చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి
ABN , First Publish Date - 2022-12-16T01:17:12+05:30 IST
బట్టలు ఉతుక్కునేందుకు వెళ్ళిన తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఓజిలి మండలంలో చోటుచేసుకుంది.
ఓజిలి, డిసెంబరు 15 : బట్టలు ఉతుక్కునేందుకు వెళ్ళిన తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి మృతి చెందిన సంఘటన ఓజిలి మండలంలో చోటుచేసుకుంది. పున్నేపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపేట గిరిజన కాలనీకి చెందిన కోట్లపాటి సునీత(32) తన కుమార్తె వైష్ణవి (9), కుమారుడు వరుణ్‌తేజ్ (1)తో కలసి గురువారం ఉదయం 10గంటల ప్రాంతం లో బట్టలు ఉతుక్కునేందుకు చెరువు వద్దకు వెళ్లింది. పొలం పనులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వచ్చిన సునీత భర్త రమే్‌షకు భార్య, పిల్లలు కన్పించకపోవడంతో వెతుక్కుంటూ చెరువు వద్దకు వెళ్ళాడు. భార్యాబిడ్డలు శవాలై చెరువులో కన్పించడంతో భోరుమన్నాడు. కాలనీవాసుల సమాచారంతో ఓజిలి ఎస్‌ఐ ఆదిలక్ష్మి సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.అయితే ఈ సంఘటనపై గ్రామంలో భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోందని, ఈ నేపథ్యంలోనే సునీత బిడ్డలతో కలసి బలవన్మరణానికి పాల్పడి వుంటుందని చెప్పుకుంటున్నారు.