ఇంకా సగం మందికి జీతాల్లేవ్!
ABN , First Publish Date - 2022-10-08T04:57:54+05:30 IST
ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు దసరా పండుగకు దూరమయ్యారు. ఒకటో తేదిన రావాల్సిన వేతనాలు.. పండుగ వచ్చి వెళ్ళినా శుక్రవారం నాటికి కూడా సగం మందికి రాలేదు.
దసరా వెళ్లినా తప్పని ఎదురుచూపులు
విశ్రాంత ఉద్యోగుల పడిగాపులు
చిత్తూరు కలెక్టరేట్, అక్టోబరు 7: ప్రభుత్వ నిర్వాకంతో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు దసరా పండుగకు దూరమయ్యారు. ఒకటో తేదిన రావాల్సిన వేతనాలు.. పండుగ వచ్చి వెళ్ళినా శుక్రవారం నాటికి కూడా సగం మందికి రాలేదు. ఉమ్మడి జిల్లాలో సచివాలయ ఉద్యోగులతో కలిపి 50,361 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ప్రతినెలా ఒకటిన వీరికి వేతనాలు అందాలి. గత మూడేళ్ళుగా ఒకటో తేదీన జీతాలు పడ్డ దాఖలాలు లేవు. అక్టోబరు ఒకటిన పడాల్సిన వేతనం ఆరురోజులుగా విడతలవారీగా 50శాతం మంది ఉద్యోగులకు మాత్రమే వేతనాలు పడ్డాయి. మిగిలినవారు జీతాల కోసం నిరీక్షించక తప్పలేదు. ఇదేవిధంగా విశ్రాంత ఉద్యోగుల బాధ వర్ణనాతీతంగా ఉంది. పండుగకు కూడా 50శాతం మంది పెన్షనర్లకు పెన్షన్లు రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. జిల్లాలో పెన్షనర్లు 29,824 మంది ఉన్నారు. వీరికి సుమారు రూ.90 కోట్ల మేర పెన్షన్ల రూపంలో ప్రతినెలా అందుతాయి. వయోభారం, అనారోగ్యం కారణంగా విశ్రాంత ఉద్యోగులు పనిచేయలేని స్థితిలో ఉన్నారు. వీరందరూ ఒకటో తేదీన వచ్చే పెన్షన్‌కోసం ఎదురుచూస్తుంటారు. ఒకటో తేదిన పెన్షన్ రాని కారణంగా చేతిలో డబ్బుల్లేక రోజువారి అవసరాలు, మందులు, వైద్యావసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు.
పెన్షన్లు అందక ఇబ్బందులు
నూటికి డెబ్బై శాతం మంది విశ్రాంత ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షనే ఆధారం. అవసరమైన వైద్యం చేయించుకోవాలన్నా, నాలుగు మెతుకులు తినాలన్నా పెన్షన్ అవసరం. ఇప్పటికీ సగం మందికి పెన్షన్ రాలేదని చెబుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఒకటో తేదీకే పెన్షన్ ఇవ్వాలి. దసరా పండుగకు కూడా సకాలంలో పెన్షన్ ఇవ్వకపోవం బాధాకరం.
- ఎన్.కేశవులు, జిల్లా విశ్రాంత ఉద్యోగులు సంక్షేమసంఘ అధ్యక్షుడు