గొంతుకోసి.. ప్రాణం తీసి
ABN , First Publish Date - 2022-12-07T00:04:44+05:30 IST
చిత్తూరులో ఆటో డ్రైవర్ వడివేలు(40)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. సోమవారం మధ్యాహ్నం ఫోను రావడంతో ఇంటి నుంచి వెళ్లిన ఇతడు.. మంగళవారం ఉదయం శవమై కనిపించాడు.
చిత్తూరులో ఆటోడ్రైవర్ దారుణ హత్య
చిత్తూరు, డిసెంబరు 6: చిత్తూరులో ఆటో డ్రైవర్ వడివేలు(40)ను దుండగులు గొంతుకోసి హతమార్చారు. సోమవారం మధ్యాహ్నం ఫోను రావడంతో ఇంటి నుంచి వెళ్లిన ఇతడు.. మంగళవారం ఉదయం శవమై కనిపించాడు. చిత్తూరు తాలూకా సీఐ మద్దయ్య ఆచ్చారి తెలిపిన ప్రకారం.. నగరంలోని జాన్సన్ గార్డెన్‌కు చెందిన వడివేలుకు జీడీ నెల్లూరు మండలం వేల్కూరుకు చెందిన శెల్వితో 2017లో వివాహమైంది. ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్న వడివేలు సోమవారం మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చాడు. 3.30 గంటల సమయంలో ఫోన్ రావడతో బయలుదేరి వెళ్లాడు. మంగళవారం ఉదయం సీతమ్స్ కళాశాల ఎదురుగా ఉన్న మట్టిరోడ్డులో రక్తపు మడుగులో అతడి మృతదేహం కనిపించింది. స్థానికుల సమాచారంతో తాలూకా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యం తాగినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో ఇద్దరు లేదా ముగ్గురు కలిసి వడివేలు గొంతుకోసి చంపి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి పరిశీలించారు.
పాత కక్షలా.. వివాహేతర సంబంధమా..?
వడివేలు అన్న బాబును 2001లో మద్యంమత్తులో చోటుచేసుకున్న వాగ్వివాదంతో కొంతమంది బీరు బాటిల్‌తో కొట్టి చంపేశారు. అప్పట్లో జీడీ నెల్లూరు పోలీసులకు వడివేలు కొందరిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారేమైనా కక్ష పెంచుకుని చంపేశారా అనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. లేకపోతే వివాహేతర సంబఽంధమేదైనా ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఒకట్రెండు రోజుల్లో హంతకులను పట్టుకుంటామని తాలూకా సీఐ తెలిపారు.