మాండస్‌ ముప్పు... స్తంభించిన జనజీవనం

ABN , First Publish Date - 2022-12-10T00:17:19+05:30 IST

మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో తిరుపతిలో శుక్రవారం జనజీవనం స్తంభించిపోయింది.ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 19 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలికి జనం వణికిపోయారు. గురువారం అర్ధరాత్రి నుంచే చలి గాలులు, చిరు జల్లులు మొదలయ్యాయి.

 మాండస్‌ ముప్పు... స్తంభించిన  జనజీవనం
సూళ్లూరుపేట మండలం దొండ కాలువలో నీటిప్రవాహం

తిరుపతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మాండస్‌ తుఫాన్‌ ప్రభావంతో శుక్రవారం జనజీవనం స్తంభించిపోయింది.ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 19 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలికి జనం వణికిపోయారు. గురువారం అర్ధరాత్రి నుంచే చలి గాలులు, చిరు జల్లులు మొదలయ్యాయి. శుక్రవారం ఉదయానికి వాతావరణం పూర్తిగా మారిపోయింది. జిల్లావ్యాప్తంగా 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచడంతో పాటు వర్షాలు పడ్డాయి. గూడూరు డివిజన్లో 73మి.మీ వర్షపాతం నమోదైంది. వాకాడు, కోట మండలాల్లో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది.వాకాడు మండలంలోని వైట్‌ కుప్పం సముద్రం 50 మీటర్ల వరకు ముందుకు రావడంతో మత్స్యకారులు భయాందోళనకు గురయ్యారు. తూపిలిపాళెం, కొండూరుపాళెం, పూడిరాయదొరువు సముద్రతీరాల్లో 5మీటర్ల మేర కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి. వర్షాలకు ఉప్పుటేరులో నీటి ఉధృతి పెరగడంతో పంబలి, కాకివాకం, శ్రీనివాససత్రం గ్రామాలకు వెళ్లే మట్టిరోడ్లపై వరదనీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి.కోట మండలంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షాలు కురవడంతో 11తీరప్రాంత గ్రామాల్లో అధికారులు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. గోవిందపల్లిపాళెం, శ్రీనివాసాపురం, కొత్తపట్టణం, గ్రామాల సమీపంలో ఉన్న బంగాళాఖాతంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి.సుమారు 500 మీటర్ల వరకు సముద్రం ముందుకొచ్చినట్లు మత్స్యశాఖ ఏడీ చాన్‌బాషా తెలిపారు. గూడూరు, శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట డివిజన్లలో పలుచోట్ల వేరుశనగ పంటకు నష్టం వాటిల్లింది. వరిపంట నీటమునిగింది. తిరుపతిలో చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి.రేణిగుంట రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలో వర్షపునీరు చేరింది.జిల్లావ్యాప్తంగా 126పునరావాస కేంద్రాలను గుర్తించారు. తడ మండలంలో 157మందిని,బాలాయపల్లె మండలంలో 14మందిని,రేణిగుంట మండలంలో 19మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.గూడూరులో 23మంది, నాయుడుపేటలో 26మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలను తయారుగా వుంచారు. సముద్రంలో వేటకు వెళ్లిన 203మంది మత్స్యకారులను సురక్షితంగా ఇళ్లకు చేర్చారు.తీరప్రాంత గ్రామాల్లో 3 రోజులపాటు చేపల వేటకు నిషేధం పలకడంతో మత్స్యకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తిరుపతిలోని వీఎంసీ, రెడ్డిభవన్‌,మహిళావర్శిటీ,ఎస్వీయూ, పేరూరు ప్రాంతాల్లో విద్యుత్‌ లైన్లపై చెట్టుకొమ్మలు విరిగిపడడంతో మూడు గంటల పాటు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.వడమాలపేట మండలంలోని వేమాపురం రైల్వే అండర్‌ బ్రిడ్జి వద్ద వర్షం నీరు చేరడంతో సుమారు పది గ్రామాలకు రాకపోకలు స్తంభించి పోయాయి. వేమాపురం మీదుగా తిరుమణ్యం, అప్పలాయగుంట, రామచంద్రాపురం మండలానికి వెళ్లే ప్రజలు అవస్థలు పడ్డారు.

విమాన ప్రయాణం అస్తవ్యస్తం

తిరుపతి విమానాశ్రయానికి శుక్రవారం 15విమానాలు రాకపోకలు నిర్వహించాల్సివుండగా 10విమానాలు నిర్ణీత సమయంలో వచ్చి వెళ్లాయని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ రాజ్‌కిషోర్‌ తెలిపారు.గుల్బర్గా సర్వీసును రద్దు చేశామన్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చి ఉదయం 7.40గంటలకు ముంబై వెళ్లాల్సిన స్పైస్‌జెట్‌ విమానం వాతావరణం అనుకూలించక 20నిమిషాల పాటు గాల్లో చక్కర్లు కొట్టి వెనక్కి వెళ్లిపోయి 3 గంటలు ఆలస్యంగా తిరిగి తిరుపతికి చేరుకుందన్నారు.సాయంత్రం 6గంటల నుంచి వచ్చి వెళ్లాల్సిన మూడు విమానాలు రాత్రి 9.30గంటల్లోపు వచ్చి వెళ్లాయని తెలిపారు.రైళ్ల రాకపోకలకు మాత్రం ఇబ్బందులేవీ తలెత్తలేదని సమాచారం.

విద్యుత్‌ వైర్లు తెగి 4 గొర్రెల మృతి

పెళ్లకూరు మండలం అర్థమాల గ్రామంలో హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తెగడంతో నాలుగు గొర్రెలు మృతి చెందాయి. 6 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల యజమాని తిరుపాల్‌ వాటిని మేతకు తీసుకెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం : కలెక్టర్‌

తుఫాన్‌ ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని కలెక్టర్‌ వెంకటరమణా రెడ్డి చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.తుఫాను కారణంగా భారీ వర్షాలు ఆదివారం వరకూ కొనసాగనున్నాయని చెప్పారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో 24గంటలూ కంట్రోల్‌ రూంలు పనిచేస్తాయన్నారు. ముంపుకు గురయ్యే అవకాశం ఉండే గ్రామాల్లో 126 పునరావాస కేంద్రాలను ముందస్తుగా ఏర్పాటు చేశామన్నారు.రేషన్‌ షాపులకు నిత్యావసర వస్తువులను తరలించామన్నారు.

కమిషనర్‌ లోతట్టు ప్రాంతాల పరిశీలన

తుఫాన్‌ వలన ఇబ్బందులు తలెత్తినప్పుడు సహాయక చర్యలకోసం తిరుపతి నగర పాలక సంస్థ కంట్రోల్‌ రూం లో ఏర్పాటు చేసిన 0877-2256766 నెంబరును సంప్రదిస్తే సిబ్బంది సాయం అందిస్తారని కమిషనర్‌ అనుపమ అంజలి తెలిపారు. తిరుపతిలోని పలు లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలసి ఆమె పరిశీలించారు. కాలువల్లో చెత్త నిలిచిపోకుండా నిత్యం పనులు చేయిస్తున్నామని, అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం

తిరుమల: తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో శుక్రవారం వర్షం కురుస్తూనే వుంది.దీంతో యాత్రికులు ఇబ్బందులు పడ్డారు. యాత్రికులు చాలావరకూ కాటేజీలకే పరిమితమవడంతో సందర్శనీయ ప్రదేశాలు బోసిపోయాయి.ఘాట్‌రోడ్లలో కొండచరియలు విరిగిపడే అవకాశముండడంతో ఇంజనీరింగ్‌, ఫారెస్ట్‌, విజిలెన్స్‌ అధికారులు నిఘా ఉంచారు. తరచూ కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఘాట్‌రోడ్లలో వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలని సూచిస్తున్నారు.

విద్యుత్‌ శాఖ అప్రమత్తం

తిరుపతి (ఆటోనగర్‌): మాండస్‌ తుఫాను నేపథ్యంలో విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఏపీ ఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ) కె.సంతోషరావు ఆదేశించారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో సరఫరా పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలను, పనుల పర్యవేక్షణకు కార్పొరేట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌, నోడల్‌ ఆఫీసర్‌ నియామకం జరిగిందన్నారు. తుఫాను దృష్ట్యా అధికారులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేశామని తెలిపారు. ప్రధానంగా.. వరదయ్యపాళెం, సత్యవేడు, బీఎన్‌కండ్రిగ, కేవీబీపురం, నాగలాపురం, పిచ్చాటూరు, నారాయణవనం, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం, తొట్టంబేడు, శ్రీకాళహస్తి రూరల్‌, శ్రీసిటీ సెజ్‌తో పాటు సూళ్లూరుపేట, నాయుడుపేట, కోట, తడ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలు ఉంటాయన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సర ఫరాకు అంతరాయం ఏర్పడిన వెంటనే మరమ్మతులు చేయడానికి డ్రిల్లింగ్‌ మెషిన్లు, క్రేన్లు, విద్యుత్‌ స్తంభాలు, నియంత్రికలు, కండక్టర్లు సిద్ధం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించామన్నారు. విద్యుత్‌ వినియోగదారుల కోసం 1912 టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటు చేశామన్నారు. విద్యుత్‌ అత్యవసరాల మేరకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

విద్యాసంస్థలకు సెలవు

తిరుపతి(విద్య): తుఫాను కారణంగా శుక్రవారం మధ్యాహ్నం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. రోజూలాగే శుక్రవారం ఉదయం తరగతులకు వెళ్లిన విద్యార్థులకు కలెక్టర్‌ ఆదేశాల మేరకు విద్యాసంస్థల యాజమాన్యాలు మధ్యాహ్నం సెలవు ప్రకటించి ఇండ్లకు పంపించారు. రెండోశనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో విద్యార్థులకు ఊరట లభించినట్లయ్యింది. కాగా.. తుఫాను విషయమై ముందస్తు సమాచారం ఉన్నా విద్యాశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో శుక్రవారం ఉదయం తరగతులను యథావిధిగా కొనసాగించారు. మధ్యాహ్నం సెలవు ప్రకటించినా వర్షం పడుతూనే ఉండడంతో పలువురు విద్యార్థులు సాయంత్రం వరకు విద్యాసంస్థల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది.

Updated Date - 2022-12-10T00:17:19+05:30 IST

Read more