అమ్మో.. ఏనుగుల మంద

ABN , First Publish Date - 2022-12-07T02:13:16+05:30 IST

పలమనేరు మండలం మొసలిమడుగు గ్రామాన్ని 22 ఏనుగుల మంద గడగడలాడించాయి. నెల్లిపట్ల అటవీప్రాంతం నుంచి పందేరుపల్లి వడ్డూరు, కరిడిమడుగు, నూనెవారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పలు రకాల పంటలను సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. మంగళవారం వేకువజామున 5 గంటల సమయానికి మొసలిమడుగుకు చేరుకున్నాయి. ఏనుగల ఘీంకారాలు విన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు.

అమ్మో.. ఏనుగుల మంద
పలమనేరు- గుడియాత్తం రోడ్డుపై తిష్టవేసిన ఏనుగల మంద

గంగవరం, డిసెంబరు 6: పలమనేరు మండలం మొసలిమడుగు గ్రామాన్ని 22 ఏనుగుల మంద గడగడలాడించాయి. నెల్లిపట్ల అటవీప్రాంతం నుంచి పందేరుపల్లి వడ్డూరు, కరిడిమడుగు, నూనెవారిపల్లె పరిసర ప్రాంతాల్లోని పలు రకాల పంటలను సోమవారం రాత్రి ధ్వంసం చేశాయి. మంగళవారం వేకువజామున 5 గంటల సమయానికి మొసలిమడుగుకు చేరుకున్నాయి. ఏనుగల ఘీంకారాలు విన్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. అనుమానం వచ్చి మిద్దెలపైకెక్కి చూడగా, గ్రామసమీపంలో ఏనుగల మందను చూసి బిత్తర పోయారు. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 22 ఏనుగులు ఉన్నాయి. ఎక్కడ గ్రామంలోకి వస్తాయోనని భయాందోళనకు గురయ్యారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు, ట్రాకర్లు మొసలిమడుగు గ్రామం వద్దకు చేరుకొన్నారు. ఏనుగులను అడవిలోకి మళ్లించడానికి తీవ్రంగా ప్రయత్నించినా అవి ముందుకు కదలలేదు. ఈ ఏనుగుల మందలో నాలుగు గున్నలు ఉన్నాయి. వాటిని సంరక్షించుకుంటూ మొసలిమడుగు సమీపంలోని రోడ్డపైనే ఏనుగులు ఉండిపోయాయి. రోడ్డుకు ఓ వైపు సోలారు కంచె ఉండడంతో ప్రమాదం సంభవిస్తుందేమోనని గ్రహించి రోడ్డుపైనే అటూ ఇటూ తిరుగుతూ నిలిచిపోయాయి. ఇలా సుమారు 4 గంటల పాటు ఏనుగులు రోడ్డుపైనే తిష్ఠ వేయడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఆ తరువాత తెల్లవారుతుండగా ఏనుగుల మంద మెల్లగా అడవిలోకి వెళ్లిపోయాయి. మళ్లీ ఏనుగులు గ్రామం వైపు రాకుండా ట్రాకర్లు ముందుజాగ్రత్తగా మంగళవారం రాత్రి మొసలిమడుగు గ్రామ సమీపంలోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వాటి కదలికలను గుర్తిస్తూ అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-12-07T02:13:18+05:30 IST