విషాదంలో గ్రద్దగుంట

ABN , First Publish Date - 2022-12-07T02:07:10+05:30 IST

కుటుంబ భారాన్ని మోస్తున్న యజమాని, ఆయనకు అండగా వుంటోన్న కుమారుడు ఒకేసారి మృత్యుఒడికి చేరడం వారి జీవిత భాగస్వాములను దిగ్ర్భాంతికి గురి చేసింది.మృతుల భార్యలు గుండెలవిసిపోయేలా చేస్తున్న రోదనలు గ్రద్దగుంట గ్రామాన్ని విషాదంలో ముంచివేశాయి.

విషాదంలో గ్రద్దగుంట
చెరువులో గాలింపు చర్యలు

ఓజిలి, డిసెంబరు 6 : కుటుంబ భారాన్ని మోస్తున్న యజమాని, ఆయనకు అండగా వుంటోన్న కుమారుడు ఒకేసారి మృత్యుఒడికి చేరడం వారి జీవిత భాగస్వాములను దిగ్ర్భాంతికి గురి చేసింది.మృతుల భార్యలు గుండెలవిసిపోయేలా చేస్తున్న రోదనలు గ్రద్దగుంట గ్రామాన్ని విషాదంలో ముంచివేశాయి.ఓజిలి మండలం గ్రద్దగుంటలో మంగళవారం చోటుచేసుకుంది.పోలీసుల కథనం మేరకు... గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌(59) అలిమిలి చెంగయ్య ప్రస్తుతం గేదెలను మేపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.ఆయన కుమారుడు నాగార్జున తన భార్య, ఇద్దరు కుమారులతో బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. సోమవారం గేదెలను మేతకు తోలుకెళ్లిన చెంగయ్య సాయంత్రమైనా ఇంటికి రాలేదు.గేదెలు ఇంటికి చేరుకున్నా చెంగయ్య రాకపోవడంతో ఆందోళన చెంది గ్రామస్తులతో కలసి కుటుంబీకులు వెతికారు.చెరువు గట్టున చెంగయ్య బట్టలు కనిపించాయి.చెరువులోకి దిగిన గేదెలను బయటకు తోలేందుకు ప్రయత్నించిన చెంగయ్య చెరువు బురదలో కూరుకుపోయి బయటకు రాలేక మునిగిపోయి వుంటాడని నిర్ధారణకు వచ్చారు.వీఆర్వో యోహాను అందించిన సమాచారంతో రెవిన్యూ, పోలీసు అధికారులు రంగంలోకి దిగి అగ్నిమాపక శాఖ సాయంతో చీకటిపడే వరకు చెరువులో గాలించారు.చెంగయ్య ఆచూకీ దొరక్క వెనుదిరిగారు.సోమవారం మధ్యాహ్నమే బెంగళూరు నుంచి ఇంటికి వచ్చిన నాగార్జున తండ్రి కన్పించకపోవడంతో తల్లడిల్లాడు.మంగళవారం ఉదయాన్నే తనతోపాటు మరో వ్యక్తిని చెరువు వద్దకు తీసుకుపోయి తండ్రి కోసం మళ్ళీ గాలింపు చేపట్టాడు.చెరువులోకి దిగి ఈత రాకపోవడంతో మునిగిపోయాడు.తోడుగా వచ్చిన వ్యక్తి నాగార్జునను కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.అప్పటికే గట్టున చేరిన పలువురు చూస్తుండగనే నాగార్జున కూడా చెరువులో మునిగిపోయాడు.తహసీల్దారు లాజరస్‌, సీఐ సోమయ్య అధ్వర్యంలో మృతదేహాల కోసం పోలీసు, అగ్నిమాపక శాఖ అధికారులు గాలించారు. బోట్ల సాయంతో చెరువంతా గాలించి మొదట నాగార్జున,తర్వాత చెంగయ్య మృతదేహాలను వెలికితీశారు.వారి శవాలు కంటపడగానే అత్త, కోడళ్ల రోదనలు మిన్నంటాయి.వారి దుఃఖం గ్రామాన్ని కూడా విషాదంలో ముంచెత్తింది.ఎ్‌సఐ ఆదిలక్ష్మి కేసు నమోదు చేసుకుని మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగించారు.

Updated Date - 2022-12-07T02:07:12+05:30 IST