చావులోనూ కలిసే..!

ABN , First Publish Date - 2022-12-12T02:00:41+05:30 IST

అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఆ దంపతులు.. మృత్యువులోనూ కలిసే వెళ్లారు. కాణిపాకంలో జరిగే శుభకార్యాలనికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నడిచి వెళుతున్న చెంగల్‌రెడ్డి(63), కస్తూరి(60)ని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే వీరు మృతిచెందారు.

చావులోనూ కలిసే..!
చెంగలరెడ్డి, కస్తూరి (ఫైల్‌ ఫొటోలు)

పూతలపట్టు, డిసెంబరు 11: అన్యోన్యంగా జీవనం సాగిస్తున్న ఆ దంపతులు.. మృత్యువులోనూ కలిసే వెళ్లారు. కాణిపాకంలో జరిగే శుభకార్యాలనికి వెళ్లేందుకు రోడ్డు పక్కన నడిచి వెళుతున్న చెంగల్‌రెడ్డి(63), కస్తూరి(60)ని కారు ఢీకొనడంతో అక్కడికక్కడే వీరు మృతిచెందారు. ఈ దంపతులది పూతలపట్టు మండలం తిమ్మిరెడ్డిపల్లె గ్రామం. కాణిపాకం ఆలయం వద్ద ఆదివారం జరిగే బంధువుల శుభకార్యానికి బయలుదేరారు. ఇంటి నుంచి చిత్తూరు- కడప జాతీయ రహదారిలోని బస్టాప్‌ వద్దకు నడిచి వెళుతుండగా.. పీలేరు నుంచి చిత్తూరు వైపు వేగంగా వస్తున్న ఓ కారు వీరిని ఢీకొని వెళ్లిపోయింది. ఇంటికి దాదాపు పది అడుగుల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. వీరి అరుపుతో గ్రామస్తులు వచ్చి చూడగా వీరిద్దరి మృతదేహాలు రోడ్డు పక్కన పడున్నాయి. గ్రామస్తుల సమాచారంతో పోలీసులు ప్రమాద స్థలికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, ఈ దంపతులను ఢీకొన్న తర్వాత కారును ఆపకుండా డ్రైవరు వేగంగా వెళ్లాడు. రంగంపేట గ్రామ సమీపాన ఉన్న టోల్‌గేట్‌ వద్ద కారు మరమ్మతులకు గురవడంతో స్థానికులు గుర్తించి.. కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మృతదేహాలకు వైసీపీ నేతలు తలపలపల్లి బాబురెడ్డి, దొరస్వామిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, దేవిక, తహసీల్దారు విజయభాస్కర్‌, ఎంపీడీవో గౌరి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించాలని నాయకులు కోరారు.

Updated Date - 2022-12-12T02:00:41+05:30 IST

Read more