భూ నిర్వాసితులకు త్వరగా నష్టపరిహారం: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-03-05T06:57:22+05:30 IST

జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేసి.. నిర్వాసితులకు త్వరగా నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు.

భూ నిర్వాసితులకు త్వరగా నష్టపరిహారం: కలెక్టర్‌
రెవెన్యూ అధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 4: జాతీయ రహదారుల నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ వేగవంతం చేసి.. నిర్వాసితులకు త్వరగా నష్టపరిహారం చెల్లించాలని కలెక్టర్‌ హరినారాయణన్‌ తెలిపారు. కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాలులో శుక్రవారం ఆయన రెవెన్యూ అధికారులతో సమావేశమయ్యారు. కోర్టు కేసులున్నవి మినహా మిగిలిన చోట్ల భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. వీకోట, పలమనేరు, పుంగనూరు ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి సంబంధించి స్థానిక తహసీల్దార్ల సహకారం తీసుకుని పర్యవేక్షించాలని మదనపల్లె ఆర్డీవో మురళికి సూచించారు. చిత్తూరు- తచ్చూరు రహదారి విషయంలో భూ నిర్వాసితులకు రెండు రోజుల్లో నష్టపరిహారం డిపాజిట్‌ చేస్తామని చిత్తూరు ఆర్డీవో రేణుక తెలిపారు. తిరుపతి- రేణిగుంట రహదారికి 97 శాతం భూ సేకరణ జరిపి 91 శాతం నష్టపరిహారం చెల్లించామని ఆర్డీవో కనక నరసారెడ్డి తెలిపారు. పలమనేరు, బైరెడ్డిపల్లె, వీకోట, గంగవరం మండలాల్లో పరిశ్రమల స్థాపనకు భూములను గుర్తించాలని కలెక్టర్‌ చెప్పారు. ఈ సమావేశంలో జేసీ రాజాబాబు, ఇన్‌ఛార్జీ డీఆర్వో రాజశేఖర్‌, ఏపీఐఐసీ జెడ్‌ఎం సువర్ణసోనీ, పలువురు తహసీల్దార్లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-03-05T06:57:22+05:30 IST