తిరుపతిలో తుడా టవర్స్‌

ABN , First Publish Date - 2022-02-16T06:23:41+05:30 IST

మహానగరాల్లో మాత్రమే కనిపించే మెగా టవర్స్‌ ఇక తిరుపతిలోనూ వెలవనున్నాయి. ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ప్రణాళికలు సిద్ధం చేసింది. 20 అంతస్థులతో అన్నమయ్య సర్కిల్‌ సమీపంలోని 3.6 ఎకరాల్లో తుడా ఐకానిక్‌ టవర్స్‌ ఏర్పాటుకానున్నాయి.

తిరుపతిలో తుడా టవర్స్‌
ఐకానిక్‌ టవర్స్‌ డిజైన్‌ నమూనా

20 అంతస్థుల్లో సకల సదుపాయాలతో నిర్మాణం 


త్వరలో టెండర్లు పిలవనున్న అధికారులు 


తిరుపతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): మహానగరాల్లో మాత్రమే కనిపించే మెగా టవర్స్‌ ఇక తిరుపతిలోనూ వెలవనున్నాయి. ఆధునిక హంగులు, సకల సౌకర్యాలతో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) ప్రణాళికలు సిద్ధం చేసింది. 20 అంతస్థులతో అన్నమయ్య సర్కిల్‌ సమీపంలోని 3.6 ఎకరాల్లో తుడా ఐకానిక్‌ టవర్స్‌ ఏర్పాటుకానున్నాయి. లగ్జరీ ఫ్లాట్స్‌, కమర్షియల్‌ షాపులు, కార్యాలయాలు, స్పోర్ట్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు కొలువుదీరబోతున్నాయి. దీనికి సంబంధించిన డీటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టును తుడా తయారు చేసింది. నిర్మాణం కోసం ఆక్షన్‌కు వెళ్లే ప్రక్రియకు కసరత్తు చేస్తోంది. రెండు బేస్‌మెంట్‌ సెల్లార్లు కాకుండా గ్రౌండ్‌ఫ్లోర్‌ నుంచి 20 అంతస్థులతో బిల్డింగ్‌ ప్లాన్‌ డిజైన్‌ చేశారు. 


ఐకానిక్‌ టవర్స్‌లో వసతులివీ 


ఆలయం, స్విమ్మింగ్‌ పూల్‌, జాగింగ్‌ పార్కు, టెంపుల్‌, చిల్డ్రన్స్‌ ప్లే ఏరియా,  రెస్టారెంట్‌, బంకేట్‌ హాల్‌, సూపర్‌ మార్కెట్‌, బ్యాంక్‌, బ్యాడ్మింటన్‌ కోర్టులు, స్క్వాష్‌ కోర్టు, ఇతర ఇండోర్‌ క్రీడల సౌకర్యాలతో పాటు బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, క్రికెట్‌ ప్రాక్టీస్‌ నెట్స్‌, సైకిల్‌ ట్రాక్‌, జాగింగ్‌ ట్రాక్‌, పార్టీ లాన్‌, సీటింగ్‌ డెక్స్‌, మేజ్‌ గార్డెన్‌, యాంపిథియేటర్‌, మల్టీపర్పస్‌ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. రెసిడెన్షియల్‌ కోసం 2బీహెచ్‌కే- (1216 ఎస్‌ఎఫ్టీ), 3బీహెచ్‌కే (1798 ఎస్‌ఎఫ్టీ), 4 బీహెచ్‌కే (3638 ఎస్‌ఎఫ్టీ), 5 బీహెచ్‌కే -డూప్లెక్స్‌ (3606 ఎస్‌ఎఫ్టీ) ఫ్లాట్లను నిర్మించనున్నారు. కమర్షియల్‌, రెసిడెన్షియల్‌ మార్గాలు వేర్వేరుగా ఉండేలా డిజైన్‌ చేశారు.అన్నమయ్య సర్కిల్లో రైతు బజారుకు ఆనుకుని తుడాకు చెందిన 3.6 ఎకరాల స్థలం ఉంది. గతంలో స్థలమార్పిడి ద్వారా మున్సిపల్‌ కార్యాలయానికి ఈ స్థలం ఇచ్చేసి, ప్రస్తుత మున్సిపల్‌ కార్యాలయమున్న స్థలాన్ని తుడా తీసుకునేటట్టు ప్రతిపాదనలు జరిగాయి. కొన్ని కారణాలతో ఇరువర్గాలు ఒప్పందం నుంచి తప్పుకొన్నాయి. ఇప్పుడా స్థలంలో ఐకానిక్‌ టవర్స్‌ నిర్మించేందుకు తుడా సిద్ధమైంది. నిర్మాణం అనంతరం వాటికి ధర నిర్ణయించి ఆసక్తిగల వారికి విక్రయించనున్నారు. మొత్తానికి తుడా టవర్స్‌తో తిరుపతికి మరింత బ్రాండ్‌ ఇమేజ్‌ రానుంది.

Read more