పుంగనూరులో అక్రమ తవ్వకాలు

ABN , First Publish Date - 2022-06-11T08:21:37+05:30 IST

చెరువుల్లో రాత్రింబవళ్లు ఎక్స్‌కవేటర్లు మట్టి తవ్వుతున్నాయి.

పుంగనూరులో అక్రమ తవ్వకాలు
మేలుపట్ల చెరువును తవ్వేస్తున్నారిలా..

గుండె‘చెరువు’.. ‘గుట్ట’ ఖాళీ

పట్టించుకోని అధికారులు 


పుంగనూరు, జూన్‌ 10: చెరువుల్లో రాత్రింబవళ్లు ఎక్స్‌కవేటర్లు మట్టి తవ్వుతున్నాయి. టిప్పర్లు, ట్రాక్టర్లకు లోడ్‌ చేస్తున్నాయి. అక్కడ్నుంచి మట్టి తరలిపోతోంది. ఇసుకనూ తీసుకెళ్తున్నారు. వీటితో చెరువులు రూపు మారిపోతున్నాయి. గుట్టలూ ఖాళీ అవుతున్నాయి. ఇవన్నీ అనుమతుల్లేకుండా.. బహిరంగంగా సాగిపోతున్నాయి. కానీ, పట్టించుకునేదెవరు? సామాన్యుడు ఓ ట్రాక్టర్‌ మట్టి కానీ, ఇసుకకాని అవసరాలకు తీసుకెళితే హడావుడి చేసే వివిధ శాఖల అధికారులు.. వాహనాన్ని సీజ్‌చేసి కేసులుపెట్టి, జరిమానాలు విధించే వారూ వీటిని మాత్రం చూసీచూడనట్లు ఉండిపోతున్నారు. పర్యావరణానికి హాని కలిగేలా నిబంధనలకు విరుద్ధంగా సాగిపోయే ఈ ప్రక్రియను చూసి.. తమకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. పుంగనూరు పట్టణ సమీపంలోని మేలుపట్ల.. మండలంలోని రాగానిపల్లె చెరువులను కొద్దిరోజులుగా రాత్రింబవళ్లు తవ్వేస్తున్నారు. ఎక్స్‌కవేటర్లతో తవ్వి.. పెద్ద పెద్ద లారీల్లో మట్టిని తరలిస్తున్నారు. పెద్దగోతులు పడి ఈ చెరువులు రూపు కోల్పోయాయి. ఈ మట్టిని సమీపంలోని పనులకు తరలిస్తున్నట్లు తెలిసింది. గోతులు పెద్దవి కావడం.. లోతు ఎక్కువ కావడంతో వాహనాల్లో ఇసుకను ఎవరుపడితే వారు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రాగానపల్లె చెరువు కింద 50 ఎకరాల ఆయకట్టు ఉంది. మట్టికోసం ఈ చెరువులో దాదాపు 10 అడుగులకుపైగా గోతులు తీశారు. ఈ రెండు చెరువుల్లోనూ ఒకే కొలతలతో సమానంగా ఎక్కడా గోతులు తీయలేదు. కరెంటు స్తంభాల వద్ద కొంత వదిలేసి.. మిగతా చోట్ల తవ్వేశారు. వర్షానికి చెరువులు నిండితే ఈ గోతుల వల్ల మనుషులు, పశువులకు ప్రమాదమే. 


చదునవుతున్న ‘బోగరబావిగుట్ట’ 

చిత్తూరు-మదనపల్లె జాతీయ రహదారి పక్కనే సుగాలిమిట్ట మలుపు వద్ద బోగరబావిగుట్ట చెట్టు, గడ్డితో పచ్చగా కళకళలాడేది. అక్కడ రెండు ప్రాంతాల్లో గుట్టను ఇటాచీ, ఎక్సకవేటర్లుతో తవ్వి చదును చేస్తున్నారు. మట్టి, రాళ్లును టిప్పర్లతో ప్రాంతాలకు తరలించి అమ్మేస్తున్నారు. 


మట్టి తవ్వకాలకు అనుమతులివ్వలేదు: వెంకట్రాయులు, తహసీల్దారు, పుంగనూరు

పుంగనూరు మేలుపట్ల, రాగానిపల్లె చెరువులు, సుగాలిమిట్ట గుట్టలో మట్టి తవ్వకాలకు ఎవరికీ.. ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వను కూడా. చెరువుల్లో మట్టి, ఇసుక తవ్వకాలై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుని ప్రభుత్వానికి పంపుతా. 


Updated Date - 2022-06-11T08:21:37+05:30 IST