కబడ్డీ’ ఖర్చు పెంచేశారుగా..?!

ABN , First Publish Date - 2022-03-05T07:49:45+05:30 IST

జాతీయ కబడ్జీ పోటీలన్నారు. తాము చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి మరీ.. హడావుడి చేశారు. ఖర్చు కేవలం రూ.25లక్షలే అన్నారు. తీరా బడ్జెట్‌లో మాత్రం రూ.65లక్షలుగా చూపింది తిరుపతి నగరపాలక సంస్థ యంత్రాంగం. తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ జనవరిలో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల ఖర్చు అమాంతం పెరిగిపోయింది.

కబడ్డీ’ ఖర్చు పెంచేశారుగా..?!

తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాటా రూ.25లక్షల నుంచి రూ.65లక్షలకు పెంపు

తిరుమల బస్సులు వారధిపైనే వెళ్లాలి

రూ.362.72 కోట్లతో బడ్జెట్‌

నేడు ఆమోదం తెలపనున్న కౌన్సిల్‌


జాతీయ కబడ్జీ పోటీలన్నారు. తాము చేయాల్సిన పనులన్నీ పక్కన పెట్టి మరీ.. హడావుడి చేశారు. ఖర్చు కేవలం రూ.25లక్షలే అన్నారు. తీరా బడ్జెట్‌లో మాత్రం రూ.65లక్షలుగా చూపింది తిరుపతి నగరపాలక సంస్థ యంత్రాంగం. 


తిరుపతి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ జనవరిలో నిర్వహించిన జాతీయ కబడ్డీ పోటీల ఖర్చు అమాంతం పెరిగిపోయింది. తొలుత కార్పొరేషన్‌ సాధారణ నిధుల నుంచి రూ.25లక్షలు మాత్రమే కబడ్డీ పోటీలకు వెచ్చిస్తున్నామని అధికార యంత్రాంగం పలుసార్లు చెప్పుకొచ్చింది. అయితే విరాళాలు కాకుండా కార్పొరేషన్‌ నుంచే రూ.65లక్షలు వెచ్చించాలంటూ స్టాండింగ్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని రాటిఫికేషన్‌ కోసం శనివారం జరగనున్న కౌన్సిల్‌ సమావేశంలో ఆమోదించనున్నారు. కబడ్డీ పోటీలు ప్రారంభం నుంచి కార్పొరేషన్‌ నిధులు ప్రైజ్‌ మనీ కోసమే రూ.25లక్షలు వినియోగిస్తామని యంత్రాంగం పదేపదే చెప్పింది. అనుకున్న బడ్జెట్‌కు మూడింతలు పెంచేసి కౌన్సిల్‌ ఆమోదం కోసం అజెండాలో పెట్టడం చర్చనీయాంశమైంది. దాతల విరాళాల ద్వారా రూ.1.60కోట్లు వచ్చినట్టు అజెండాలో పేర్కొన్నారు. పోటీల నిర్వహణ నిమిత్తం దాతలు ఇచ్చిన వితరణ నుంచి అడ్వాన్స్‌ రూపంలో రూ.1.55కోట్లు వెచ్చించగా రూ.5లక్షలు నిల్వ ఉన్నట్టు ఉంది. అంటే ఇంకా అడ్వాన్సుల రూపంలోనే ఇచ్చినట్టు, ఇంకా చెల్లింపులు చేయాల్సి ఉన్నట్టుగా అజెండా చూస్తే అర్థమవుతోంది. అందుకే కార్పొరేషన్‌ నిధులు నుంచి రూ.65లక్షలు అనుమతి కోరనున్నారు. ఇక కబడ్డీ పోటీల నిర్వహణకు వెచ్చించిన తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మిస్‌లీనియస్‌ కిందనే రూ.10లక్షలు అడ్వాన్సుగా ఇచ్చినట్టు ఉండడం చూసిన పలువురు కార్పొరేటర్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం. 


రోడ్ల కుదింపుపైనా..

ఇటీవల ప్రజలే ప్రారంభించుకున్న గరుడవారధి (శ్రీనివాస సేతు)పై తిరుమలవైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు వెళ్లేలా నిర్ణయం తీసుకోనున్నారు. వారధి అందుబాటులోకి వచ్చాక కూడా బస్సులు కింద వెళ్లడం వల్ల ట్రాఫిక్‌ కష్టాలు తీరడం లేదని, అందుకే వారధిపైనే వెళ్లేలా ఆర్టీసీ అధికారులకు తీర్మానం ద్వారా సూచించనున్నారు. మారస  సరోవర్‌ రోడ్డుకు ఎదురుగా ఉన్న హెచ్‌పీ పెట్రోల్‌ బంకు నుంచి కొత్తపల్లె ఏరియాలో రోడ్లను 60 నుంచి 40 అడుగులకు స్థానికులు కోరిక మేరకు కుదించనున్నారు. అలాగే కొర్లగుంట మెయిన్‌ రోడ్డును కూడా 60 నుంచి 40 అడుగులకు కుదించేలా అజెండాలో చేర్చారు. చెత్తపన్ను 90 శాతంకంటే పైగా వసూలు చేసే వలంటీర్లకు ఐదు శాతం కమీషన్‌ ఇచ్చేలా తీర్మానం చేయనున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.362.72 కోట్లతో కార్పొరేషన్‌ బడ్జెట్‌ అంచానలను రూపొందించారు. ఇందులో రూ.354.04కోట్లు వేతనాలకు, వివిధ అభివృద్ధి పనులకు వెచ్చించనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలుత రూ.331.65కోట్లతో బడ్జెట్‌ అంచనాలు రూపొందించగా, సవరించిన అంచనాల మేరకు కార్పొరేషన్‌కు వివిధ మార్గాల ద్వారా వచ్చే ఆదాయం రూ.273.58కోట్లకు తగ్గింది. ఈమేరకు కౌన్సిల్‌ సమావేశంలో బడ్జెట్‌ వివరాలు ప్రవేశపెట్టనున్నారు. నగరంలోని పలు డివిజన్లలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం, పైపులైన్ల ఏర్పాటు వంటివాటిపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇక టేబుల్‌ అజెండాగా తిరుపతి జన్మదిన వేడుకలను ఏటా కార్పొరేషన్‌ నిర్వహించేలా చూడాలని చర్చించనున్నట్టు తెలుస్తోంది. 

Updated Date - 2022-03-05T07:49:45+05:30 IST