ఏర్పేడు తహసిల్దారుకు రివర్షన్‌

ABN , First Publish Date - 2022-10-18T06:47:50+05:30 IST

ఏర్పేడు తహసిల్దారు ఉదయ్‌ సంతోష్‌ రివర్షన్‌కు గురయ్యారు. తహసిల్దారుగా వున్న ఆయనను డిప్యూటీ తహసిల్దారుగా రివర్షన్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేడో రేపో చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో పనిచేస్తున్న మరో ముగ్గురు తహసిల్దార్లపైనా ఇదే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

ఏర్పేడు తహసిల్దారుకు రివర్షన్‌
తహసిల్దారు ఉదయ్‌ సంతోష్‌

నేడో రేపో మరో ముగ్గురిపై చర్యలు

ప్రభుత్వ భూమిని అనర్హులకు కట్టబెట్టిన పర్యవసానం

చర్యలు ఆపేందుకు తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్ళు


తిరుపతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ఏర్పేడు తహసిల్దారు ఉదయ్‌ సంతోష్‌ రివర్షన్‌కు గురయ్యారు. తహసిల్దారుగా వున్న ఆయనను డిప్యూటీ తహసిల్దారుగా రివర్షన్‌ చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నేడో రేపో చిత్తూరు, తిరుపతి జిల్లాల పరిధిలో పనిచేస్తున్న మరో ముగ్గురు తహసిల్దార్లపైనా ఇదే చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం మేరకు.... ఏర్పేడు తహసిల్దారు ఉదయ్‌ సంతోష్‌ 2018కి మునుపు కడప జిల్లాలో పనిచేసే సమయంలో ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున పట్టాలు జారీ చేసి అనర్హులకు కట్టబెట్టినట్టు ప్రభుత్వానికి, లోకాయుక్తకు ఫిర్యాదులందాయి. ఇతడితో పాటు మరో ముగ్గురు అధికారులపై కూడా ఇదే రీతిలో ఫిర్యాదులు అందాయి. దీనిపై లోకాయుక్త విచారణ కొనసాగుతోంది. సమాంతరంగా రెవిన్యూ శాఖ చేపట్టిన విచారణలో ఉదయ్‌ సంతోష్‌ అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. ఫలితంగా ఆయనకు డీటీగా రివర్షన్‌ ఇస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వులు జారీ చేసింది. డీటీగా కూడా నాన్‌ ఫోకల్‌ పోస్టులో నియమించాలని అందులో పేర్కొన్నట్టు సమాచారం. కాగా నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూములను ఇతరులకు కట్టబెట్టిన వ్యవహారంలో బాధ్యులైన అధికారులు చర్యలకు గురి కాకుండా తీవ్రస్థాయిలో రాజకీయ ఒత్తిళ్ళు వస్తున్నట్టు సమాచారం. రివర్షన్‌ ఉత్తర్వులు జారీ కాకుండా అడ్డుకోవడం కోసం అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులు అమరావతిలోనే తిష్టవేసినట్టు తెలిసింది. అయితే సీసీఎల్‌ నుంచీ ఆదేశాలు ఇప్పటికే జారీ అయిపోయిన నేపధ్యంలో ఇక సచివాలయ స్థాయిలో చేయగలిగిందేమీ లేదని సమాచారం. అందుకే సీఎం పేషీ స్థాయిలో అధికార పార్టీ నేతలు ఈ అధికారులపై చర్యలు ఆపించడానికి తీవ్రంగా యత్నిస్తున్నట్టు తెలిసింది. ప్రభుత్వ భూములను నిబంధనలకు విరుద్ధంగా ఇతరులకు కట్టబెట్టిన వ్యవహారంలో బాధ్యులైన అధికారులను పాలకపార్టీ నేతలు వెనకేసుకురావడం, వారిపై చర్యల నిలిపివేతకు రంగంలోకి దిగడం విమర్శలకు దారి తీస్తోంది. దీనివల్ల రెవిన్యూ శాఖలో పనిచేసే ఇతర అధికారులకు భయం లేకుండా పోతుందని, ఎలాంటి అక్రమాలకు పాల్పడినా రాజకీయ అండదండలు వుంటే చర్యలకు గురికాకుండా తప్పించుకోవచ్చుననే భావన ప్రబలే ప్రమాదం వుంది.

Read more