-
-
Home » Andhra Pradesh » Chittoor » Elephant hit by car is safe-NGTS-AndhraPradesh
-
కారు ఢీకొన్న ఏనుగు సురక్షితం
ABN , First Publish Date - 2022-09-19T06:03:29+05:30 IST
పలమనేరు సమీపంలోని జగమర్ల క్రాస్ సమీపం జాతీయ రహదారిపై శనివారం రాత్రి కారు ఢీకొన్న ఘటనలో ఏనుగు సురక్షితంగా ఉందని రేంజరు నయీం ఆదివారం తెలిపారు.

పలమనేరు, సెప్టెంబరు 18: పలమనేరు సమీపంలోని జగమర్ల క్రాస్ సమీపం జాతీయ రహదారిపై శనివారం రాత్రి కారు ఢీకొన్న ఘటనలో ఏనుగు సురక్షితంగా ఉందని రేంజరు నయీం ఆదివారం తెలిపారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కావడంతో ఏనుగు కూడా తీవ్రంగా గాయపడి ఉంటుందని అధికారులు భావించారు. ఏనుగు అడవిలోకి వెళ్లిపోవడంతో ఎటువంటి గాయాలయ్యాయో తెలియలేదు. ఆదివారం ఉదయాన్నే అటవీ సిబ్బంది, ట్రాకర్లు ఏనుగు అడుగులను వెంబడించి వెళ్లారు. దాదాపు 15 కిలోమీటర్లు వెళ్లాక ప్రమాదానికి గురైన ఏనుగు ఏనుగుల గుంపులో కలిసి వెళ్తున్నట్లు గుర్తించారు. పలమనేరు సమీపం గాంధీనగర్‌నుంచి నాలుగు కిలోమీటర్ల పొడవునా ఏనుగులు జాతీయ రహదారిని దాటుకొని ఇరువైపులా ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తుంటాయని రేంజర్ చెప్పారు. ఇది ఏనుగుల కారిడార్ అన్నారు. రోడ్డు దాటకుండా సోలార్ ఫెన్సింగ్ వేసి వాటిని నిరోధించలేమన్నారు. అందుకని రోడ్డుకు రెండువైపులా ఏనుగుల సంచారం తెలియజేసే బోర్డులు ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఏనుగుల మంద దాడిలో రైతుకు గాయాలు
కుప్పం: మండలం గణే్‌షపురం గ్రామ సమీప పొలాల్లో శనివారం రాత్రి ఏనుగుల మంద హల్‌చల్ చేశాయి. పొలం వద్ద కాపలాకాస్తున్న రైతు రామలింగం(38)పై దాడి చేశాయి. తొండాలతో విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. బంధువులు ఆయన్ను కుప్పం పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. అటవీ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఏనుగులు సంచరిస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులు రాత్రిళ్లు పొలాల వద్దకు వెళ్లరాదని సూచించారు.