ప్రమాదంలో మేలుపట్ల చెరువు!

ABN , First Publish Date - 2022-10-03T07:30:24+05:30 IST

పుంగనూరు సమీపంలోని మేలుపట్ల చెరువు అక్రమ తవ్వకాలు.. ఇసుక, మట్టి తరలింపుతో రూపురేఖలు కోల్పోయింది. పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది.

ప్రమాదంలో మేలుపట్ల చెరువు!
మేలుపట్ల చెరువులో ఇసుక, మట్టి తరలింపుతో ప్రమాదంగా మారిన విద్యుత్‌ స్థంబాలు

   అక్రమ తవ్వకాలతో గోతులమయం 

  నిల్వ ఉండని వర్షపునీరు 

  ఆయకట్టుదారుల ఆందోళనను పట్టించుకోని యంత్రాంగం 

పుంగనూరు, అక్టోబరు 2: పుంగనూరు సమీపంలోని మేలుపట్ల చెరువు అక్రమ తవ్వకాలు.. ఇసుక, మట్టి తరలింపుతో రూపురేఖలు కోల్పోయింది. పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. చెరువులోని విద్యుత్తు స్తంభాలూ కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇసుక, మట్టి మాఫియా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అధికార పార్టీ, అధికారుల మద్దతు ఉండటంతో ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఇలాగే సాగితే తమకు పెద్దనష్టమే జరుగుతుందని ఆయకట్టు రైతులు, మహిళలు, యువకులు మేలుపట్ల చెరువులో ఇసుక తవ్వుతున్న ఆరు ఎక్స్‌కవేటర్లు, 12 ట్రాక్టర్లు, టిప్పర్లను గత నెల 28న అడ్డుకుని ధర్నా చేశారు. మరికొన్ని వాహనాలు జనాన్ని చూసి తప్పించుకుని వెళ్లిపోయాయి. మహిళలు ప్రాణాలకు తెగించి ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను అడ్డుకున్నారు. ఎక్కడైనా సామాన్యులు ఇంటిపనికి ట్రాక్టరు ఇసుక తరలిస్తే హడావుడి చేస్తూ పోలీసు, రెవెన్యూ, ఎస్‌ఈబీ, గనుల శాఖ, ఆర్టీవో అధికారులు వాహనాలను సీజ్‌ చేస్తారు. అవసరమైతే గనులశాఖ అధికారులనుంచి భారీగా జరిమానాలు వేయిస్తారు. కానీ పుంగనూరులో బహిరంగంగానే టిప్పర్లు, ట్రాక్టర్లతో అక్రమంగా తరలిస్తున్నా పట్టించుకునే వారే లేరు. మేలుపట్ల చెరువు వద్దే రైతులు ఎక్స్‌కవేటర్లు, ట్రాక్టర్లను పట్టుకున్నా అధికారులు సీజ్‌ చేయలేదు. అనుమతులు ఉన్నాయంటూ పోలీసులు ఆందోళనకారులను బెదిరించి.. ఆ వాహనాలను పంపించేయడం గమనార్హం. రాష్ట్ర భూగర్భ గనులు, అటవీ, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న పుంగనూరులో ఈ అక్రమాలు అడ్డుకుంటే అధికారపార్టీ నాయకుల నుంచి ఇబ్బందులు తప్పవని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకలనే మేలుపట్ల చెరువు ఆయకట్టు రైతులు వాహనాలను అడ్డుకుని తహసీల్దార్‌ వెంకట్రాయులు, ఇతర అధికారులకు ఫోను చేసి చెప్పినా ఎవరూ స్పందించలేదు. 


‘స్పందన’కూ స్పందించలేదు 


రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న స్పందనలో చిత్తూరు కలెక్టర్‌ నుంచి ఆర్డీవో, తహసీల్దారు, పోలీసులు, గనులశాఖ అధికారులకు రైతులు, స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా అధికారులెవరూ స్పందించలేదు. గతంలో ఎస్‌ఈబీ ఉన్నతాధికారిగా పనిచేసిన రిషాంత్‌రెడ్డి ఇసుకాసురుల ఆటకట్టించి కఠినంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న ఆయనకు ఫిర్యాదులు వెళ్లినా అడ్డుకోలేకపోతున్నారని ఆరోపణలున్నాయి. రైతులు పట్టుకున్న వాహనాలనూ సీజ్‌ చేయలేదు. ట్రాక్టర్లు, ఎక్స్‌కవేటర్లు, టిప్పర్లపై వాహనాల నెంబర్లున్నా పోలీసు, ఎస్‌ఈబీ, గనులశాఖ, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. 


ఇకనైనా చెరువును కాపాడండి 


పుంగనూరు చుట్టుపక్కల చెరువుల్లో నీళ్లున్నాయి. కానీ మేలుపట్ల చెరువును తవ్వేయడంతో నీళ్లంతా ఇంకిపోయాయి. పంటల సాగుకు నీళ్లులేని పరిస్థితి. దీనిపై ఆయకట్టుదారులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక, మట్టి తరలింపునకు ఇకపెనాఆ అనుమతులు ఇవ్వొద్దని మున్సిపల్‌ మేనేజర్‌ రసూల్‌బాషా, ఎంపీడీవో రామనాథ్‌రెడ్డికి వీరు ఇటీవల వినతిపత్రాలు అందించారు. బీజేపీ నాయకులు అయూబ్‌ఖాన్‌, రాజాజెట్టి, గణేశ్‌, మల్లికారాణి తదితరులు పలమనేరు ఆర్డీవో శివయ్యకు ఫిర్యాదు చేసి  ప్లకార్డులతో నిరసన తెలిపారు. కలెక్టర్‌ హరినారాయణన్‌, ఆర్డీవో శివయ్య ఇటీవల పుంగనూరులో పర్యటించినా మేలుపట్ల చెరువు విషయంలో ఎలాంటి చర్య తీసుకోలేదు. ఇప్సటికైనా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు మేలుపట్ల చెరువును పరిశీలించి.. అక్రమ తవ్వకందారుల నుంచి కాపాడాలని రైతులు కోరుతున్నారు. 


Read more