లోకేశ్‌ పాదయాత్రను విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2022-12-31T00:39:07+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు.

లోకేశ్‌ పాదయాత్రను విజయవంతం చేయండి
మీడియాతో మాట్లాడుతున్న టీడీపీ నేతలు

చిత్తూరు సిటీ, డిసెంబరు 30: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ‘యువగళం’ పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. చిత్తూరులోని జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. జనవరి 2న కుప్పంలో మొదలయ్యే ఈ పాదయాత్ర 400 రోజులపాటు 4 వేల కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం చేరుకుంటుందని ఎమ్మెల్సీ దొరబాబు చెప్పారు. ‘నిరుద్యోగ యువత కోసం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతన్నల సమస్యలపై పోరాటం, బీసీ కార్పొరేషన్‌ను మూసివేసి 56 బీసీ కార్పొరేషన్లకు ప్రభుత్వం నిధులు ఆపేసింది. బీసీ సామాజిక వర్గాలను, చేతివృత్తుల వారికి అన్యాయం చేసింది. ఎస్సీ కార్పొరేషన్‌ నిధులు రద్దు చేయడంతో 26 కార్పొరేషన్ల ద్వారా దళిత యువతకు రాయితీ రుణాలు ఆగాయి. దీంతో వారికి ఉపాధి లేకుండా పోయింది. ముస్లిం మైనార్టీ సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపేసింది. నిత్యావసర ధరలు పెరిగాయి. నకిలీ మద్యం విక్రయిస్తూ సామాన్యుల ఆరోగ్యాలతో పాలకులు చెలగాటమాడుతున్నారు. అక్క, చెల్లెమ్మల తాళిబొట్లు తెగిపోతున్న తరుణంలో మహిళల సమస్యలపై పోరాటం కోసం లోకేశ్‌ పాదయాత్ర చేస్తున్నారు. ప్రజలకు భరోసా ఇవ్వనున్నారు’ అని ఎమ్మెల్సీ వివరించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టేందుకు వచ్చే కంపెనీలను వైసీపీ నేతలు తమ వేధింపులతో తరిమేస్తున్నారని చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఆరోపించారు. ప్రజల ఆస్తులను కబ్జాచేస్తున్నారన్నారు. ప్రజాకోర్టులో వైసీపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాబోయే ఎన్నికల్లో ఓడించి, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర భవితను కాపాడటమే లక్ష్యంగా పాదయాత్ర సాగుతుందన్నారు. అనంతరం పాదయాత్ర లోగో బ్యానర్‌ను, పార్టీ చిత్తూరు పార్లమెంటు లీగల్‌ సెల్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌, మాజీ మేయర్‌ కటారి హేమలత, చిత్తూరు పార్లమెంటు పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్‌, నేతలు మోహన్‌రాజ్‌, వెంకటేష్‌ యాదవ్‌, త్యాగరాజన్‌, రామకృష్ణ, వరుణ్‌కుమార్‌, దుర్గాచౌదరి, ప్రభుతేజ, రాజశేఖర్‌, శేషాద్రి, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T00:39:10+05:30 IST