పోలీసే గంజాయి దొంగ

ABN , First Publish Date - 2022-11-30T01:56:09+05:30 IST

చిత్తూరులో మాత్రం బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేసే ఓ రైల్వే కానిస్టేబుల్‌ మరో ఇద్దరితో కలిసి గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడు.

పోలీసే గంజాయి దొంగ

చిత్తూరు, నవంబరు 29: సాధారణంగా సంఘ విద్రోహ కార్యక్రమాలకు పాల్పడిన వారిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపుతారు. చిత్తూరులో మాత్రం బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగం చేసే ఓ రైల్వే కానిస్టేబుల్‌ మరో ఇద్దరితో కలిసి గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డాడు. చిత్తూరు రెండో పట్టణ ఎస్‌ఐ మల్లికార్జున్‌ తెలిపిన ప్రకారం.. సాధారణ తనిఖీల్లో భాగంగా మంగళవారం కాణిపాకం జంక్షన్‌ వద్ద పోలీసులు వాహనాలను చెకింగ్‌ చేశారు. తిరుపతి నుంచి కారులో వస్తున్న వారు.. పోలీసులను గమనించి కారును వెనుకవైపు తిప్పుకొని పారిపోవడానికి ప్రయత్నించారు. వీరిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కారులో ఉన్న మిట్టూరుకు చెందిన విజయ్‌కుమార్‌, ఓబనపల్లెకు చెందిన కిరణ్‌కుమార్‌, మహే్‌షకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. కారును తనిఖీ చేయగా రూ.50వేల విలువ చేసే 3.6 కిలోల గంజాయి లభ్యమైంది. నిందితుల్లో విజయ్‌కుమార్‌ 2013 బ్యాచ్‌లో పోలీసుగా ఎంపికై కాణిపాకంలో కొద్ది రోజులు ఉద్యోగం చేశాడు. అక్కడ నుంచి డిప్యుటేషన్‌పై రేణిగుంట రైల్వే స్టేషన్‌లో రైల్వే కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని.. ముగ్గురు నిందితులనూ రిమాండ్‌కు తరలించారు.

Updated Date - 2022-11-30T01:56:09+05:30 IST

Read more