కుప్పంలో ఆగిన విశాఖ-బెంగళూరు రైలు

ABN , First Publish Date - 2022-10-04T05:17:20+05:30 IST

విశాఖపట్టణం -బెంగళూరు వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (085 43, 44) రైలు సోమవారం ఉదయం కుప్పంలో ఆగింది.

కుప్పంలో ఆగిన విశాఖ-బెంగళూరు రైలు
కుప్పంలో ఆగిన రైలుకు పూజలు చేస్తున్న టీడీపీ శ్రేణులు

కుప్పం, అక్టోబరు 3: విశాఖపట్టణం -బెంగళూరు వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (085 43, 44) రైలు సోమవారం ఉదయం కుప్పంలో ఆగింది. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతోపాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సాయిమాతా సేవాట్రస్టు అధ్యక్షుడు జగదీష్‌బాబు తదితరులు చేసిన కృషివల్ల ఈనాడీ స్టాపింగ్‌ లభించింది. దీంతో టీడీపీ నేతలు ఆగిన రైలుకు పూజలు చేశారు. విశాఖ -బెంగళూరు రైలుకు కుప్పం స్టాపింగ్‌ ఇవ్వాల్సిందిగా చంద్రబాబునాయుడు, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్సీ భరత్‌, సాయిమాతా సేవాట్రస్టు అధ్యక్షుడు జగదీష్‌బాబులు రైల్వే ఉన్నతాధికారులకు వేర్వేరుగా లేఖలు రాశారు. రైల్వే అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కుప్పంలో మెడికల్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలతోపాటు ద్రావిడ విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు ఉన్నాయని, దేశం నలుమూలల నుంచి వచ్చి ఈ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు రైలు స్టాపింగ్‌ ఇవ్వడంవల్ల ఎంతో ఉయోగకరంగా ఉంటుందని వివరించారు. అలాగే వ్యాపారస్తులు, సామాన్య జనాలు కుప్పం నుంచి విశాఖ, విజయవాడలతోపాటు ఇతర ముఖ్య పట్ట ణాలకు వ్యాపారాలు చేయడానికి, రాకపోకలు సాగించడానికి వినియోగ పడుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ఉన్నతాధికారులు స్పందించి విశాఖ -బెంగళూరు వీక్లీ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు కుప్పంలో స్టాపింగ్‌ ఇచ్చారు. ఈ రైలు విశాఖ నుంచి బెంగళూరు వెళ్లేటపుడు ఉదయం 6:59 గంటలకు, బెంగళూరు నుంచి విశాఖ వెళ్లేటపుడు సాయంత్రం 5:04 గంటలకు కుప్పంలో ఆగుతుంది.  రైల్వే ఉన్నతాధికారులకు లేఖ రాసిన చంద్రబాబుకు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పీఎస్‌.మునిరత్నం, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, కుప్పం మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌, నాయకులు టీఎం.బాబు, రాజ్‌కుమార్‌, విశ్వనాథనాయుడులు ధన్యవాదాలు తెలిపారు. అలాగే  రైల్వే ఉన్నతాధికారులకు జగదీష్‌బాబు కృతజ్ఞతలు తెలియజేశారు. 

Read more