ఉద్యోగుల సమస్యలపై బాధ్యతగా పోరాడుతున్నాం

ABN , First Publish Date - 2022-10-17T07:38:27+05:30 IST

భజన చేయకుండా ఉద్యోగుల సమస్యలపై బాధ్యతతో పోరాడుతున్నది తామేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు.

ఉద్యోగుల సమస్యలపై బాధ్యతగా పోరాడుతున్నాం
సమావేశంలో మాట్లాడుతున్న సూర్యనారాయణరాజు

ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ

చిత్తూరు, అక్టోబరు 16: భజన చేయకుండా ఉద్యోగుల సమస్యలపై బాధ్యతతో పోరాడుతున్నది తామేనని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. చిత్తూరులో ఆదివారం జరిగిన జిల్లా ప్రథమ కౌన్సిల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అంతకుముదు ఉద్యోగులతో కలిసి గాంఽధీ విగ్రహానికి పూలమాల వేసిన ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘాల పేరుతో అనేక మంది వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని సంఘాల నేతలు ఖరీదైన వాహనాల్లో వెళ్లి సన్మానాలు చేసి జేబులు నింపుకుంటున్నారే తప్ప ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. 11వ పీఆర్సీలో ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని 12వ పీఆర్సీలో జరగకుండా 2023 ఏప్రిల్‌ నుంచి ఉద్యమ బాట పడతామని స్పష్టం చేశారు. రోజుకు మూడు సార్లు బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం సరికాదని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కారావు అన్నారు. దశాబ్దాలుగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న ఎన్నికల హామీని ప్రభుత్వం పెడచెవిన పెట్టింద ని విమర్శించారు. సకాలంలో ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితుల్లో  ఉందని, ఆ పరిస్థితులు మారకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నికున్నారు. జిల్లా అధ్యక్షుడిగా వి.శివయ్య, కార్యదర్శిగా హరిప్రసాద్‌రెడ్డి, సహ అధ్యక్షుడిగా బాలాజీరెడ్డితో పాటు పలువురిని ఎన్నుకున్నారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా భాగ్యమేరి ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో అన్ని తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర జిల్లాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T07:38:27+05:30 IST