టీడీపీ నేతలపై రాళ్లదాడి
ABN , First Publish Date - 2022-12-31T02:12:11+05:30 IST
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఆయన వ్యతిరేకులు ఏ కార్యక్రమం చేపట్టినా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారు. భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకూ దిగుతున్నారు.
పుంగనూరు, డిసెంబరు 30: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఆయన వ్యతిరేకులు ఏ కార్యక్రమం చేపట్టినా వైసీపీ శ్రేణులు అడ్డుకుంటున్నారు. భయభ్రాంతులకు గురిచేసేలా దాడులకూ దిగుతున్నారు. ఇలా, పారిశ్రామిక వేత్త రామచంద్రయాదవ్‌ను వెంటాడి.. అరాచాలకు పాల్పడిన వీరు తాజాగా తెలుగుదేశం పార్టీపై పడ్డారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ఆ పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా రామచంద్రారెడ్డి, నేతలను అడ్డుకున్నారు. రాయి విసరడంతో ఆయన కారు అద్దం పగిలింది. ఎందుకింత ఉలికిపాటుతో వ్యవహరిస్తున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లోకి వెళ్లకుండా విపక్షాలను కట్టడి చేయడం.. దాడులకు దిగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
తొలుత సోమల దళితవాడలో..
‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. సోమల మండలం ఉప్పరపల్లెలో శుక్రవారం చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రొంపిచెర్ల నుంచి చల్లా రామచంద్రారెడ్డి ఉదయం బయలుదేరారు. సోమలలోని కందూరు క్రాస్ వద్ద టీడీపీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికి.. ర్యాలీగా పెద్దఉప్పరపల్లెకు బయల్దేరారు. సోమల దళితవాడకు రాగానే కొందరు వైసీపీ శ్రేణులు ర్యాలీకి అడ్డుతగలి ఉప్పరపల్లెకి వెళ్లడానికి వీల్లేదంటూ రోడ్డుకు అడ్డంగా నిలబడి గొడవకు దిగారు. మీరెవరు అడ్డుకోవడానికి అని టీడీపీ శ్రేణులు ఎదురు తిరగడంతో వారు కాస్త వెనక్కి తగ్గారు. ఇంతలోనే గుంపులోనుంచి ఓ రాయి చల్లా బాబు కారు వెనుక పడటంతో అద్దం పగిలింది. పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పి పంపారు.
నంజంపేటకు రాగానే..
నంజంపేటలో వైసీపీ శ్రేణులు, మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు అడ్డుకుని ఉప్పరపల్లెకు వెళ్లేందుకు ఒప్పుకోబోమని అడ్డుతగిలారు. టీడీపీ నేతలు ఎదురు తిరిగి దూసుకుపోగా సోమల, సదుం ఎస్‌ఐలు లక్ష్మీకాంత్, మారుతి, సిబ్బంది అడ్డుతగిలి గొడవలు వద్దని సూచించారు. మీరెందుకు అడ్డుతగులుతారని, వైసీపీ వారిని పంపించేయాలంటూ పోలీసులపై బాబురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండుగంటల పాటు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య వాగ్వాదం, కేకలు, డీజే పాటలతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఇంతలో వైసీపీ శ్రేణులు కర్రలు, రాళ్లు ప్రదర్శిస్తూ కవ్వించడంతో టీడీపీ వారూ ఎదురు దాడికి దిగారు. పరస్పర రాళ్ల దాడితో ఉద్రిక్తత నెలకొంది. సోమల ఎస్‌ఐ లక్ష్మీకాంత్, పలువురు టీడీపీ, వైసీపీ శ్రేణులకు గాయాలయ్యాయి.
మళ్లీ మళ్లీ దాడి చేసి..
వైసీపీ వారు వెనక్కి వెళ్లడంతో 10 వాహనాలు, 150 మోటారు సైకిళ్లతో నంజంపేట నుంచి టీడీపీ నాయకులు, చల్లా బాబు ఉప్పరపల్లెకు బయలుదేరారు. కొద్దిసేపటికే టీడీపీకి చెందిన ఐదు కార్లు, జీపుల అద్దాలను వైసీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలిసి ముందు వెళ్లిన వారు వెనక్కి వచ్చారు. అంతలో చల్లా బాబు కారు అద్దంపైనా రాళ్లు వేసి పగలగొట్టారు.
నామమాత్రంగానే పోలీసులు
నంజంపేటలో వందల మంది ఇరువర్గాలు ఘర్షణకు తలపడగా వారిని నివారించడానికి కేవలం ఇద్దరు ఎస్‌ఐలతో 20 మంది పోలీసులే ఉన్నారు. టీడీపీ శ్రేణులు భారీగా ఉండటంతో పెద్ద ప్రమాదం జరగలేదు. లేదంటే పరిస్థితులు అదుపు తప్పి ఉండేవని టీడీపీ నేతలు అంటున్నారు. కనీసం సీఐ స్థాయి అధికారి కూడా లేరు. ఇరువర్గాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
గతంలో బాదుడే బాదుడునూ అడ్డుకుని..
పుంగనూరు మండలం వనమలదిన్నె పంచాయతీ కుమ్మరిగుంటలో ఏప్రిల్ 17న టీడీపీ నాయకులు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో టీడీపీ వారు పర్యటించరాదని, మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడరాదని కౌన్సిలర్ మనోహర్, మరికొందరు హుకుం జారీ చేశారు. ఈ వివాదంలో ఘర్షణ జరిగింది. తనపై దాడి చేశారని మనోహర్ ఫిర్యాదు మేరకు 10 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పెద్దిరెడ్డికి గుణపాఠం తప్పదు: చల్లా
పోలీసులను అడ్డుపెట్టుకుని రాజ్యమేలుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి త్వరలో ప్రజల నుంచి గుణపాఠం తప్పదని చల్లా బాబు హెచ్చరించారు. వైసీపీ బెదిరింపులకు భయపడేదిలేదన్నారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకునేందుకు ప్రాణాలైనా ఇస్తానన్నారు. చంద్రబాబు నాయుడు, లోకేశ్ మాట్లాడారని, దీనిపై ఏమి చేయాలో శనివారం అధిష్ఠానం ఆదేశాలతో నిర్ణయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు తాను అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని కోరారు.
ప్రజాస్వామ్యం చచ్చిపోయింది: ఆర్సీవై
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల పుంగనూరులో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని పారిశ్రామికవేత్త బి.రామచంద్రయాదవ్ ఆందోళన వ్యక్తంచేశారు. టీడీపీ శ్రేణులపై జరిగిన దాడులను ఖండించారు. ఇక్కడ ప్రభుత్వానికి సమాంతరంగా వ్యవస్థలను నడుపుతూ పోలీసు, రెవెన్యూశాఖలను ఆయన కనుసన్నల్లో పెట్టుకుని నియంతలా వ్యవహరిస్తున్నారని పెద్దిరెడ్డిపై మండిపడ్డారు. పెద్దిరెడ్డి, వైసీపీ తప్ప ఇతరులు ఏ కార్యక్రమం చేసినా అణచి వేయాలనుకోవడం కుదరదన్నారు. ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పుంగనూరులో ఏం జరుగుతుందో ఇప్పటికైనా తెలుసుకనిఇ పెద్దిరెడ్డిని మంత్రి పదవి నుంచి తొలగించాలని సీఎం జగన్‌ను కోరారు.
పోలీసుల విజ్ఞప్తితో టీడీపీ నేతలు వెనక్కి..
దాడి నేపథ్యంలో పరిసర ప్రాంతాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు వస్తున్నారని, పెద్ద గొడవలు జరుగుతాయని పోలీసులు తెలిపారు. వెనక్కి వెళ్లి తమకు సహకరించాలని టీడీపీ నేతలను కోరగా.. వారు వెనుదిరిగారు. వైసీపీ వర్గంలో గాయపడ్డ రాజారెడ్డి, వాసుదేవరెడ్డి, మనోహర్, శంకరయ్య, బాలసుబ్రహ్మణ్యం సోమల పోలీసులకు ఫిర్యాదు చేసి, స్థానిక వైద్యశాలలో చికిత్స పొందారు. కాగా టీడీపీ వర్గీయులు ఐదుగురు బయట ప్రాంతాల్లో చికిత్స కోసం వెళ్లారు. వీళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.