తుడా టవర్స్‌కు అనుమతులు
ABN , First Publish Date - 2022-10-07T07:18:15+05:30 IST
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) అన్నమయ్య సర్కిల్ వద్ద 3.61 ఎకరాల్లో టవర్స్ (బహుళ అంతస్తులతో) నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
22వ తేదీలోపు అభ్యంతరాల సేకరణ
తిరుపతి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) అన్నమయ్య సర్కిల్ వద్ద 3.61 ఎకరాల్లో టవర్స్ (బహుళ అంతస్తులతో) నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు సంబంధించి పురపాలకశాఖ, పరిపాలన, సాంకేతిక అనుమతులు వచ్చినట్టు తుడా వీసీ హరికృష్ణ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రెండు బ్లాకులుగా నిర్మించనున్న తుడా టవర్స్‌లో 226 అపార్టుమెంట్లు, 2, 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లు ఉంటాయి. వాణిజ్య సముదాయాలు, కార్యాలయపు ఆవరణలు, ప్రజలు కొనుగోలు చేయడానికి, అద్దెకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నిర్మాణాలకు సంబంధించిన టెండరు పత్రాలను న్యాయ సమీక్షకు తుడా సమర్పించింది. ఏదైనా అభ్యంతరాలు, సలహాలుంటే ఈనెల 22వ తేదీలోపు జుడీషియల్ ప్రివ్యూ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేయగలరని వీసీ విజ్ఞప్తి చేశారు.