. పంచాయతీరాజ్‌ శాఖ దీనిని ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపగా, అక్కడ ప్రమోషన్ల ప్రక్రియ ఆగిపోయింది. డివిజన్లు అయితే పెరిగాయి కానీ, పోస్టులు పెరగలేదు కాబట్టి ఆర్థిక శాఖ అనుమతి ఆగినట్లు తెలుస్తోంది. గతంలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా జిల్లావాసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన శాఖ మారింది. కొత్త మంత్రి ఈ అంశాన్ని పరిశీలించి, ఫైల్‌ను ఎప్పుడు ముందుకు కదపతారోనని ఎంపీడీవోలు ఎదురు చూస్తున్నారు. 


ఇక్కడా కొత్త డివిజన్లు 

ఉమ్మడి జిల్లాలో నగరి, శ్రీకాళహస్తి, కుప్పం, పలమనేరు డివిజన్లు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో పాటు తిరుపతి జిల్లాలో కొత్తగా పీడీ పోస్టులున్నాయి. ఆయా పోస్టుల్లో ప్రమోషన్లు పొందిన వారంతా పనిచేయొచ్చు. 2007కు ముందు నుంచీ ఎంపీడీవోలుగా పనిచేస్తున్నవారిని జిల్లాలో ప్రమోషన్లకు అర్హులుగా గుర్తించి జాబితా సిద్ధం చేశారు. 2007 ఎంపీడీవో బ్యాచ్‌ అధికారులంతా ఈ జాబితాలో ఉన్నారు. అంటే సుమారు 15 ఏళ్లకుపైగా వీరంతా మండలాల్లో ఎంపీడీవోలుగా పనిచేస్తున్నారు.


జిల్లాస్థాయి పోస్టుల్లో ఇన్‌చార్జులుగా కొందరు 

పదోన్నతులకు అర్హత పొందిన 24 మంది ఎంపీడీవోల్లో ముగ్గురు ఇప్పటికే శ్రీకాళహస్తిలోని ఎక్స్‌టెన్షన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌లో పనిచేస్తున్నారు. మరొకరు శ్రీనివాస ప్రసాద్‌ చిత్తూరు డ్వామా ఏపీడీగా ఉంటూ, రెండు రోజుల కిందట తిరుపతి డ్వామా ఇన్‌చార్జి పీడీగా చేరారు. మరొకరు రాధమ్మ చిత్తూరు మెప్మా పీడీగా పనిచేస్తున్నారు. వీరంతా ఎంపీడీవోలుగా ఉంటూనే ఇన్‌చార్జులుగా జిల్లా పోస్టుల్లో ఉన్నారు.


పదోన్నతులకు అర్హత సాధించిన ఎంపీడీవోలు వీరే 

భాగ్యలక్ష్మి (తొట్టంబేడు), రాజశేఖర్‌రెడ్డి (రామచంద్రాపురం), ఆదిశేషారెడ్డి (సదుం), ఉమావాణి (పాలసముద్రం), శ్రీలక్ష్మి (వడమాలపేట), పార్వతమ్మ (ఎస్‌ఆర్‌పురం), రవికుమార్‌నాయుడు (బీఎన్‌కండ్రిగ), వెంకటరత్నం (చిత్తూరు), వెంకటరత్నం (రామకుప్పం), విద్యారమ (బంగారుపాళ్యం), మల్లికార్జున (నిండ్ర), రవికుమార్‌ (పెనుమూరు), శ్రీనివాసులు (కుప్పం), లక్ష్మీపతి (పుంగనూరు), గంగాభవాని (నారాయణవనం), మూర్తి (శ్రీకాళహస్తి), సుశీల (పాకాల), చిన్నరెడ్డప్ప (కార్వేటినగరం) జాబితాలో ఉన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే వీరంతా ఏ క్షణమైనా జిల్లా స్థాయి పోస్టుల్లో కూర్చుంటారు.

Read more