-
-
Home » Andhra Pradesh » Chittoor » Officials who dont care about the plight of passengers-MRGS-AndhraPradesh
-
ప్రయాణికుల అవస్థలు... పట్టించుకోని అధికారులు!
ABN , First Publish Date - 2022-10-12T05:07:19+05:30 IST
పలమనేరు పట్టణంలో ఆర్టీసీ డిపో ఉన్నా ఇక్కడి ప్రజలు ఉదయాన్నే పొరుగు ఊర్లకు వెళ్లాలంటే గంటల తరబడి బస్సుల కోసం వేచి వుండాల్సిన దుస్థితి.

పలమనేరు, అక్టోబరు 11: పట్టణంలో ఆర్టీసీ డిపో ఉన్నా ఇక్కడి ప్రజలు ఉదయాన్నే పొరుగు ఊర్లకు వెళ్లాలంటే గంటల తరబడి బస్సుల కోసం వేచి వుండాల్సిన దుస్థితి. ఐదు దశాబ్దాల క్రితమే పలమనేరులో ఆర్టీసీ డిపో ఏర్పాటైంది. అయితే ప్రస్తుతం ఈ డిపోలోని చాలా సర్వీసులు కుప్పం, పుంగనూరు, మదనపల్లె డిపోలకు బదిలీ చేశారు. దీంతో పలమనేరు నుంచి చిత్తూరు, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు, కుప్పం, మదనపల్లె వెళ్లాల్సిన ప్రయాణికులు బస్సులకోసం పలమనేరు బస్టాండు వదిలి జాతీయ రహదారిపైన ఇతర డిపో సర్వీసులు, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చే బస్సులకోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. ము ఖ్యంగా చిన్న పిల్లలు, మహిళలు గంటల తరబడి బస్సులకోసం నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై స్థానికులు పలు మార్లు బస్సులు సక్రమంగా నడపాలని పలమనేరు డిపో అధికారులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోతోంది. ఇక బెంగళూరుకు వెళ్లే వందలాది మంది ప్రతిరోజు జాతీ య రహదారిపైనే నిల్చొని పొరుగుడిపో బస్సులు, కర్ణాటక బస్సులు ఎక్కాల్సి వస్తోంది. ఇక ఈ డిపోలో ఉన్న బస్సుల్లో 90 శాతం కాలం చెల్లినవే. దాదాపు 15 నుంచి 20 లక్షల కిలోమీటర్ల పైనే తిరిగి ఉంటాయని ఆర్టీసీ సిబ్బందే చెబుతున్నారు. అయినప్పటికీ ప్రయాణికుల ఓర్పును పరీక్షిస్తూ ఇక్కడి అధికారులు బస్సులు నడుపుతున్నారు. జిల్లాలోని డిపోల్లో కాలం చెల్లిన బస్సులు ఈ డిపోకు పంపుతుంటారని, ఇక్కడి ప్రజాప్రతినిధులు ఎవరూ పట్టించుకోక పోవడంతో ఈ దుస్థితి నెలకొందని ఆర్టీసీ సిబ్బందే చెప్పడం గమనార్హం. ఇకనైనా అధికారులు స్పందించి సక్రమంగా బస్సులు నడపాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు.