భార్యా హంతకుడికి జీవిత ఖైదు
ABN , First Publish Date - 2022-12-16T00:19:24+05:30 IST
అనుమానంతో భార్య గొంతు కోసి చంపిన భర్తకు చిత్తూరు కోర్టు జీవిత ఖైదు విధించింది.
పూతలపట్టు/ పిచ్చాటూరు,డిసెంబరు 15 : అనుమానంతో భార్య గొంతు కోసి చంపిన భర్తకు చిత్తూరు కోర్టు జీవిత ఖైదు విధించింది.పోలీసుల కథనం మేరకు... నగరి మండలం నత్తం కండ్రిగ గ్రామానికి చెందిన లేట్ మణి కుమారుడు శరవణ(26) చిత్తూరులోని ఓ ప్రజాప్రతినిధి వద్ద డ్రైవరుగా పని చేసేవాడు.చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీకి చెందిన సత్య(19)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం తరువాత వారి కాపురంలో అనుమానంతో కలతలు చెలరేగాయి. దీంతో శరవణ పిచ్చాటూరు మండలంలోని వెంగళత్తూరు గ్రామానికి కాపురం మార్చారు. అయినా భార్యమీద నమ్మకం కుదరని శరవణతరచూ వేధింపులకు గురిచేసే వాడు.2019వ సంవత్సరం జనవరి 16న భార్యతో గొడవ పడిన శరవణ విచక్షణ కోల్పోయి భార్య గొంతు కోశాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.దీంతో అదే రోజు రాత్రి 8.30 గంటలకు ఎస్ఐ రామాంజనేయులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.విచారణ తరువాత కోర్టుకు హాజరుపరిచారు.చిత్తూరులోని ఆరవ అదనపు జిల్లా కోర్టులో నాలుగేళ్లుగా నడుస్తున్న ఈ కేసుకు సంబంధించి గురువారం తీర్పు వెలువడింది.శరవణ నేరం రుజువు కావడంలో జడ్జి శాంతి జీవిత ఖైదుతో పాటు రూ.500 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. అడిషినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిర్మల ఈ కేసును వాదించారు.