సర్వీసు రోడ్డు లేకుంటే ఎలా?

ABN , First Publish Date - 2022-10-08T05:01:45+05:30 IST

జాతీయ రహదారి అంటే అన్నిచోట్ల ఉన్నట్లు సర్వీసు రోడ్లు ఉంటాయని రైతులు భావించారు. తీరా భూసేకరణ పూర్తయ్యాక ఈ జాతీయ రహదారిలో సర్వీసు రోడ్లు ఉండవని, అవసరాన్ని బట్టి మీ పరిహారంతో సర్వీసు రోడ్లను మీరే నిర్మించుకోవాలని ప్రాజెక్టు అధికారులు తేల్చి చెప్పడంతో రైతులంతా కంగుతిన్నారు.

సర్వీసు రోడ్డు లేకుంటే ఎలా?
దామరపాకం వద్ద చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి పనులు (ఫైల్‌ ఫొటో)

రైతులకు, చిత్తూరు అభివృద్ధికీ సమస్యే 


పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు


ఇదీ చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి తాజా సమస్య


చిత్తూరు, ఆంధ్రజ్యోతి 


‘మీ పొలాల్లో జాతీయ రహదారి వస్తే మీ భూములకు విలువ పెరుగుతుంది. ఇప్పుడు పరిహారం తక్కువైనా, భవిష్యత్తులో మీ ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది. భూములకు మంచి ధర లభిస్తుంది’ అని అధికారులు రైతులకు ఆశ చూపారు. దీంతో రైతులు పరిహారం తక్కువైనా భూసేకరణకు సమ్మతి పత్రాల్లో సంతకాలు చేశారు. జాతీయ రహదారి అంటే అన్నిచోట్ల ఉన్నట్లు సర్వీసు రోడ్లు ఉంటాయని రైతులు భావించారు. తీరా భూసేకరణ పూర్తయ్యాక ఈ జాతీయ రహదారిలో సర్వీసు రోడ్లు ఉండవని, అవసరాన్ని బట్టి మీ పరిహారంతో సర్వీసు రోడ్లను మీరే నిర్మించుకోవాలని ప్రాజెక్టు అధికారులు తేల్చి చెప్పడంతో రైతులంతా కంగుతిన్నారు. ఇన్నాళ్లు పరిహారం కోసం పోరాడి రాజీ పడిన రైతులు, ఇక నుంచి సర్వీసు రోడ్ల కోసం పోరాడాల్సి వస్తోంది. ఇదీ చిత్తూరు- తచ్చూరు ఆరు వరుసల జాతీయ రహదారిలో తాజాగా నెలకొన్న సమస్య.


చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి 126.55 కిలోమీటర్ల మేర సాగుతుంది. దీన్ని రూ.3197.56 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. చిత్తూరు ప్రారంభమై జిల్లాలోని 8 మండలాల మీదుగా మన జిల్లాలో 83 కి.మీ.లు, తమిళనాడులో 43.55 కి.మీ.లు ప్రయాణిస్తుంది. ఇప్పటికే 1400 ఎకరాల భూసేకరణ చేశారు. ఇప్పటికే పరిహారం తక్కువగా ఇస్తున్నారని నెలల తరబడి పోరాటం చేసిన బాధిత రైతులు, చివరికి అధికారుల ఒత్తిళ్లకు రాజీ పడ్డారు. తాజాగా వారి ముందు సర్వీసు రోడ్ల సమస్య వచ్చి పడింది. కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారి కావడంతో మొత్తం పొలాల మీదుగానే వెళుతోంది. దీంతో పొలాలకు వెళ్లే బండి బాటలు, చిన్న చిన్న దారులన్నీ మూసుకుపోయాయి. చిత్తూరు మండలం ఎల్బీపురం గ్రామానికి చెందిన రైతు మోహన్‌ భూమి మధ్యలో జాతీయ రహదారి వెళుతోంది. ఆయన భూమి రెండుగా మారిపోయింది. సర్వీసు రోడ్డు లేకుంటే రెండు వైపులా ఉన్న పొలాలకు వెళ్లడం కష్టం. ఇలాంటి సమస్యల్ని వందలాది మంది రైతులు ఎదుర్కోవాల్సి వస్తోంది. చాలా పొలాలు బీడుగా మారిపోయే అవకాశాలున్నాయి. సర్వీసు రోడ్లు ఉంటేనే సాగు చేసేందుకు అనుకూలతలు ఉంటాయి.


చిత్తూరు నగర అభివృద్ధికీ అడ్డుకట్ట


చిత్తూరు మండలం ఎల్బీపురంలోని రైల్వే క్రాసింగ్‌ వద్ద జాతీయ రహదారిలో భాగంగా ఆర్వోబీ నిర్మించాలి. ఇక్కడ 500 మీటర్లలో సిద్ధంపల్లి రైల్వేస్టేషన్‌ ఉంది. భవిష్యత్తులో ఈ స్టేషన్‌ను గూడ్స్‌ ట్రాన్స్‌పోర్టు కేంద్రంగా మార్చేందుకు ప్రతిపాదన ఉంది. ఈ ప్రాంతం చిత్తూరు మాస్టర్‌ ప్లాన్‌లో ఇండస్ట్రియల్‌ కారిడార్‌గానూ ఉంది. ఇక్కడ సర్వీసు రోడ్లు నిర్మించకపోవడంతో చిత్తూరు నగర అభివద్ధికి అడ్డుకట్టగా చెప్పుకోవచ్చు.
సమన్వయ సమావేశమేదీ?


కొత్తగా జాతీయ రహదారిని నిర్మించేటప్పుడు.. అభివృద్ధి చేసేటప్పుడు ఆయా శాఖల అధికారుల సమన్వయ సమావేశం నిర్వహించాలి. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే దానిపై తీర్మానించుకోవాలి. చిత్తూరు- తచ్చూరు జాతీయ రహదారి విషయంలో ఇంతవరకు ఎలాంటి సమన్వయ సమావేశాన్ని నిర్వహించలేదు. అధికారులు కూడా ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సర్వీసు రోడ్ల విషయంపై సమాచారం కోసం పీడీ ప్రశాంత్‌ను ‘అంధ్రజ్యోతి ప్రతినిధి’ ఫోనులో సంప్రదించగా ఆయన నిరాకరించారు. ప్రజాప్రతినిధులు గట్టిగా పట్టించుకుంటేనే..?


ఇటీవల రైతు సదస్సులో పాల్గొనడానికి చిత్తూరు వచ్చిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సర్వీసు రోడ్ల విషయాన్ని ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రశాంత్‌ దృష్టికి తీసుకెళ్లారు. పై అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పీడీ చెప్పారు. ఈ సమస్యపై చిత్తూరు మండలంలోని బాధిత రైతులు, సర్పంచులు కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులును శనివారం కలవనున్నారు. ఈ సమస్యను ఎంపీ స్థాయిలో కేంద్రంలో గట్టిగా పోరాడితే తప్ప పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.


Read more