కేవీపల్లెలో అక్రమ నిర్మాణాల నిలిపివేత

ABN , First Publish Date - 2022-02-23T06:46:46+05:30 IST

కేవీ పల్లె మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి జరుపుతున్న నిర్మాణాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అభినందించారు.

కేవీపల్లెలో అక్రమ నిర్మాణాల నిలిపివేత
ఆర్‌ఐ కార్యాలయ నిర్మాణాన్ని అడ్డుకుని బోర్డు ఏర్పాటు చేసిన తహసీల్దారు

తిరుపతి, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి) : కేవీ పల్లె మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి జరుపుతున్న నిర్మాణాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అభినందించారు. తాను మీడియా ద్వారా అక్రమ నిర్మాణాల గురించి వెలుగులోకి తీసుకురావడంతో వెంటనే స్పందించి నిర్మాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేసి ప్రభుత్వ స్థలాలను, భూములను రక్షించిన రెవెన్యూ సిబ్బంది తమ నిబద్దతను చాటుకున్నారని చెప్పారు. అయితే ఈ బోర్డులు తొలగించకుండా కాపాడాల్సిన బాధ్యత కూడా అధికారులపై వుందని చెప్పారు. పీలేరులో కూడా ఇదే విధంగా అధికారులు బాధ్యతగా వ్యవహరించి వుంటే వందల కోట్ల విలువైన భూములు కాపాడగలిగేవారన్నారు. బుధవారం పీలేరు ఆక్రమణలపై విచారణ జరపనున్న లోకాయుక్త దృష్టికి కూడా కేవీ పల్లె అక్రమ నిర్మాణాల వివరాలను తీసుకెళతామన్నారు. కాగా కేవీపల్లె మండలంలోని గర్నిమిట్ట గ్రామంలో ఆర్‌ఐ కార్యాలయాన్ని పడగొట్టి రూ.20 లక్షలకు అమ్మేశారని, అందులో జరుగుతున్న ఇళ్ళ నిర్మాణాలను కిశోర్‌కుమార్‌ రెడ్డి ఆధారాలతో సహా శుక్రవారం బయటపెట్టారు. అంతేగాకుండా అమ్మగారిచెరువు కట్టను పూడ్చి అందులో జరుగుతున్న షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణాలు, పెట్రోలు బంకు సమీపంలో జరుగుతున్న ఆక్రమణల గురించి కూడా ఆయన వెల్లడించారు. ఆ వెంటనే తహసీల్దారు నాగప్రసన్నలక్ష్మి చర్యలకు ఉపక్రమించారు. మంగళవారం సిబ్బందిని పురమాయించి పాత గ్రామ చావిడి (ఆర్‌ఐ కార్యాలయం), అమ్మగారిచెరువు, పెట్రోలు బంకు సమీపంలో జరుగుతున్న నిర్మాణాల వద్ద బోర్డులు పెట్టించారు. తహసీల్దారు ఆదేశాలపై సర్వేయర్‌ లింగేశ్వర్‌, వీఆర్వో శ్రీనివాస్‌, కార్యదర్శి పంచరత్న ఇతర రెవెన్యూ సిబ్బంది ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. 

Updated Date - 2022-02-23T06:46:46+05:30 IST