-
-
Home » Andhra Pradesh » Chittoor » Grahana Morri operations are free from today on Bird-NGTS-AndhraPradesh
-
బర్డ్‌లో నేటినుంచి ఉచితంగా గ్రహణ మొర్రి ఆపరేషన్లు
ABN , First Publish Date - 2022-09-13T06:24:00+05:30 IST
బర్డ్ ఆస్పత్రిలో మంగళవారం నుంచి గ్రహణ మొర్రి (క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్) సర్జరీలను ఉచితంగా చేయనున్నారు.

తిరుపతి సిటీ, సెప్టెంబరు 12: తిరుపతి బర్డ్ ఆస్పత్రిలో మంగళవారం నుంచి గ్రహణ మొర్రి (క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్) సర్జరీలను ఉచితంగా చేయనున్నారు. ఈ ఏడాది మే 5న ఆస్పత్రిలో ప్రత్యేకంగా స్మైల్ ట్రైన్ ఇండియా వారి సహకారంతో క్లెఫ్ట్ యూనిట్‌ను ప్రారంభించారు. అయితే అవసరమైన వైద్యులు, పరికరాలు సమకూర్చుకుని, బాధితులకు అవగాహన కల్పించడంలో కాస్త ఆలస్యమైంది. ఎట్టకేలకు శస్త్ర చికిత్సలను మొదలు పెడుతున్నట్లు బర్డ్ అధికారులు తెలిపారు. తొలి రోజునే ఐదు శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని నలు మూలల నుంచి ఈ ఉచిత శస్త్ర చికిత్సలకు బాధితులు అపాయింట్మెంటు తీసుకున్నట్లు చెప్పారు.నెలకు 100 శస్త్ర చికిత్సలు లక్ష్యంగా కృషి చేస్తామంటున్నారు. అందుకు అనుగుణంగా క్లెఫ్ట్ యూనిట్లో ప్రత్యేకంగా 20 పడకలను సిద్ధం చేశామని.. అవసరాన్ని బట్టి ఈ సంఖ్యను పెంచుతామంటున్నారు.
అర్హులెవరంటే..
మూడు నెలలు దాటిన చిన్నారుల నుంచి ఏ వయస్సు వారైనా గ్రహణ మొర్రి శస్త్ర చికిత్సలకు అర్హులే. ఆరోగ్యశ్రీ తో పనిలేకుండా ఎవరొచ్చినా ఆపరేషన్లు చేయడంతో పాటు భోజన, వసతి కూడా కల్పిస్తారు.ఏ రాష్ట్రం వారైనా సరే రవాణా భత్యాలను కూడా అందిస్తారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం 12 గంటల్లోపు 73373 18107 నెంబరుకు ఫోన్ చేసి.. ముందస్తుగా రిజిస్ర్టేషన్ చేసుకోవాల్సి ఉంటుందని బర్డ్ ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి తెలిపారు.పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు సైతం మూడు నెలలపాటు చక్కటి పోషకాహారాన్ని అందించి.. ఆరోగ్యవంతులను చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.