రామకుప్పంలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-12-07T01:55:11+05:30 IST
నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న రామకుప్పంలోని శివాజీనగర్‌కాలనీ- రెడ్డివీధి కూడలిలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని దళితులు ఆందోళన చేపట్టారు. ఈ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకాలను గతంలో పోటాపోటీగా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం ప్రారంభమైంది.
రామకుప్పం, డిసెంబరు 5: నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న రామకుప్పంలోని శివాజీనగర్‌కాలనీ- రెడ్డివీధి కూడలిలో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూజలు చేసేందుకు అనుమతించాలని దళితులు ఆందోళన చేపట్టారు. ఈ కూడలిలో అంబేడ్కర్ విగ్రహం, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి శిలాఫలకాలను గతంలో పోటాపోటీగా ఏర్పాటు చేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం ప్రారంభమైంది. ఏడాదిగా అక్కడ 144, 145 సెక్షన్లతో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. పోలీసు పికెట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో అంబేడ్కర్ వర్ధంతిని పురస్కరించుకుని మంగళవారం తెల్లారిజాము నుంచే కుప్పం రూరల్ సీఐ రియాజ్‌అహ్మద్, రామకుప్పం, రాళ్లబూదుగూరు, గుడుపల్లె, వి.కోట ఎస్‌ఐలు ఉమామహేశ్వరరెడ్డి, మునస్వామి, రామలక్ష్మణరెడ్డి, రాంభూపాల్ సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. శివాజీనగర్‌వాసులు ఉదయం 11గంటలకు ర్యాలీగా పోలీసుస్టేషనుకు చేరుకున్నారు. అంబేడ్కర్ విగ్రహానికి పూజలు చేసేందుకు తమను అనుమతించాలని వినతిపత్రం ఇచ్చారు. నిషేధాజ్ఞలు తొలగే వరకు ఎవరికీ ప్రవేశం లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఆ అధికారం తహసీల్దారు పరిధిలో ఉందన్నారు. దీంతో వారు మండల సచివాలయానికి చేరుకున్నారు. అక్కడ తహసీల్దారు లేకపోవడంతో గేట్లు మూసేసి సుమారు గంటపాటు ధర్నా చేశారు. అక్కడ్నుంచి శివాజీనగర్- రెడ్డివీధి కూడలికి చేరుకుని అంబేడ్కర్ విగ్రహం వైపు దూసుకెళ్లగా పోలీసులు పురుషులను నిలువరించి దూరంగా పంపించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న తోపులాటల్లో ఓ ఎస్‌ఐ భుజానికి ఉన్న స్టార్లు కిందపడిపోయాయి. అదే సమయంలో మహిళలు విగ్రహానికి చేరువ కావడంతో, మహిళాపోలీసులు వారిని నిలువరించే ప్రయత్నంలో వాగ్వాదాలు, తోపులాటలు జరిగాయి. ఒకరిద్దరు మహిళా పోలీసులు, ఆందోళనకారులు కిందపడ్డారు. అనంతరం మహిళలు విగ్రహం ఎదుటే బైఠాయించారు. సాయంత్రం తహసీల్దారు సురే్‌షబాబు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. త్వరలో సమావేశం ఏర్పాటుచేసి సమస్య పరిష్కరిస్తామని సూచించారు. తేదీ కూడా వారినే నిర్ణయంచమని కోరారు. తాము అంబేడ్కర్ విగ్రహానికి పూజలు చేశాకే ఏ సమావేశాలైనా పెట్టుకోండని ఆందోళనకారులు తేల్చి చెప్పారు. దీంతో ఆయన వెనుదిరిగారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే ఆందోళనకారులు విజలాపురం-రామకుప్పం రహదారిపై టెంట్ ఏర్పాటు చేసి, వంటావార్పుతో నిరసన చేపట్టారరు.. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో కృష్ణరాజపురానికి చెందిన సుబ్రహ్మణ్యం తన మోటారు సైకిల్‌ను కాలనీ ఆర్చి వద్ద నిలిపి బజారుకు నడుచుకుంటూ వెళ్లారు. ఇంతలో ఆందోళనకారులు ఆ ద్విచక్రవాహనానికి నిప్పు పెట్టడంతో కాలిపోయింది. రాత్రి పొద్దుపోయే వరకూ ఆందోళన కొనసాగిస్తునే ఉన్నారు.