మట్టిలో కలిసిపోతున్నాయ్‌!

ABN , First Publish Date - 2022-09-19T06:34:39+05:30 IST

ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుండగా స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల వాహనాలు అటవీశాఖ అధికారుల కళ్లముందే మట్టిలో కలిసిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ప్రస్తుతం 817 వివిధ రకాల వాహనాలు మూలన పడి ఉన్నాయి. వీటిని కనీసం తుక్కుగా కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదు.

మట్టిలో కలిసిపోతున్నాయ్‌!

ఎర్రచందనం స్మగ్లింగ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాల పరిస్థితిదీ

 

తుక్కుగా కూడా కొనడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదు


ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుండగా స్వాధీనం చేసుకున్న కోట్ల రూపాయల వాహనాలు అటవీశాఖ అధికారుల కళ్లముందే మట్టిలో కలిసిపోతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు ప్రస్తుతం 817 వివిధ రకాల వాహనాలు మూలన పడి ఉన్నాయి. వీటిని కనీసం తుక్కుగా కూడా కొనడానికి ఎవరూ ముందుకు రావడంలేదు. 

- తిరుపతి అర్బన్‌


శేషాచల కొండల్లోని అరుదైన, విలువైన ఎర్రచందనం వృక్షాలను నరికి.. దుంగలుగా మార్చి ఇతర రాష్ట్రాలకు స్మగ్లర్లు తరలిస్తున్న విషయం తెలిసిందే. వీరిని అరికట్టడానికి అటవీశాఖ అధికారులు తరచూ దాడులు చేస్తుంటారు. ఈ సమయంలో ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవడంతోపాటు స్మగ్లింగ్‌కు వినియోగించే వాహనాలను కూడా స్వాధీనం చేసుకుంటారు. ఇలా స్వాధీనం చేసుకున్న వాహనాల్లో కార్లు, లారీలు, మినీ లారీలు, ట్రక్కులు, ద్విచక్రవాహనాలు, ఆటోలు ఇలా పలు రకాలుంటాయి. 


సీజ్‌ చేసిన వాహనాలిలా.. 


తిరుపతి డివిజన్‌ పరిధిలోని బాలపల్లె రేంజ్‌లో 114, చామలరేంజ్‌లో 382, తిరుపతి రేంజ్‌లో 477, తిరుపతి వైల్డ్‌లైఫ్‌ మేనేజ్‌మెంట్‌లో 28 వాహనాలను సీజ్‌ చేశారు. 


184 వాహనాలను వేలం వేస్తే రూ.73లక్షల ఆదాయం


2022 ఆగస్టు 15వ తేదీ నాటికి అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం స్వాధీనం చేసుకున్న వివిధ రకాల వాహనాలు 1001 ఉన్నాయి. వీటిల్లో 184 వాహనాలను వేలం వేస్తే రూ.73,18,005 ఆదాయం వచ్చింది. ప్రస్తుతం 817 వాహనాలు ఆపి ఉన్నచోటే మట్టిలో కలిసిపోతున్నాయి. వీటిని కూడా వేలం వేస్తే దాదాపు రూ.9 కోట్ల నుంచి రూ.10కోట్ల వరకు ఆదాయం వస్తుందని ఓ అంచనా. 


రవాణాశాఖాధికారుల అంచనాల్లోనే లోపాలున్నాయా?


స్వాధీనం చేసుకున్న వాహనాలను ముందుగా అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తారు. వాహనాల రిజిస్ర్టేషన్‌ నెంబరు ఆధారంగా ఇతర రాష్ర్టాలకు కూడా వెళ్లి యజమానులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కొందరిని  గుర్తించి, వారిపై కేసులూ పెడతారు. మరికొందరు యజమానులు మాత్రం తమ వాహనం చోరీకి గురైనట్లు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటనలుంటే, ఇంకొన్ని వాహనాలు ఎవరివో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది.  ఈ వాహనాల విలువను అంచనా వేయాల్సింది రవాణా శాఖాధికారులు. అలాగే ఈ వాహనాలు ఎవరివో, ఏ రాష్ర్టానికి చెందినవో గుర్తించాల్సిందీ వారే. ఈ క్రమంలో వాహన యజమానిని గుర్తించడానికి ఆ శాఖాధికారులకు దాదాపు కొన్ని నెలల సమయం పడుతోంది. అలాగే ఒక వాహన విలువను అంచనా వేసి.. దానిని అటవీశాఖ అధికారులకు తెలియజేయడానికి కనీసం తక్కువలో తక్కువ మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతోంది. అంటే అప్పటికి ఆ వాహనం కండీషన్‌ ఎలా తయారవురుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత అటవీశాఖ అధికారులు బహిరంగ వేలం వేస్తారు. అందులో ఎవరైనా నిర్ణీత రుసుం చెల్లించి.. వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. వేలం పాటలో ఎవరూ కొనుగోలు చేయని వాహనాల అంచనా ధర మార్చి ఇవ్వాలని అటవీశాఖ అధికారులు కోరితే, దానిపై కొత్త అంచనా ధర ఇవ్వడానికి రవాణా శాఖాధికారులకు మరో మూడు నెలల సమయం పడుతోంది. ఇలా కాలం గడిచేకొద్దీ పూర్తిగా పాడైపోయి, మట్టిలోనే కలిసిపోతున్న వాహనాల సంఖ్య వందల్లోకి చేరుతోంది. 


అంచనా ధర ఎక్కువగా ఉంటోంది


రవాణాశాఖాధికారులు కొన్ని వాహనాలకు ఇచ్చే అంచనా ధర ఒక్కోసారి ఎక్కువగా ఉంటోంది. అంత ధర పెట్టి కొనడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. దీనివల్ల కూడా ఆ వాహనాల వేలంలో ఆలస్యమై.. చివరికి అవి ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయన్న విమర్శలూ ఉన్నాయి. 


ఎలా వదిలించుకోవాలో అర్థంకాని అధికారులు


వేలం పాటలో ఎవరూ కొనడానికి ముందుకు రాక, అటవీశాఖ కార్యాలయం చుట్టూ పేరుకు పోతున్న ఈ వాహనాలను ఎలా వదిలించుకోవాలో అధికారులకు అర్థం కావడంలేదు. మరోవైపు కొత్తగా పట్టుబడుతున్న వాహనాలను ఎక్కడ పెట్టాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇదిలా ఉంటే.. వాహనాలకు సంబంధించి కోర్టులో కేసులు కూడా పరిష్కారం కాకపోవడం మరో సమస్యగా మారుతోంది. ఇకనైనా అటవీ, రవాణా శాఖాధికారులు సమన్వయంతో వ్యవహరిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. అలాగే ప్రభుత్వ ఖజానాకూ ఆదాయం సమకూరుతుంది. 


Updated Date - 2022-09-19T06:34:39+05:30 IST