విలీనం.. వద్దంటే వద్దు
ABN , First Publish Date - 2022-07-07T06:34:13+05:30 IST
పాఠశాలల విలీనంపై బుధవారం కూడా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. బడుల వద్ద విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. 6, 7, 8 తరగతులను పక్క గ్రామాల్లోని పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను తాము అంగీకరించేదే లేదని స్పష్టంచేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.

రెండోరోజూ పాఠశాలల వద్ద నిరసనలు
పాఠశాలల విలీనంపై బుధవారం కూడా జిల్లాలో నిరసనలు కొనసాగాయి. బడుల వద్ద విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళనలు చేపట్టారు. 6, 7, 8 తరగతులను పక్క గ్రామాల్లోని పాఠశాలల్లో విలీనం చేయడం వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను తాము అంగీకరించేదే లేదని స్పష్టంచేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండు చేశారు.
బడి గేటుకు తాళం
గంగవరం, జూలై 6: గంగవరం మండలం బండమీద జరావారిపల్లెలో 6, 7, 8 తరగతులను పక్కపాఠశాలలో విలీనాన్ని నిరసిస్తూ రెండో రోజైన బుధవారం కూడా గేటుకు తాళం వేశారు. ఉపాధ్యాయులను లోపలకు పోనివ్వకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. కీలపట్ల పంచాయతీ బండమీదజరావారిపల్లె ప్రాధమికోన్నత పాఠశాలలో 1 నుంచి 8 వ తరగతి వరకు 176 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బండమీదజరావాల్లె ప్రాథమికోన్నత పాఠశాలలోని 6,7,8 తరగతుల విద్యార్థులను కీలపట్ల హైస్కూల్‌లో విలీనం చేయడానికి ప్రక్రియ మొదలైపోయింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆగ్రహానికి గురై పాఠశాల ప్రారంభమైన మొదటిరోజే పాఠశాల గేటుకు తాళం వేసి ఆందోళనలు చేపట్టిన విషయం విదితమే. మొదటిరోజు పాఠశాల తెరవకనే ఉపాధ్యాయులు వెనుదిరిగారు. రెండో రోజూ గేటుకు తాళంవేయడంతో ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది మధ్యాహ్నం వరకు పాఠశాల ఎదుటే నిరీక్షించాల్సి వచ్చింది. మధ్యాహ్నం పోలీసులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. విద్యాకమిటీ చైర్మన్‌ను పిలిపించి ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసి ఉపాధ్యాయులను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమన్నారు. ఏవైనా అభ్యంతరాలుంటే మండల, జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేయాలే కానీ, ఇలా తాళం వేయరాదన్నారు. టీచర్ల విధులకు అటంకం కల్పిస్తే సమస్యలను ఎదుర్కోవల్సివస్తుందని హెచ్చరించారు. దీంతో తల్లిదండ్రులు పాఠశాల గేటుకు వేసిన తాళం తీయడంతో ఉపాధ్యాయులు పాఠశాలలోనికి ప్రవేశించారు. తమ పిల్లలను మాత్రం పాఠశాలకు పంపబోమని గ్రామస్తులు స్పష్టంచేశారు. విలీన ప్రక్రియ రద్దుచేసే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు.

విలీన ప్రక్రియను అంగీకరించం
టీవీఎన్‌ఆర్ పురంలో విద్యార్థులు, గ్రామస్తుల ధర్నా
పాలసముద్రం: పాలసముద్రం మండలం టీవీఎన్‌ఆర్ పురం పాఠశాలలోని 6, 7, 8 తరగతులను తిరుమలరాజుపురం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. దీనికి నిరసనగా గ్రామస్తులు బుధవారమూ నిరసన కొనసాగించారు. తిరుమలరాజుపురం ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే 3 కిలోమీటర్లు దూరమన్నారు. అందుకే విలీన ప్రకియను అంగీకరించబోమని స్పష్టంచేశారు. పాఠశాల గేట్లకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. అధికారులు సానుకూలంగా స్పందించే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు.

‘విలీనం’ ఆపాల్సిందే
చిత్తూరు: చిత్తూరు నగరం మంగసముద్రం ప్రాథమికోన్నత పాఠశాలను సంతపేట పీఎన్‌సీ మున్సిపల్ పాఠశాలలో విలీనం చేసే ప్రతిపాదనను విరమించుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం పాఠశాల వద్ద ధర్నా చేశారు. మంగసముద్రం నుంచి సంతపేటకు విద్యార్థులు రోడ్లు దాటుకుని వెళ్లాల్సి ఉందన్నారు. ఇలాగైతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తాము ఉదయం పూట పనులకు వెళితే పిల్లలు పక్కనే ఉన్న పాఠశాలకు వెళ్లేవారన్నారు. సంతపేటకు మార్చడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అధికారులు గుర్తించి విలీన ప్రక్రియను ఆపాలని కోరారు.

మా పాఠశాలను విలీనం చేయొద్దు
బైరెడ్డిపల్లె: బైరెడ్డిపల్లె మండలం బెల్లంమడుగులోని ప్రాథమికోన్నత పాఠశాలను బేలుపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయవద్దని గ్రామస్తులు డిమాండు చేశారు. ఈ మేరకు ఆ గ్రామస్తులు బుధవారం ఎమ్మార్సీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో 6,7,8 తరగతులను బేలుపల్లె పాఠశాలలో విలీనం చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను దృష్టిలో వుంచుకుని జిల్లా విద్యా శాఖాధికారులు పాఠశాలను విలీనం చేయకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్సీ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట కూడా నిరసన తెలిపారు.
