Tirupathi: అలిపిరి పీఎస్ ముందు జనసేన నేతల నిరసన
ABN , First Publish Date - 2022-08-10T21:39:17+05:30 IST
తిరుపతి (Tirupathi): అలిపిరి పోలీస్ స్టేషన్ ముందు జనసేన నేతలు నిరసన చేపట్టారు.

తిరుపతి (Tirupathi): అలిపిరి పోలీస్ స్టేషన్ ముందు జనసేన నేతలు (Janasena Leaders) నిరసన చేపట్టారు. నిన్న అలిపిరి వద్ద టీటీడీ (TTD) బోర్డు సభ్యుడు లక్ష్మినారాయణకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అనుమతి లేకుండా ట్రాఫిక్కు అంతరాయం కలిగించారంటూ జనసేన నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ.. శ్రీవారి ఫోటోతో అలిపిరి పీఎస్ వద్ద టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని, తిరుమల కొండను నీవే కాపాడుకో గోవిందా.. అంటూ జనసేన నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కొబ్బరికాయలు కొడితే కేసులు పెట్టాలని ఏ రాజ్యాంగంలో లేదన్నారు.
ఈ సందర్భంగా తిరుపతి ఇన్చార్జ్ కిరణ్ రాయల్ (Kiran Royal) మాట్లాడుతూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. భక్తుల్ని అడ్డుకోలేదని, ప్రజలకు ఇబ్బంది కలిగించకపోయినా కేసులు పెట్టారని మండిపడ్డారు. శాంతియుతంగానే భక్తితో కొబ్బరికాయలు కొట్టి శ్రీవారిని వేడుకున్నామన్నారు. కొబ్బరికాయలు కొట్టకూడదని టీటీడీ ఒక చట్టాన్ని తీసుకురావాలన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని, పీఠాధిపతులు ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు లక్ష్మీనారాయణను పాలక మండలి నుంచి తొలగించేంత వరకు జనసేన పోరాటం కొనసాగుతుందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు.