నేడు గంగమ్మ శిరస్సు ఊరేగింపు

ABN , First Publish Date - 2022-05-24T06:27:01+05:30 IST

కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర అంతిమ దశకు చేరుకుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపు మంగళవారంనాడు అంగరంగ వైభవంగా జరుగనుంది.

నేడు గంగమ్మ శిరస్సు ఊరేగింపు

కుప్పం, మే 23: కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర అంతిమ దశకు చేరుకుంది. జాతరలో ప్రధాన ఘట్టమైన అమ్మవారి శిరస్సు ఊరేగింపు మంగళవారంనాడు అంగరంగ వైభవంగా జరుగనుంది. జిల్లాలో చాలాచోట్ల జాతరలో అమ్మవారి సంపూర్ణ రూపాన్ని ఊరేగించడం ఆనవాయితీ. అయితే కుప్పంలో మాత్రం అమ్మవారి శిరస్సును మాత్రమే ఊరేగిస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామి చెల్లెలు అయిన గంగమ్మ... తిరుపతిలో ఊరిమీద పడి ఉగ్రరూపంలో జనాలను బాధిస్తూ, వారి ప్రాణాలు తీస్తూ తిరిగేదట. జనం తమను బ్రోమని వెంకటపతికి మొరపెట్టుకోగా, ఆయన కొండమీదినుంచి దిగివచ్చి చెల్లెలైన గంగమ్మకు సుద్దులు చెప్పడానికి ప్రయత్నించడాట. ఆమె వినకపోవడంతో ఒక కత్తివేటుతో గంగమ్మ శిరస్సును ఖండించి జనాలను రక్షించాడట. ఆ కత్తివేటుకు ఐదు ముక్కలైందట గంగమ్మ శిరస్సు. అందులో ఒక భాగం కుప్పంలోనూ, మిగిలిన నాలుగు భాగాలు తిరుపతి, చిత్తూరు, పలమనేరు, గుడియాత్తంలలో పడ్డాయట. ఇది గంగమ్మ జాతరకు సంబంధించి అనాదిగా స్థానికంగా వినిపిస్తున్న ఐతిహ్యం. అందుకనే కుప్పలో వెలసిన అమ్మవారిని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ అని పిలుస్తారు. శిరస్సులేని ఆమె మిగిలిన అసంపూర్ణ దేహం దారు శిల్పం రూపంలో ఆలయంలో తెరవెనుక ఉంటుంది. ఆమెకు ప్రతిరూపంగా ముందు ఒక చిన్నపాటి విగ్రహాన్ని ఉంచి నిత్య పూజలు జరుపుతారు. గంగజాతర సందర్భంగా చివరినుంచి రెండో రోజైన మంగళవారంనాడు అమ్మవారి శిరస్సును ప్రత్యేకంగా అలంకరించి వీధులలో ఊరేగిస్తారు. ఆపైన అదేరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ శిరస్సును తీసుకొచ్చి ఆలయంలో అప్పటికే సిద్ధం చేసిన మొండేనికి అమరుస్తారు. సర్వాలంకరాలు చేసి, సర్వాభరణాలూ తొడుగుతారు. ఒక్క బుధవారంనాడు మాత్రమే భక్తులకు గంగమ్మ సంపూర్ణ రూపంతో దర్శనమిస్తుంది. దాన్నే విశ్వరూప దర్శనమంటారు. బుధవారం  రాత్రి బాగా పొద్దుపోయే దాకా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అనంతరం అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అమ్మవారి శిరస్సు తొలగించి జలావాసం చేయిస్తారు.  మిగిలిన అసంపూర్ణ దేహాన్ని తిరిగి తెర వెనక్కు పంపిస్తారు. 

Updated Date - 2022-05-24T06:27:01+05:30 IST