వరవకాలువకు చెర

ABN , First Publish Date - 2022-08-06T06:51:52+05:30 IST

శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా తొట్టంబేడు మండలంలో భూఆక్రమణలపై నిత్యం వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. సుమారు ఐదు నెలల క్రితం ఇక్కడ పనిచేసిన తహసీల్దారు అవకతవకలకు పాల్పడి ఏసీబీ తనిఖీల్లో పట్టుబడి సస్పెండ్‌ కావడం సంచలనం రేపింది. అయినా ఆక్రమణలు మాత్రం ఆగడంలేదు.

వరవకాలువకు చెర
యంత్రాలతో జోరుగా సాగుతున్న చేపలగుంట పనులు

చిట్టత్తూరులో దర్జాగా కబ్జా

ఏడాదిక్రితం ఆక్రమిత స్థలంలో చేపలగుంట తవ్వకం

మళ్లీ అక్కడే మరో భారీ చేపలగుంత కోసం తవ్వకాలు


  శ్రీకాళహస్తి, ఆగస్టు 5: శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో కబ్జారాయుళ్లు చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా తొట్టంబేడు మండలంలో భూఆక్రమణలపై నిత్యం వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. సుమారు ఐదు నెలల క్రితం ఇక్కడ పనిచేసిన తహసీల్దారు అవకతవకలకు పాల్పడి ఏసీబీ తనిఖీల్లో పట్టుబడి సస్పెండ్‌ కావడం సంచలనం రేపింది. అయినా ఆక్రమణలు మాత్రం ఆగడంలేదు.తాజాగా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు రెవెన్యూ పరిధిలోని వరవ కాలువను మింగేసేందుకు  కొందరు ముమ్మరంగా పనులు సాగిస్తున్నారు. ఏడాది క్రితమే ఆక్రమణ పనులు ప్రారంభించి ఒక చేపల గుంతను ఏర్పాటు చేశారు. ఇక అడిగేవారే లేరన్న ధీమాతో పక్కనే అదే వరవ కాలువలో పదిరోజుల నుంచి మరో భారీ చేపలగుంతను తవ్వేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు పదేపదే గ్రామస్తులు ఫిర్యాదు చేస్తున్నా చుట్టపుచూపుగా వరవకాలువ స్థలాన్ని పరిశీలించి చోద్యం చూస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొట్టంబేడు మండలం చిట్టత్తూరు రెవెన్యూ పరిధిలోని గాజులకండ్రిగలో 30 కుటుంబాలు నివసించే ఎస్టీకాలనీ ఉంది.సర్వే నెంబరు 427/3లో 1.60ఎకరాలు, సర్వే నెంబరు 428/4లో 1.20ఎకరాలు, 425/1లో 1.15ఎకరాలు వరవకాలువ ఉంది. ఈ సర్వే నెంబర్ల ప్రదేశంలో మూడు వైపుల నుంచి వరవ కాలువలు చేరుతాయి. ఈ కాలువకు దక్షిణం దిక్కున 337 సర్వే నెంబరులో ఒకరికి మూడెకరాల డీకేటీ పొలం ఉంది.ఆయన తిరుపతిలో కాపురముంటూ స్వగ్రామానికి వచ్చి వెళుతుంటాడు. విస్తారంగా వరవకాలవ భూమి కనపడటంతో గత యేడాది చిట్టత్తూరు గ్రామంలో కొందరితో కలిసి ఆక్రమణకు పథకం రచించారు. సర్వే నెం.425/1లోని వరవకాలువ భూమిని ఏడాది క్రితం గుట్టుచప్పుడు కాకుండా ఆక్రమించి చేపలగుంతగా మార్చేశాడు. తిరుపతికి చెందిన ఓ చేపల వ్యాపారికి అపుడే గుంతను కూడా అమ్మేసి సొమ్ము చేసుకున్నారు.ఆ చేపలగుంతకు ఆనుకుని పడమర వైపున 427/3లో ప్రస్తుతం వరవ కాలువ మొత్తాన్ని కబ్జా చేసే పనులు చేపట్టారు. ఎస్టీకాలనీకి వెళ్లే రోడ్డును నైతం మూసేశారు. చేపలగుంత సిద్ధమైతే ఈ చుట్టుపక్కల నుంచి దిగువప్రాంతాల చెరువులకు వెళ్లే నీటికి మార్గం లేకుండా పొలాలు మునిగిపోతాయని రైతులు గగ్గోలు పెట్టడం ప్రారంభించారు. కొందరు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారం రోజుల క్రితం చేపలగుంత వద్దకు వచ్చిన అధికారులు మట్టి తవ్వుతున్న యంత్రాన్ని స్వాధీనం చేసుకుని ఆక్రమణ నిలిపివేయాలంటూ హెచ్చరించి వెళ్లారు. సరిగ్గా నాలుగు రోజుల తరువాత మళ్లీ కబ్జాదారులు రెండు యంత్రాలతో తవ్వకాలు చేపట్టారు. గ్రామస్తులు సహకరించకపోతే అంతు చూస్తామంటూ బెదిరింపులకు దిగారు. రెండు రోజుల నుంచి రాత్రింబవళ్లు చేపలగుంతకు కట్ట సిద్ధంచేసే పనులు యుద్ధప్రాతిపదికన సాగిస్తున్నారు.తొట్టంబేడు ఇన్‌ఛార్జి తహసీల్దారు సుధీర్‌ను ఈ విషయమై అడగ్గా వరవకాలువ, ఎస్టీకాలనీరోడ్డు ఆక్రమణకు గురవుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.చేపలగుంత తవ్వుతున్న వాహనాన్ని సీజ్‌ చేయడంతో పాటు ఆక్రమణలకు పాల్పడవద్దని హెచ్చరించామన్నారు.ఆక్రమణ పనులు మళ్లీ జరుగుతున్న విషయం తెలిసి శుక్రవారం  విచారణ చేయించానన్నారు.సమగ్ర సర్వే చేసి కాలువలు, పొరంబోకు, ప్రభుత్వ భూమి ఎంతా ఉన్నా స్వాధీనం చేసుకుంటామన్నారు. 

Updated Date - 2022-08-06T06:51:52+05:30 IST