గజగజ వణికిన చిత్తూరు జిల్లా

ABN , First Publish Date - 2022-12-10T00:06:25+05:30 IST

‘మాండస్‌’ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో చిత్తూరు జిల్లాలో శుక్రవారం చిరుజల్లులు, చల్లటి ఈదురు గాలులు వీచాయి.

గజగజ వణికిన చిత్తూరు జిల్లా
చౌడేపల్లె మండలం మల్లేలవారిపల్లెలో వర్షానికి కప్పిన వరి పంట

చిత్తూరు, ఆంధ్రజ్యోతి/ చిత్తూరు కలెక్టరేట్‌, డిసెంబరు 9: ‘మాండస్‌’ మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది. దీని ప్రభావంతో జిల్లాలో శుక్రవారం చిరుజల్లులు, చల్లటి ఈదురు గాలులు వీచాయి. చలితో ఇల్లు దాటి బయటికి రాలేకపోయారు. శుక్రవారం పగలంతా చెప్పుకోదగ్గ వర్షం పడకపోయినా, చలి వణికించింది. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత తుఫాను తీరం దాటే అవకాశం ఉంది. దీంతో శని, ఆదివారాల్లో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాలని యంత్రాంగం క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. శుక్రవారం రాత్రి వరకు భారీ వర్షాలు పడకపోయినా, ప్రమాద సూచన ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

గంట గంటకు వివరాల సేకరణ

చిత్తూరులో అన్ని శాఖలకు సంబంధించిన తుఫనుఉ ప్రభావం, నష్టాల వివరాలను గంటకోసారి సేకరించి, ఎప్పటికప్పుడు అమరావతికి పంపిస్తున్నారు. దీనికోసం డీఆర్వో రాజశేఖర్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేశారు. సీపీవో ఉమాదేవి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వర్షాల వివరాలను సేకరిస్తున్నారు. కలెక్టరేట్‌లో గురువారం నుంచే ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌ నిరంతరం పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల రాక

ముందు జాగ్రత్తలో భాగంగా 19 మందితో కూడిన జాతీయ విపత్తు దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), 30 మందితో కూడిన రాష్ట్ర విపత్తు దళం (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) జిల్లాకు చేరుకున్నాయి. పెనుమూరు మండలంలోని ఎన్టీఆర్‌ జలాశయంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ట్రయల్‌ రన్‌ నిర్వహించింది. జిల్లాలో ఎక్కడా పంటలకు నష్టం కలగలేదని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచే పాఠశాలలకు సెలవు ఇవ్వకుండా మధ్యాహ్నం నుంచి ప్రకటించడంతో జిల్లాలోని విద్యార్థులు ఇబ్బంది పడ్డారు.

వర్షపాతం ఇలా...

శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 వరకు రామకుప్పం, కుప్పం మినహా మిగిలిన 29 మండలాల్లో వర్షం పడింది. అత్యధికంగా నగరిలో 41.2 మిమీ వర్షపాతం నమోదైంది. జిల్లాకు సరిహద్దుల్లోని మండలాల్లో ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. మండలాలవారీగా.. విజయపురంలో 36.2, నిండ్రలో 32.4, కార్వేటినగరంలో 25.2, శ్రీరంగరాజపురంలో 20.2, సోమలలో 18.6, సదుంలో 18.4, పాలసముద్రంలో 16.4, వెదురుకుప్పంలో 16, గంగవరంలో 15.8, రొంపిచెర్లలో 14.2, పలమనేరులో 11.4, పులిచెర్లలో 11.2, ఐరాలలో 11, చౌడేపల్లెలో 10.8, పెనుమూరులో 8.4, పెద్దపంజాణిలో 8, పుంగనూరులో 7, గంగాధరనెల్లూరు, శాంతిపురం, వి.కోటలో 6.2 మిమీ చొప్పున, బైరెడ్డిపల్లె, పూతలపట్టు, తవణంపల్లెలో 5.6 వంతున, గుడిపాల, బంగారుపాళ్యంలో 5.4 చొప్పున, యాదమరిలో 5.2, చిత్తూరులో 3.2, గుడుపల్లెలో 0.6 మిమీ వర్షపాతం నమోదైంది.

పునరావాస కేంద్రాల్లోకి 312 మంది

శుక్రవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు పడకున్నా ముందుజాగ్రత్తగా లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నగరి మండలంలో 59 మందిని, నగరి అర్బన్‌లో 50 మందిని, నిండ్రలో 10, విజయపురంలో 8, సోమలలో 70, పాలసముద్రంలో 50, ఎస్‌ఆర్‌పురం మండలంలోని ఎస్టీకాలనీ, షికారీలను 65 మంది చొప్పున 312 మందిని ఆయా ప్రాంతాల్లోని పునరావాస కేంద్రాలకు పంపారు.

ఎక్కడెక్కడ పరిస్థితి ఎలా ఉందంటే..?

నగరి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో శుక్రవారమంతా చిరుజల్లులు పడగా, సాయంత్రం 6 నుంచి భారీ వర్షం పడింది. నగరి మండలంలోని మాంగాడు, కృష్ణారామపురం చెరువులను జేసీ వెంకటేశ్వర్‌ పరిశీలించారు. అనంతప్పనాయుడు కండిగ్ర వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా వస్తోందని, అక్కడి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు సూచించారు. విజయపురం మండలంలో గాలులకు పలుచోట్ల వరిపంట నేలవాలింది.

పుంగనూరు, పూతలపట్టు, జీడీనెల్లూరు ప్రాంతాల్లో చిరుజల్లులు మాత్రమే పడ్డాయి. చల్లటి గాలులతో ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. కుప్పం ప్రాంతంలో వర్షం, ఈదురుగాలులు లేకపోయినా చలి మాత్రం ఎక్కువగా ఉంది.

చిత్తూరులో రోజంతా చిరుజల్లులు పడ్డాయి. చలి తీవ్రంగా ఉండడంతో రోడ్లన్నీ బోసిపోయాయి. తుఫాను నేపథ్యంలో కార్పొరేషన్‌ అధికారులు ముందుగానే నీవానదిని ఎక్స్‌కవేటర్‌తో శుభ్రం చేయించారు. నదీ పరివాహక ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు రావాలని అవగాహన కల్పించారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ నగరంలోని గంగినేని చెరువును పరిశీలించారు. చెరువు కట్ట పటిష్టత, మొరవ ప్రాంతాలను పరిశీలించి నీటి ప్రవాహం పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు ఇచ్చారు.

పలమనేరులో చిరుజల్లులు, చలి గాలులతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. కలెక్టర్‌ హరినారాయణన్‌ పలమనేరు, గంగవరం మండలాల్లో పర్యటించారు.

క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు

ఈదురుగాలుల నేపథ్యంలో గుడిసెల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ ఆదేశించారు. శుక్రవారం ఆయన అధికారులతో టెలి కాన్ఫరెన్సు నిర్వహించారు. జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగుల వద్ద నీటి నిల్వ సామర్థ్యాన్ని నిరంతరం ఇరిగేషన్‌ అధికారులు పరిశీలించాలని సూచించారు. విద్యుత్తు శాఖ అధికారులు ఏర్పాటుచేసిన కంట్రోల్‌ రూమ్‌కు వచ్చే ఫిర్యాదులపైన ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తమిళనాడు సరిహద్దుల్లోని మండలాల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఇంట్లో నుంచి బయటికి రావొద్దు

మాండస్‌ తుఫాను, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ సూచించారు. విపత్తును సమర్థంగా ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజలూ అధికారులకు సహకరించాలని కోరారు.

ఎలాంటి పంట నష్టం జరగలేదు

చిత్తూరు (సెంట్రల్‌): మాండస్‌ తుఫాను ప్రభావం వల్ల జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి పంట నష్టం జరగలేదని జిల్లా వ్యవసాయాధికారి మురళీకృష్ణ శుక్రవారం తెలిపారు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ సిబ్బందిని, ఆర్జీకేలను అప్రమత్తం చేశామన్నారు. వర్షం కారణంగా ఎక్కడైనా పంట నష్టం వాటిళ్లితే వాటి వివరాలు వెంటనే తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. పశు సంపదకు నష్టం వాటిళ్లలేదని జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి వెంకట్రావు తెలిపారు.

169 మంది పునరావాస కేంద్రాలకు తరలింపు

నగరి: నగరి డివిజన్‌ పరిధిలోని పాలసముద్రం, విజయపురం, నగరి, నిండ్ర మండలాలకు చెందిన 169 మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు నగరి ఆర్డీవో సృజన తెలిపారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాల్లో బాధితులకు పునరావాసం కల్పించి వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించారు. నిండ్ర మండలంలో రెండు కుటుంబాలకు చెందిన నలుగురు పునరావాస కేంద్రానికి వెళ్లడానికి నిరాకరించడంతో తహసీల్దార్‌ అమరేంద్రబాబు, నిండ్ర ఎస్‌ఐ సహాయంతో వారిని తరలించారు.

5 గంటలు కరెంటు కట్‌

చౌడేపల్లె: మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8గంటల వరకు కరెంటు సరఫరా ఆగింది. పెద్ద వర్షం లేకపోయినా సరఫరా ఆగింది. రాష్ట్ర విద్యుత్‌ శాఖమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిఽథ్య నియోజకవర్గంలోని చౌడేపల్లె మండలంలో డిస్కం అధికారులు అందుబాటులో లేకపోవడంతో సమస్య నెలకొంటోందన్న విమర్శలున్నాయి. బిల్లేరు, ఎర్రప్పల్లె, పుదిపట్ల, విజయవాణి స్కూల్‌, పాపిశెట్టిపల్లె, 29ఏ చింతమాకులపల్లె, ఖాన్‌సాబ్‌మిట్ట, పీఎల్‌ కొత్తూరులో 5గంటలకు పైగా కరెంటు లేదని స్థానికులు తెలిపారు. పలు చోట్ల ఐదు నిమిషాలు కరెంట్‌ రావడం.. అరగంట పోతోందన్నారు. లద్దిగం, ఏకొత్తకోట, పరికిదొన విద్యుత్‌ సబ్‌స్టేషన్ల పరిధిలోని దాదాపు 30 గ్రామాల్లో విద్యుత్‌ సమస్య నెలకొంది. రాత్రి 8 గంటలకు కరెంట్‌ పునరుద్ధరించినా మళ్లీ కొన్ని గ్రామాల్లో సరఫరా ఆగింది. విజయవాణి స్కూల్‌ సమీపంలో మెయిన్‌లైన్‌పై టెంకాయ చెట్టు పడటంతో దాదాపు మండలమంతా కరెంట్‌ సమస్య నెలకొందని ఏఈ రాజశేఖర్‌ తెలిపారు. ఎప్పటికప్పుడు సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పారు.

Updated Date - 2022-12-10T00:06:27+05:30 IST