కామధేనుపై గణనాథుడు

ABN , First Publish Date - 2022-09-17T06:46:59+05:30 IST

కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కామధేను వాహనంపై గణనాథుడు విహరించారు.

కామధేనుపై గణనాథుడు
కామధేనువై ఊరేగుతున్న స్వామివారు

ఐరాల(కాణిపాకం), సెప్టెంబరు 16: కాణిపాకంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శుక్రవారం కామధేను వాహనంపై గణనాథుడు విహరించారు. ఈ కార్యక్రమానికి కాణిపాకానికి చెందిన నాయీ బ్రాహ్మణ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామికి ఉభయదారుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. మూలవిరాట్‌ను శోభాయమానంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. రాత్రి ఉభయదారులు ఉభయ వరస తీసుకు రావడంతో ఆలయ అలంకార మండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులకు విశేషంగా పూజలు నిర్వహించారు. ధూప, దీప, నైవేద్యాలు సమర్పించారు. సిద్ధి, బుద్ధి సమేత వినాయకస్వామి ఉత్సవర్లను కామధేను వాహనంపై అధిష్ఠింపచేసి పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ మోహన్‌రెడ్డి, ఈవో సురే్‌షబాబు, ఏఈవో విద్యాసాగర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్లు రమేష్‌, బాబు, ఉభయదారులు పాల్గొన్నారు.

కాణిపాకంలో నేడు 

శనివారం స్వామికి పుష్పపల్లకి సేవ జరగనుంది. ఈ కార్యక్రమానికి భాగ్యలక్ష్మి, దివంగత శేషాద్రినాయుడు అండ్‌ బ్రదర్స్‌, మోహన్‌నాయుడు అండ్‌ బ్రదర్స్‌, వీటీ రాజన్‌ అండ్‌ బ్రదర్స్‌, రామనాథ నాయుడు, కృష్ణమూర్తి నాయుడు, నరసిహారెడ్డి అండ్‌ సన్స్‌, రాజారెడ్డి అండ్‌కో, శ్రీరాములరెడ్డి,  బాలకృష్ణారెడ్డి, శ్రీమెగిలీశ్వర  ఏజేన్సీ, శేషయ్య నాయుడు అండ్‌ సన్స్‌, రాధారాం బోర్‌ వెల్స్‌, కుమారేంద్రచౌదరి, మనోహర్‌నాయుడు అండ్‌ బ్రదర్స్‌, ఆంజినేయులునాయుడు అండ్‌ సన్స్‌ ఉభయదారులుగా వ్యవహరించనున్నారు.

పుష్పపల్లకి సేవకు ప్రత్యేక ఏర్పాట్లు

ప్రత్యేక ఉత్సవాలలో భాగంగా శనివారం నిర్వహించనున్న పుష్పపల్లకి సేవకు ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ మోహనరెడ్డి, ఈవో సురే్‌షబాబు శుక్రవారం తెలిపారు. ఉదయం మూల విరాట్‌కు ఉదయం అభిషేకం ముగియగానే భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్నించనున్నట్లు తెలిపారు. రద్దీనిబట్టి రాత్రి స్వామి దర్శన సమయాన్ని పెంచుతామన్నారు. భక్తులకు అవసరమైన లడ్డు ప్రసాదాలను అందిస్తామన్నారు. ఆలయానికి విచ్చేసే ప్రతి భక్తుడు సహకరించి పుష్పపల్లకి సేవను విజయవంతం చేయాలని కోరారు. పుష్పపల్లకిని ఘనంగా నిర్వహించడానికి ఉభయదారులు ప్రత్యేక ప్రభలను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలను తెప్పించారు. పల్లకిని పుష్పాలు, విద్యుత్‌ దీపాలతో అలంకరించనున్నారు.


Read more