మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం

ABN , First Publish Date - 2022-08-15T08:21:04+05:30 IST

ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు.

మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
ర్యాలీలో పాల్గొన్న నారాయణ, రామకృష్ణ, కార్యకర్తలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ


తిరుపతి(ఆటోనగర్‌), ఆగస్టు 14: ప్రధాని మోదీ పాలనలో దేశంలో ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం తిరుపతి జిల్లాస్థాయి పార్టీ ప్రథమ మహాసభలను స్థానిక ఇందిరా మైదానంలో నిర్వహించారు. ఈసందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో లాభాల్లో ఉన్న 16 ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెట్టిందని మండిపడ్డారు. ఓడ రేవులను ప్రైవేటీకరణ చేయడంతో టెర్రరి్‌స్టలు యథేచ్ఛగా దేశంలోకి చొరపడేందుకు బీజేపీ సహకరించేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక పార్లమెంట్‌లో విజయసాయిరెడ్డి రాష్ర్టాలకు 29శాతం పన్నుల మొత్తం కూడా రావడం లేదని ప్రశ్నిస్తే రాష్ట్రంలో సీఎం జగన్‌ మౌనంగా ఉండటం సరికాదన్నారు. మోదీపై ఈగ వాలితే మన ముఖ్యమంత్రి నోటితో తీయడానికి సిద్ధపడిపోతారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దిగజారిపోయిందని వాపోయారు. రాయలసీమ ప్రాంతంలో చిన్న కాలువను కూడా ఏర్పాటు చేయలేక పోయిందన్నారు. జిల్లా కార్యదర్శి పి.మురళి మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ సాధించిన విజయాలను తెలియజేశారు. అంతకుముందు నగర పాలక కార్యాలయం వద్ద నుంచి ఇందిరా మైదానం వరకు సీపీఐ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీని నారాయణ డప్పు కొట్టి ప్రారంభించారు. ర్యాలీలో ప్రజా నాట్యమండలి, డప్పు, భజన కళాకారులు నృత్యాలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో పి.హరినాథ్‌రెడ్డి, ఎ.రామానాయుడు, పెంచలయ్య, నాగరాజు, కుమార్‌రెడ్డి, రామచంద్ర, నదియా, విశ్వనాథ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Read more