నేడే జాతరం సంబరం

ABN , First Publish Date - 2022-05-17T07:57:16+05:30 IST

తిరుపతి గంగ జాతర ప్రధాన ఘట్టానికి చేరుకుంది. అసలైన వేడుక మంగళవారం జరగనుంది. దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుంటారన్న అంచనాతో నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు.

నేడే జాతరం సంబరం
సారె తీసుకొస్తున్న మంత్రి పెద్దిరెడ్డితో ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి

వజ్రకిరీటధారియైు వెలిగిపోయిన గంగమ్మ

తిరుపతి, మే 16 (ఆంధ్రజ్యోతి) : తిరుపతి గంగ జాతర ప్రధాన ఘట్టానికి చేరుకుంది. అసలైన వేడుక మంగళవారం జరగనుంది. దాదాపు 50 వేల మందికి పైగా భక్తులు తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకుంటారన్న అంచనాతో నిర్వాహకులు ఏర్పాట్లు చేపడుతున్నారు.కాగా సోమవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గంగమ్మకు సారె తీసుకొచ్చారు.సాయంత్రం వేశాలమ్మ ఆలయంలో కైకాల వంశస్తులు ఇద్దరు సున్నపు కుండలను ధరించి ప్రధాన వీధులలోని ఇళ్లకు వెళ్లి హారతులందుకున్నారు.వారికి భక్తులు పాదపూజ చేసి మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం వేకువజాము వరకు వీళ్లు ఊరంతా తిరిగి పూజలందుకోవడం విశేషం.గంగమ్మ సోమవారం అర్ధరాత్రి నుంచే వజ్రకిరీటంలో దర్శనమిచ్చారు.విభిన్న వేషధారణలతో అలసిన అమ్మవారిని శాంతింపచేసేందుకు అర్చకులు మహాభిషేకం నిర్వహించారు.ప్రత్యేక పుష్పాలంకరణతో వజ్రకిరీటాన్ని ధరింపచేశారు.అమ్మవారి అభిషేక దర్శనం కోసం వేలాదిమంది భక్తులు బారులు తీరారు.

నేడు పేరంటాల వేషం 

పేరంటాల వేషాన్ని కైకాలవాళ్లే ధరిస్తారు. ఎర్రగళ్ల చీరను కట్టి, ఎర్రని గుడ్డలో ఒడిబాలను కట్టుకుంటారు. అందులో అక్షింతలు, చవ్వాకు, దువ్వెన, అద్దం, నల్ల గాజులు, పసుపు, కుంకుమ ఉంచుతారు. తలకు నల్లని గుడ్డను కట్టి కొప్పులా ముడివేసుకుంటారు. తలపై బంగారంలా కనిపించే అట్టలతో చేసిన జడ బిళ్లలు, పట్టీలు వంటి ఆభరణాలు కట్టుకుంటారు. పంబల వాయిద్యాలతో చాటు మండపం వద్దకు వెళ్లిన తరువాత బేరిశెట్టి ఇంటికి వెళ్లి అక్కడనుండి మరికొన్ని చోట్లకు వెళ్లి పేరంటాలు పూజలు అందుకుంటారు. అక్కడినుంచి బయల్దేరి బుధవారం వేకువజామున చిన గంగమ్మ చెంప నరికి ఆ తరువాత పెద గంగమ్మ చెంపను నరకడంతో జాతర సంబరం ముగుస్తుంది.


Updated Date - 2022-05-17T07:57:16+05:30 IST