కుప్పం డబ్బా గ్యాంగ్‌ అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-12-31T01:57:57+05:30 IST

కరడుగట్టిన దొంగల బ్యాచ్‌.. కుప్పానికి చెందిన డబ్బాలోళ్ల గ్యాంగ్‌ను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 358 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.

కుప్పం డబ్బా గ్యాంగ్‌ అరెస్ట్‌
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ పరమేశ్వర రెడ్డి

తిరుపతి(నేరవిభాగం), డిసెంబరు 30: కరడుగట్టిన దొంగల బ్యాచ్‌.. కుప్పానికి చెందిన డబ్బాలోళ్ల గ్యాంగ్‌ను తిరుపతి అలిపిరి పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి 358 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ పరమేశ్వరరెడ్డి మీడియాకు వివరాలను తెలియజేశారు. తిరుపతి గోవిందనగర్‌ నివాసి అనసూయ ఈనెల కడప జిల్లా నందలూరు నుంచి తిరుపతికి బస్సులో వచ్చారు. ఓ పెళ్లికి హాజరు కావాల్సి ఉండటంతో 180 గ్రాముల బంగారు నగలను ఓ పర్సులో పెట్టుకొచ్చారు. ఓ చిన్నపిల్లతోపాటు కోడూరులో బస్సు ఎక్కిన ముగ్గురు మహిళలు అనసూయ పక్కనే కూర్చొని, మాట కలిపారు. తర్వాత వారు కరకంబాడి వద్ద బస్సు దిగారు. ఆ తర్వాత అనసూయ వద్ద బంగారు నగలతో కూడిన పర్సు మాయం కావడంతో ఆమె అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదుచేసిన సీఐ అబ్బన్న, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప ఈస్ట్‌ డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో దర్యాప్తు ప్రారంభించారు. కుప్పం మండలం లక్ష్మీపురానికి చెందిన ఆర్‌.కృష్ణమ్మ (42), ఎ.జ్యోతి (37), ఎ.గాయత్రి (27), ఆర్‌. విమల (32) బస్సులో అనసూయ నగలను దొంగిలించారని గుర్తించారు. వారి ఆచూకీకోసం గాలించారు. ఎట్టకేలకు శుక్రవారం ఉదయం నిందితులను అరె్‌స్టచేశారు. వారి వద్దనుంచి 358 గ్రాముల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.17 లక్షలకుపైగా ఉంటుంది. వీరు గతంలో తిరుపతి, తిరుచానూరుతోపాటు రాష్ట్రంలో పలుచోట్ల దొంగతనాలు చేశారని, జైలు శిక్ష కూడా అనుభవించారని ఎస్పీ తెలియజేశారు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న బంగారు నగలు అలిపిరి, ఈస్ట్‌, కోడూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో చేసిన దొంగతనాలకు సంబంధించినవని చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ అబ్బన్న, ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప, సిబ్బంది రవిరెడ్డి, ప్రసాద్‌, ప్రకాష్‌, చంద్ర, షణ్ముఖ, మహిళా సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

డబ్బాలోళ్లంటే ఆషామాషీ కాదు

డబ్బాలోళ్ల పదం కుప్పంలో చిరపరిచితం. పూర్వకాలంలో డబ్బాలు తయారుచేస్తూ జీవనం సాగించేవారు కావడంతో వారికి ఆ పేరు వచ్చింది. తెరవెనుక వీరు దొంగతనాలు ప్రవృత్తిగా చేస్తుంటారు. రాష్ట్రంలో పలుచోట్ల చోరీలు చేసి, జైలు శిక్ష అనుభవించిన చరిత్ర వీరికుంది. ముఖ్యంగా డబ్బాలోళ్ల మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తూ.. పక్కవారితో మంచిగా మాట్లాడుతూ.. అదనుచూసి వారి వద్ద విలువైన వస్తువులు కొట్టేస్తారు. ఎవరైనా ఎదురుతిరిగితే బ్లేడ్లతో కోసేందుకూ వెనుకాడరు. చివరకు తమ చంటిపిల్లలను కూడా చోరీలకు ఉపయోగించుకుంటారు.

డబ్బులిచ్చి సమాచారం రాబట్టిన పోలీసులు

బస్సులో అనసూయ నగల చోరీ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు అనుమానితులను గుర్తించారు. అయితే వారు ఎవరన్న సమాచారం ఓ పట్టాన లభించలేదు. చివరకు కుప్పానికి చెందిన డబ్బాలోళ్లుగా తెలుసుకుని అలిపిరి పోలీసులు అక్కడికెళ్లారు. పోలీసులు వచ్చారని తెలుసుకున్న దొంగలు కుప్పంనుంచి జారుకున్నారు. ఎంతవెతికినా జాడ తెలియరాలేదు. ఈ నేపథ్యంలో కొందరికి వేల రూపాయలిచ్చి మరీ నిందితులను పట్టుకోవాల్సి వచ్చింది.

సీఎంవో నుంచి ఫోన్‌

ఇంత కష్టపడి పోలీసులు డబ్బాలోళ్ల గ్యాంగ్‌ను పట్టుకుంటే... వారిని వదిలేయమని ఏకంగా సీఎం కార్యాలయం (సీఎంవో) నుంచి పోలీసులకు ఫోన్‌ వచ్చింది. డబ్బాలోళ్ల గ్యాంగ్‌తో మంచి సన్నిహిత సంబంధమున్న కుప్పం అధిఽకార పార్టీకి చెందిన ఓ నేత గ్యాంగ్‌ను ఒదిలేయమని ఒత్తిడి చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయినప్పటికీ పోలీసులు వినకపోవడంతో కుప్పం నేత తిరుపతిలోని మరో ముగ్గురు నేతలతో మాట్లాడి వారిద్వారా పోలీసులపై ఒత్తిడి తీసుకువచ్చారు. అప్పటికీ పనికాకపోవడంతో కుప్పం నేత సీఎంవోలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ వ్యక్తిని రంగంలోకి దింపారు. అయితే ఎన్ని వత్తిళ్లు వచ్చినప్పటికీ ఎస్పీ పరమేశ్వర రెడ్డి వెనకడుగు వేయలేదు.ఆయన ఆదేశాలతో నిందితులను పోలీసులు విడిచిపెట్టలేదు.

Updated Date - 2022-12-31T01:57:57+05:30 IST

Read more