‘గడప గడప’ పనుల కోసం..!

ABN , First Publish Date - 2022-10-07T06:53:32+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న పనులను దక్కించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు.

‘గడప గడప’ పనుల కోసం..!

కాంట్రాక్టు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతల యత్నాలు 

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 6: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న పనులను దక్కించుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు, కీలక నేతలతో మాట్లాడుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇవ్వలేదు. తాజాగా ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు.. గుర్తించిన పనులు చేపట్టేందుకు సచివాలయాల వారీగా రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ పనులపై నేతల దృష్టి పడింది. రూ.5 లక్షల్లోపు పనులను నామినేషన్‌ పద్ధతిన కేటాయించాలని, ఆపై వాటికి టెండర్లు పిలవాలి. అందుకని పెద్దమొత్తంలో ఖర్చయ్యే పనులను రెండుగా చూపించి రూ.5 లక్షల్లోపు కుదించి, తమ వారికి నామినేషన్‌ పద్ధతిన అందించేలా అధికారులకు నాయకులు సిఫార్సు చేస్తున్నట్లు సమాచారం. జిల్లాలోని 612 సచివాలయాలకు సంబంధించి ప్రభుత్వం రూ.122.40 కోట్లు మంజూరు చేయనుంది. రెండు రోజుల కిందటి వరకు.. జిల్లాలో గడపగడప కార్యక్రమం ద్వారా 200 సచివాలయాల పరిధిలో వివిధ సమస్యలపై 2584 అర్జీలు వచ్చాయి. మండలాలవారీగా.. అత్యధికంగా తవణంపల్లెలో 368, పులిచెర్లలో 178, పెద్దపంజాణిలో 157, బైరెడ్డిపల్లెలో 137, యాదమరిలో 135 ఉన్నాయి. ప్రజల ద్వారా అందిన అర్జీలను ఎంపీడీవోలు సీపీవోకు ఆన్‌లైన్‌లో పంపిస్తున్నారు. వాటిని సచివాలయాల కమిషనర్‌కు పంపుతూ, ఆమోదం పొంది కలెక్టర్‌కు పంపి పరిపాలనా ఆమోదం పొందుతున్నారు. వాటిని తిరిగి అమలుకోసం ఎంపీడీవోకు పంపిస్తారు. తాజా సమాచారం మేరకు 740 పనులకు పరిపాలనా మంజూరు కలెక్టర్‌ అనుమతిచ్చారు. అంతర్గత రహదారులు, మురుగుకాల్వలు, త్రాగునీరు, విద్యుత్‌, ట్యాంకుల నిర్మాణం, బోర్ల తవ్వకం, కల్వర్టుల ఏర్పాటుతో పాటు ఆయా ప్రాంతాల్లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఏవైనా సమస్యలుంటే వాటిని పరిష్కరించాలని ప్రభుత్వం సూచించింది. గడప గడప నిధుల ద్వారా చేపట్టే పనులకు అనుమతుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందుకోసం స్థానిక ఎమ్మెల్యే లేదా నియోజకవర్గ ఇన్‌చార్జితో పాటు ఎంపీడీవో లేదా కమిషనర్‌, నోడల్‌ అధికారిగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ అధికారులు, సచివాలయ సిబ్బందిత ప్రత్యేక బృందాన్ని నియమించింది. వీరిని సమన్వయం చేసుకునే బాధ్యతను సీపీవోకు అప్పగించింది. ఎమ్మెల్యేలు పర్యటించినచోట్ల గడపగడప కార్యక్రమం ద్వారా అందిన సమస్యలను ఆ శాఖ పోర్టల్‌లో సిబ్బంది విధిగా నమోదు చేస్తారు. ప్రజలనుంచి వచ్చిన అర్జీల పనులను ఈ నిధులతో పూర్తిచేయడానికి ప్రభుత్వం డిసెంబరు నెలాఖరువరకు గడువు నిర్ణయించింది. నిధుల కేటాయింపులు జరిగి రెండు నెలలు కావస్తున్నా.. 515 పనులు మాత్రమే ఇప్పటికి ప్రారంభమయ్యాయి. కాగా, మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులు, సమస్యల పరిష్కారం చేపట్టలేదు. ఇప్పుడు సచివాలయానికి మంజూరుచేసిన రూ.20 లక్షలు వాటికి ఏమాత్రం సరిపోదని వైసీపీ నాయకులు వాపోతున్నారు.

Updated Date - 2022-10-07T06:53:32+05:30 IST