‘భూమాయ’ కేసులో ఏడుగురి అరెస్టు

ABN , First Publish Date - 2022-10-01T06:40:14+05:30 IST

ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇలా ‘చిత్తూరులో భూమాయ’కు పాల్పడిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు.

‘భూమాయ’ కేసులో ఏడుగురి అరెస్టు
నిందితులను మీడియాకు చూపిస్తున్న ఏఎస్పీ జగదీష్‌

బాధితుల ఫిర్యాదుతో బయటపడిన వ్యవహారం

రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖల అధికారులు, సిబ్బంది పాత్రపైనా విచారణ

ఏఎస్పీ జగదీష్‌ వెల్లడి

చిత్తూరు, సెప్టెంబరు 30: ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేశారు. ఇలా ‘చిత్తూరులో భూమాయ’కు పాల్పడిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రెవెన్యూ, సబ్‌ రిజిస్ర్టార్‌, బ్యాంకు అధికారులు, సిబ్బంది పాత్రపైనా దర్యాప్తు చేస్తున్నారు. ఈ వివరాలను డీఎస్పీ సుధాకర్‌రెడ్డి, ఒకటో పట్టణ సీఐ నరసింహరాజుతో కలిసి అదనపు ఎస్పీ జగదీష్‌ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. తన భూమిని తనకు తెలియకుండానే మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసేసి.. కబ్జా జరిగిందని చిత్తూరు కట్టమంచికి చెందిన దినే్‌షకుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 1981లో కట్టమంచి రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నెంబరు 459-1, 461-1లో 5.02 ఎకరాల భూమిని మీనాక్షి, పద్మావతమ్మ, పెరి అన్నన్‌, కృష్ణమూర్తి నుంచి దినే్‌షకుమార్‌ తండ్రి వెంకటాచలపతి కొనుగోలు చేశారు. 2252, 2254, 2255 నెంబర్లతో రిజిస్ట్రేషన్‌ అయింది. అడంగళ్‌లో మాత్రం మీనాక్షి పేరు ఉంది.  భూమి యజమానిగా ఉన్న దినే్‌షకుమార్‌ను మోసం చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్‌రెడ్డి, యమున కలిసి చిత్తూరు సబ్‌ రిజిస్ర్టేషన్‌ కార్యాలయం వద్ద పనిచేస్తున్న సురేంద్ర, జయచంద్ర, అలంకార్‌ కుమార్‌, మరి కొందరు డాక్యుమెంట్లను మార్చారు. దాంట్లో మీనాక్షి భర్త దొరస్వామిరెడ్డిగా, వారి సంతానంగా కరుణాకర్‌రెడ్డి, యమునపై ఫేక్‌ డాక్యుమెంట్లను తయారు చేసి రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇదంతా పోలీసుల దర్యాప్తులో తేలడంతో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరి నుంచి మూడు సెల్‌ఫోన్లు, ఫేక్‌ డాక్యుమెంట్లు తయారు చేయానికి ఉపయోగించిన కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు వీరే 

తవణంపల్లె మండలం కొత్తగోనేపల్లెకు చెందిన ఎన్‌.రాజశేఖర్‌రెడ్డి, యుమున, బంగారుపాళ్యం మండలం కూర్మాయిపల్లెకు చెందిన కరుణాకర్‌రెడ్డి, జీడీ నెల్లూరు మండలం న్యూ కాలనీకి చెందిన డి.శేఖర్‌, చిత్తూరు నగరం గుర్రప్పనాయుడు కాలనీకి చెందిన ఎస్‌.అశోక్‌కుమార్‌. రెండు కేసుల్లో వీరిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

అధికారుల ప్రమేయంపై విచారణ

భూముల అక్రమ రిజిస్ర్టేషన్లు వ్యవహారంలో రెవెన్యూ, సబ్‌ రిజిస్ర్టార్‌, బ్యాంకు అధికారులు, సిబ్బందిపై విచారణ కొనసాగుతోందని ఏఎస్పీ జగదీష్‌ చెప్పారు. పెద్దల నుంచి సంక్రమించిన భూములు, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోకుండా దూరప్రాంతాల్లో ఉన్న వారి వారి భూముల వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు.


కబ్జా.. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాలివే 

చిత్తూరు నగరం మిట్టూరులో డాక్టర్‌ అల్తాఫ్‌ ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ర్టేషన్‌ చేశారు. ఈ స్థలం విలువ రూ.కోటిగా ఉందని అంచనా. ఫ కట్టమంచిలో బాలగురునాథంకు సంబంధించి సర్వే నెంబరు 507-2బి, 507-2ఎలో మొత్తం 5.05 ఎకరాల భూమి. దీని విలువ రూ.10 కోట్లు. ఫ కొంగారెడ్డిపల్లెలోని ఐటీఐ వద్ద విశాలాక్షమ్మకు సంబంధించి సర్వే నెంబరు 444, 446లో 0.52 సెంట్లు. ఈ భూమి విలువ రూ.5కోట్లు. ఫ దుర్గానగర్‌కాలనీలో ఏపీ సంక్షేమ సంఘానికి సంబంధించి సర్వే నెంబరు 189లో ఫ్లాట్‌. దీని విలువ రూ.5కోట్లు. ఫ మంగసముద్రంలోని ప్రభుత్వ భూమికి సంబంధించి సర్వే నెంబరు 90-2లో 70 సెంట్ల భూమి. దీని విలువ రూ. 1.20 కోట్లు. ఫ మదనపల్లెకు చెందిన మన్సూర్‌ అలీఖాన్‌కు సంబంధించి సర్వె నెంబరు 199-1లో ఉన్న భూమి విలువ రూ.కోటి. ఫ కట్టమంచిలో సర్వే నెంబరు 507-1బి, 507-2బిలో 4.20 ఎకరాలు. దీని విలువ రూ. 5కోట్లు. ఫ కొంగారెడ్డిపల్లెకి తారాపతి నాయుడుకు సంబంధించి సర్వే నెంబరు 84, 85లో రూ.30 కోట్ల విలువ చేసే భూమి కూడా ఉంది. దీనినే బ్యాంకులో తనఖా పెట్టి రూ.18 కోట్ల రుణం తీసుకున్నారు.

నిందితులకు 16 వరకు రిమాండు

చిత్తూరు, లీగల్‌: భూమాయ కేసులోని నిందితులకు చిత్తూరు న్యాయస్థానం అక్టోబరు 16వ తేది వరకు రిమాండు విధించింది. అరెస్టు చేసిన ఏడుగురిని పోలీసులు శుక్రవారం చిత్తూరులోని నాలుగో కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి శ్రీనివాస్‌ రిమాండు విధించారు. 


Read more