పెద్దిరెడ్డే కీలకం!

ABN , First Publish Date - 2022-04-10T06:23:38+05:30 IST

చిత్తూరు, తిరుపతి జిల్లాలకు మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా మారారు

పెద్దిరెడ్డే కీలకం!

సీనియర్‌ నాయకుడి చుట్టూ పరిభ్రమిస్తున్న

రెండు జిల్లాల మంత్రి పదవుల వ్యవహారం

చెవిరెడ్డికి తుడా కొనసాగింపుతో తగ్గిన పోటీ

 

తిరుపతి, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): చిత్తూరు, తిరుపతి జిల్లాలకు మంత్రి పదవుల కేటాయింపు వ్యవహారంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలకంగా మారారు.జిల్లాల విభజన నేపధ్యంలో ఆయన, మరో మంత్రి నారాయణస్వామి చిత్తూరు జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నట్టవుతోంది. జిల్లాల సంఖ్య 26కు పెరగడం, ఇంచుమించు అంతే సంఖ్యలో మంత్రి పదవులు వున్నందున జిల్లాకు ఒకరు చొప్పున మంత్రి పదవి పొందడానికి వీలుంది. ఆ మేరకు చిత్తూరు జిల్లా నుంచీ ఒకరు, తిరుపతి జిల్లా నుంచీ ఒకరు మంత్రివర్గంలో చోటు దక్కించుకుంటారు. ఇందులో మార్పులేమీ లేకపోయినా పెద్దిరెడ్డి తదుపరి మంత్రివర్గంలో కొనసాగడం, కొనసాగకపోవడం అన్నది రెండు జిల్లాల్లోనూ ఓ ప్రధాన సామాజికవర్గ అవకాశాలను ప్రభావితం చేయనుంది. అదే సమయంలో ఓ జిల్లాలో ఇతరులకు మంత్రి పదవి దక్కే అవకాశాలు లేకుండా పోతాయి. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రెడ్డి సామాజికవర్గం నుంచీ రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, బియ్యపు మధుసూదనరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఎమ్మెల్యేలుగా వున్నారు. వీరిలో నెల్లూరు జిల్లా పరిస్థితుల కారణంగా రామనారాయణరెడ్డికి ఛాన్సు లేనట్టేనని అధికార పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. ఇక తొలిసారి గెలిచిన కారణంగా మధుసూదన్‌రెడ్డి సైతం రేసులో లేనట్టేనని భావించాలి. చెవిరెడ్డి తనకు మంత్రి పదవి వద్దని, తుడా ఛైర్మన్‌గా కొనసాగించాలని కోరినట్టు సమాచారం. ఇక మిగిలింది రోజా, భూమన. రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సామాజికవర్గం నుంచీ మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ వున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి కనుక రెండో దఫా మంత్రిగా కొనసాగితే రెండు జిల్లాల్లో ఆ సామాజికవర్గానికి చెందిన వారికి అవకాశం వుండకపోవచ్చు. అలాంటప్పుడు రోజా,  కరుణాకరరెడ్డిలకు లేదా కనీసం వారిలో ఒకరికి ఇతరత్రా పదవి లభించే అవకాశాలను కొట్టిపారేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయమలా పక్కన పెడితే జిల్లాకు కనీసం ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశమున్నందున పెద్దిరెడ్డి రెండో విడత కూడా కొనసాగితే తిరుపతి జిల్లా నుంచీ రెడ్డియేతరులకు ఒకరికి ఛాన్సు వుంది. రెడ్డి సామాజికవర్గం కాకుండా ఈ జిల్లా పరిధిలో వున్న ముగ్గురూ ఎస్సీ సామాజికవర్గానికి చెందినవారే. ఈ ముగ్గురిలో సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ప్రాబబుల్స్‌గా వున్నారు. ఈ ఇద్దరిలో ఒకరు మంత్రి పదవి అందుకునే అవకాశాలుంటాయి.ఒకవేళ పెద్దిరెడ్డికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచీ తిరుపతి జిల్లాలో కరుణాకర రెడ్డికి మంత్రి పదవి ఇస్తే చిత్తూరు జిల్లాలో రోజాకు అవకాశం వుండదు. అలాంటప్పుడు ఆమెకు ప్రాధాన్యత కలిగిన మరో పదవి ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే సంబంధిత సామాజికవర్గానికి చెందిన కరుణాకరరెడ్డి, రోజాలలో మహిళా కేటగిరీ కింద రోజాకే ఎక్కువ అవకాశాలున్నాయి. కరుణాకరరెడ్డికి పదవి దక్కితే చిత్తూరు జిల్లాలో రోజాకు ఛాన్స్‌ వుండదు కనుక ఆ జిల్లాలో బలిజ, బీసీ, ఎస్సీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలలో ఒకరికి ఇవ్వాలి. వారిలో ఎవరికి ఇవ్వాలన్నా పెద్దిరెడ్డి ఆశీస్సులు అవసరం. అవి ఎవరికి దక్కుతాయో, అసలెవరికీ దక్కవో చెప్పడం కష్టం. ఎందుకంటే అందరూ ఆయన అనుచరులే కావడం, వారిలో ఒకరికి సిఫారసు చేస్తే మిగిలిన వారికి నిష్టూరమవుతామన్న ఆలోచన కూడా వుండచ్చు. అలాకాకుండా రెడ్డి వర్గం నుంచీ రోజాకు పదవి లభిస్తే తిరుపతి జిల్లాలో కరుణాకరరెడ్డికి ఛాన్స్‌ వుండదు. ఎస్సీ సామాజివకర్గం ఎమ్మెల్యేలలో ఒకరు మంత్రి అవడానికి ఆస్కారం వుంది. అయితే రోజాకు మంత్రి పదవి వస్తే కరుణాకరరెడ్డికి వేరే పదవి కట్టబెట్టే అవకాశముంది.


పెద్దిరెడ్డి కొనసాగింపుపై భారీగా అంచనాలు


 రెండో దఫా కూడా పెద్దిరెడ్డి మంత్రివర్గంలో కొనసాగుతారన్న అంచనాలు ఆయన అనుచరవర్గాల్లో భారీగా వున్నాయి. మంత్రివర్గ చివరి సమావేశం తర్వాత పరిణామాలు వేగంగా మారాయని, సీనియర్లు, కీలక నేతలను పక్కనపెట్టడం పార్టీకి, ప్రభుత్వానికీ మంచిది కాదన్న ఫీడ్‌బ్యాక్‌తో సీఎం జగన్‌ అప్రమత్తమయ్యారన్న ప్రచారం అధికార పార్టీ వర్గాల్లో జరుగుతోంది. అందువల్లే కనీసం ఏడునుంచీ పదిమంది దాకా పాతవారు కొనసాగుతారన్న అంచనాలు పార్టీలో పెరిగాయి. సీనియర్లు అందరిలోకీ పెద్దిరెడ్డి చాలా కీలక నేత కావడంతో ఆయన అనుచరులు కొనసాగింపుపై ధీమాతో వున్నారు. అదే జరిగితే ఆ సామాజికవర్గానికి చెందిన రెండు జిల్లాల ఆశావహులు నైరాశ్యానికి లోనయ్యే అవకాశముంది. కాకపోతే డిప్యూటీ స్పీకరు, చీఫ్‌ విప్‌ వంటి ఇతర పదవులతో వారి అసంతృప్తిని సర్దుబాటు చేసే అవకాశమూ లేకపోలేదు. 


Updated Date - 2022-04-10T06:23:38+05:30 IST