స్థానిక స్మగ్లర్ల సరికొత్త వ్యూహాలు

ABN , First Publish Date - 2022-12-16T01:26:06+05:30 IST

పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా ఎర్రచందనం స్మగ్లింగ్‌ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూనే వుంది.ఈ మూడు నెలల వ్యవధిలోనే 12 కేసుల్లో 50మందిని అరెస్టు చేసి 20వాహనాలు సీజ్‌ చేసినా స్మగ్లింగు మాత్రం ఆగడం లేదు.

స్థానిక స్మగ్లర్ల సరికొత్త వ్యూహాలు
పోలీసులకు పట్టుబడిన స్మగ్లర్లు

పుంజుకుంటున్న ఎర్రచందనం స్మగ్లింగు

ఎర్రావారిపాలెం, డిసెంబర్‌ 15 : పోలీసులు ఎన్ని కేసులు పెడుతున్నా ఎర్రచందనం స్మగ్లింగ్‌ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతూనే వుంది.ఈ మూడు నెలల వ్యవధిలోనే 12 కేసుల్లో 50మందిని అరెస్టు చేసి 20వాహనాలు సీజ్‌ చేసినా స్మగ్లింగు మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్‌లో పాత్రధారులు తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలకు చెందిన వారు అధికంగా వుండగా సూత్రధారులు మాత్రం స్థానికులే అని పోలీసులు అనుమానిస్తున్నారు.తమిళనాడు,కర్ణాటక ప్రాంతాల నుంచి నుంచి వచ్చే స్మగ్లర్లకు రవాణా సౌకర్యాలతో పాటు నిత్యావసరాలు సమకూరుస్తున్నది స్థానికులేనని పోలీసులు గుర్తించారు.అయితే స్థానిక స్మగ్లర్లు నేరుగా అడవిలోకి వెళ్లే కూలీలతో టచ్‌లో లేకుండా వారిని పంపించే మేస్త్రీలతోనే మాట్లాడుతున్నట్లు సమాచారం. మారుపేర్లతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అడ్రస్‌ ప్రూఫులతో ఉన్న సిమ్‌ కార్డులతో నేరుగా బడా స్మగ్లర్లకు దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది.దీంతో స్థానికంగా ఎవరెవరు ఇతర రాష్ట్రాల స్మగ్లర్లకు సహకారం అందిస్తున్నదీ పోలీసులు తెలుసుకోలేకపోతున్నారు. భాకరాపేట పోలీస్‌ సర్కిల్లో ఆరు నెలల కాలంగా సీఐ తులసీరామ్‌ ఆధ్వర్యంలో పోలీసులు స్మగ్లింగ్‌పై ఉక్కు పాదం మోపుతున్నారు.ఇటీవల డీఐజీ రవిప్రకాష్‌ కూడా ఎర్రచందనం స్మగ్లింగు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అధికారులతో అంతర్గత సమావేశాలు నిర్వహించి ఎర్రచందన రవాణాపై ఉక్కు పాదం మోపాలని సూచించారు. స్మగ్లర్లు ఎంతటి వారైనా వదల వద్దనీ సూచించారు. అయితే పోలీసులు ఎంత గట్టిగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా స్మగ్లర్లు కొత్తదారులు వెతుకుతూ స్మగ్లింగును కంటిన్యూ చేస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో పోలీసులు ఎటువంటి వ్యూహాలు అనుసరిస్తారో వేచి చూడాల్సి వుంది.

ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

ఎర్రావారిపాలెం, డిసెంబరు 15 : రెండు వాహనాలతో సహా రూ.50 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను భాకరాపేట సీఐ తులసీ రాం ఆధ్వర్యంలోని పోలీసు బృందాలు వల పన్ని పట్టుకున్నాయి. సీఐ కథనం మేరకు ....ఎర్రావారిపాలెం మండలంలోని ఎల్లమంద, బోడేవాండ్లపల్లి ప్రాంతాల్లో స్మగ్లింగ్‌ జరుగుతోందని సమాచారం అందింది.భాకరాపేట, ఎర్రావారిపాలెం ఎస్సైలు ప్రకాష్‌ కుమార్‌,వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. బోడేవాండ్లపల్లి పంచాయతీ సాయకాడ గుట్ట వద్ద ఓ బృందం ఒక లారీని వెంబడించి తనిఖీ చేయగా 24 ఎర్రచందనం దుంగలు దొరికాయి. లారీలో వున్న ఇద్దరు వ్యక్తులను విచారించగా తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లాకు చెందిన రాజేంద్రన్‌,శ్రీనివాసన్‌ అని తేలింది.వారిచ్చిన సమాచారంతో లారీకి పైలట్‌గా స్కూటీలో వస్తున్న నవీన్‌ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఎల్లమంద పంచాయతీలో నిఘా పెట్టిన పోలీసులు ఓ కారును ఆపి పరిశీలించగా 6 ఎర్రచందనం దుంగలు దొరికాయి.కారుకు ముందు పైలట్‌గా వస్తున్న ఒక వ్యక్తితో పాటు చిత్తూరు జిల్లా సోమల మండలానికి చెందిన శశీంద్ర, చంద్రశేఖర్‌, రెడ్డెప్ప, గోపీలను అదుపులోకి తీసుకున్నారు.నిందితులను పట్టుకున్నందుకు సీఐ తుసీ రామ్‌,ఎ్‌సఐలు ప్రకాష్‌ కుమార్‌,వెంకటేశ్వర్లును ఎస్పీ పరమేశ్వర రెడ్డి అభినందించారు.

Updated Date - 2022-12-16T01:26:22+05:30 IST