తిరుచానూరు స్టేషన్‌ పార్కింగ్‌ లైన్‌లో పట్టాలు తప్పిన ఇంజన్‌

ABN , First Publish Date - 2022-11-08T01:32:47+05:30 IST

తిరుపతి సమీపంలోని తిరుచానూరు రైల్వేస్టేషన్‌లో పార్కింగ్‌ లైన్‌లో వుంచిన ఇంజన్‌ పట్టాలు తప్పిన ఘటన సోమవారం రాత్రి జరిగింది.

తిరుచానూరు స్టేషన్‌ పార్కింగ్‌ లైన్‌లో   పట్టాలు తప్పిన ఇంజన్‌
-పట్టాలు తప్పిన ఇంజన్‌

మెయిన్‌ లైన్‌ సిగ్నల్‌ చూసి పొరపాటుగా ముందుకొచ్చిన పర్యవసానం

రేణిగుంట, నవంబరు 7 : తిరుపతి సమీపంలోని తిరుచానూరు రైల్వేస్టేషన్‌లో పార్కింగ్‌ లైన్‌లో వుంచిన ఇంజన్‌ పట్టాలు తప్పిన ఘటన సోమవారం రాత్రి జరిగింది. మెయిన్‌ లైన్‌లో రైలు రాకపోకలకు ఇచ్చిన సిగ్నల్‌ చూసి తనకు ఇచ్చినట్టుగా భావించిన డ్రైవర్‌ ఇంజన్‌ను ముందుకు తీసుకురావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.రేణిగుంటలోని రైల్వే క్యారేజీ రిపేరు షాప్‌కు చేరువగా వున్న తిరుచానూరు స్టేషన్‌లో రైలు బోగీల నుంచీ వేరుచేసిన రెండు ఇంజన్లను (లోకోమోటివ్‌ ఇంజన్‌) ఒకటిగా లింక్‌ చేసి ఇక్కడ పార్కింగ్‌ లైనులో వుంచారు.సోమవారం రాత్రి సుమారు 8.30 గంటల సమయంలో పార్కింగ్‌ చేస్తుండగా పక్కనే వున్న మెయిన్‌ లైన్‌లో తిరుపతి నుంచీ ఓ రైలు రేణిగుంట వెళ్ళేందుకు సిగ్నల్‌ ఇచ్చారు.ఆ సిగ్నల్‌ తమకు ఇచ్చినట్టుగా భావించిన డ్రైవర్‌ ఇంజన్‌ను ముందుకు తీసుకొచ్చారు. అయితే పార్కింగ్‌ లైన్‌ నుంచీ ఇంజన్‌ మెయిన్‌ లైన్‌లోకి వెళ్ళడానికి పాయింట్స్‌ కలపకపోవడంతో అలాగే ముందుకు వెళ్ళిపోయి లూప్‌లైన్‌లోకి ప్రవేశించారు. జరిగిన పొరపాటును ఆలస్యంగా గుర్తించిన ఇంజన్‌ డ్రైవర్‌ బ్రేక్‌ వేసేటప్పటికే లూప్‌లైన్‌ చివరి దాకా వెళ్ళిపోయింది. ముందువైపు ఇంజన్‌కు బ్రేక్‌ వేయడంతో ఆ ధాటికి వెనుకవైపు అటాచ్‌ చేసివున్న మరో ఇంజన్‌ ముందుకు దూసుకువచ్చి ముందున్న ఇంజన్‌ను ఢీకొట్టింది. ఫలితంగా ముందువైపున్న ఇంజన్‌ లూప్‌లైన్‌ పట్టాల అంచులు దాటేసి మట్టిలోకి దిగిపోయింది. వెనుకవైపు అటాచ్‌చేసిన ఇంజన్‌ను అధికారులు హుటాహుటిన పట్టాల నుంచీ తొలగించి పార్కింగ్‌ లైన్‌ క్లియర్‌ చేశారు. కానీ లూప్‌లైన్‌ నుంచీ పట్టాలు తప్పిన ఇంజన్‌ మాత్రం అలాగే వుంది. మంగళవారం సాయంత్రానికి గానీ దాన్ని అక్కడ నుంచీ తొలగించే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. భారీ క్రేన్‌ అవసరమవుతున్నందున దాన్ని తెప్పించి తొలగించడానికి అంత వ్యవధి పడుతుందని చెబుతున్నారు. దాన్ని తొలగించిన తర్వాత పరిశీలిస్తే గానీ ఇంజన్‌ ఏమైనా దెబ్బతిందా? లేదా అనే వివరాలు తెలియనున్నాయి. కాగా ఈ ప్రమాదం వల్ల ఎటువంటి ఆస్తినష్టం సంభవించలేదు. పార్కింగ్‌, లూప్‌ లైన్లలో జరగడంతో ఇతర రైళ్ళ రాకపోకలకు కూడా అంతరాయం కలగలేదు.

Updated Date - 2022-11-08T01:32:47+05:30 IST

Read more