కరెంట్‌ సమస్యను ఇట్టే కనిపెట్టేయొచ్చు

ABN , First Publish Date - 2022-09-30T07:47:47+05:30 IST

కరెంట్‌ సమస్య తలెత్తిన ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్‌ అడ్వాన్స్‌డ్‌ స్కాడా సిస్టమ్‌ ద్వారా ఇకపై ఇట్టే కనిపెట్టేయొచ్చు.

కరెంట్‌ సమస్యను ఇట్టే కనిపెట్టేయొచ్చు
లోపల ఎలక్ర్టికల్‌ ప్యానల్స్‌ - సీసీ కెమెరా

సమస్య ఉన్న ప్రాంతానికే పరిమితం కానున్న 

విద్యుత్‌ అంతరాయం 

కంటైనర్‌ సబ్‌స్టేషన్‌తోనే ఇది సాధ్యం

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారిగా తిరుపతిలో  

నూతన సబ్‌స్టేషన్‌ త్వరలోనే ప్రారంభం

తిరుపతి(కొర్లగుంట), సెప్టెంబరు 29: కరెంట్‌ సమస్య తలెత్తిన ప్రాంతాన్ని ఇంటిగ్రేటెడ్‌ అడ్వాన్స్‌డ్‌ స్కాడా సిస్టమ్‌ ద్వారా ఇకపై ఇట్టే కనిపెట్టేయొచ్చు. పునరుద్ధరించేవరకు సమస్య తలెత్తిన ప్రాంతానికే విద్యుత్‌ అంతరాయాన్ని పరిమితం చేసే సదుపాయం కూడా అందుబాటులోకి రానుంది. గాల్లో వేలాడే తీగలూ ఉండవు. తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అండర్‌కేబుల్‌ సిస్టమ్‌తో అధునాతన కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ను తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా తిరుపతిలో త్వరలోనే ప్రారంభించనున్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు, ఏపీఎస్పీడీసీఎల్‌ సంయుక్తంగా రూ.25కోట్ల వ్యయంతో రెండు కేంద్రాలను వచ్చే నెల్లో ప్రారంభించనున్నారు. 

తిరుపతి నగరం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కిందకు ఎంపికైన విషయం తెలిసిందే. దాంతో కేంద్రప్రభుత్వ నిధులతో అన్ని విభాగాల్లో అత్యాధునిక సదుపాయాలు అందుబాటులోకి తెచ్చే చర్యలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే సుదీర్ఘ విద్యుత్‌ అంతరాయాలకు చెక్‌పెట్టేందుకు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడంపై దృష్టిపెట్టారు. దీనికోసం కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ ఏర్పాటుకు సంకల్పించారు. జర్మనీ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ విధానాన్ని చెన్నైకి చెందిన సిమెన్స్‌ కంపెనీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఏర్పాటు చేసి మంచి గుర్తింపుపొందింది. దాంతో తిరుపతిలోనూ నెలకొల్పే బాధ్యతలు ఆ కంపెనీకే అప్పగించడంతో ఎనిమిది నెలల కిందట పనులు ప్రారంభమయ్యాయి. అలిపిరి పోలీ్‌సస్టేషన్‌ పక్కన మున్సిపల్‌ కార్పొరేషన్‌ క్లియర్‌ వాటర్‌పంపింగ్‌ స్టేషన్‌ స్టేజ్‌-6 ప్రాంగణంలో 12/15 చదరపు మీటర్ల స్వల్ప విస్తీర్ణంలో లేటెస్ట్‌ టెక్నాలజీ కలిగిన పది మెగా వోల్ట్స్‌ ఆంపియర్‌ (ఎంవీఏ) సామర్థ్యం కల్గిన రెండు భారీ ట్రాన్స్‌ఫార్మర్లతో 33 కేవీ కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. 

రూ.25 కోట్లతో రెండు సబ్‌స్టేషన్లు

తొలి కంటైనర్‌ సబ్‌స్టేషన్‌కు స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు నిధులు రూ.7కోట్లు, ఏపీఎస్పీడీసీఎల్‌ రూ.5.5కోట్లు వెచ్చించారు. పనులు పూర్తవడంతో 15రోజులుగా సిమెన్స్‌ కంపెనీ సాంకేతిక నిపుణులు టెస్టింగ్‌ నిర్వహిస్తున్నారు. అక్కడినుంచి సమీపంలోని ఏడు 11కేవీ విద్యుత్‌ సరఫరా చేసే ఇండోర్‌ సబ్‌స్టేషన్లకు దీన్ని అనుసంధానించి వాటి పనితీరును పరీక్షిస్తున్నారు. నెలపాటు టెస్టింగ్‌ నిర్వహించి.. వచ్చే నెలాఖరులో ఏపీఎస్పీడీసీఎల్‌కు అప్పగించనున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. 

శ్రీదేవి కాంప్లెక్స్‌ వద్ద మరొకటి 

మరో కంటైనర్‌ సబ్‌స్టేషన్‌ను శ్రీదేవి కాంప్లెక్స్‌కు దక్షిణంగా ఉన్న ఖాళీ స్థలంలో రూ.12.5కోట్ల వ్యయంతో ఏర్పాటవుతోంది. ఈ రెండింటి నిర్వహణను కొన్ని నెలలపాటు పరిశీలించి.. వచ్చే ఫలితాల ఆధారంగా నగరంలో మరిన్ని ఏర్పాటు చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. 

నూతన సబ్‌స్టేషన్‌ ప్రత్యేకతలు 

రెండు ఎత్తయిన, పొడవైన ఎలక్ర్టికల్‌ ప్యానల్స్‌ ఉంటాయి. 

- సమస్య తలెత్తిన ప్రాంతాన్ని వెంటనే స్పష్టంగా గుర్తించే   

   ఇంటిగ్రేటెడ్‌ అడ్వాన్స్‌డ్‌ స్కాడా సిస్టమ్‌ ఉంటుంది.

- దాదాపు మూడు కిలోమీటర్ల సరౌండింగ్‌ వరకు సమస్యను 

   గుర్తించే సామర్థ్యం ఉంది. 

- సబ్‌స్టేషన్‌లో ఏ చిన్న పొరబాటు జరిగినా  అలారం 

    మోగుతుంది. 

- పటిష్ఠ భద్రత కోసం లోపలి భాగంలో 4, బయట రెండు 

    సీసీ కెమెరాలుంటాయి. 

- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే మెరుగైన 

   సదుపాయాలు కల్గి ఉంటుంది.

Read more