పుంగనూరులో ప్రమాదకరంగా రోడ్లు, కల్వర్టులు

ABN , First Publish Date - 2022-09-18T05:24:16+05:30 IST

పుంగనూరుకు వరదలొచ్చి 10 నెలలైనా దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు మరమ్మతులకు నోచుకోకుండా ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఏమరుపాటుగా నడిపితే ప్రమాదాలకు గురికాక తప్పదు.

పుంగనూరులో ప్రమాదకరంగా రోడ్లు, కల్వర్టులు
ప్రమాదకరంగా ఉన్న కల్వర్టు

10 నెలలైనా ఊసేలేని మరమ్మతులు


పుంగనూరు రూరల్‌, సెప్టెంబరు 17: పుంగనూరుకు వరదలొచ్చి 10 నెలలైనా దెబ్బతిన్న కల్వర్టులు, రోడ్లు మరమ్మతులకు నోచుకోకుండా ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఏమరుపాటుగా నడిపితే ప్రమాదాలకు గురికాక తప్పదు.  కర్ణాటక రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు రామసముద్రం ప్రాంతాల్లో చెరువులు నిండి ఉధృతంగా పారడంతో గత ఏడాది పుంగనూరు పట్టణం సహా పరిసర ప్రాంతాలు రెండుమార్లు నీట మునిగాయి. పంటలు, రోడ్లు, కల్వర్టులు, లోతట్టు ప్రాంతాల్లో నష్టాలు సంభవించాయి. గత ఏడాది నవంబరులో భారీ వర్షాలకు ఎంపీడీవో కార్యాలయం ఎదుట, హెచ్‌డీఎ్‌ఫసీ బ్యాంకు ఎదురుగా కల్యాణమండపం రోడ్డు, చౌడేపల్లె రోడ్డులో ఇరువైపులా, ఇందిరాసర్కిల్‌ సమీపంలోని కౌండిన్య నది కల్వర్టు, ఏటిగడ్డపాళ్యం తదితర ప్రాంతాల్లోని కల్వర్టులు, వాటి రక్షణ గోడలు దెబ్బతిన్నాయి.  కౌండిన్య నది వద్ద, చౌడేపల్లె రోడ్డు కోసుకుపోవడంతో ప్రమాదకరంగా మారాయి. బైపా్‌సరోడ్డులోని తాటిమాకులపాళ్యం వద్ద వంతెనపై ఏలాంటి రక్షణ గోడా నిర్మించలేదు. దీంతో ఏటిలో నీరుపారే సమయంలో రోడ్డు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. చిత్తూరు-కర్నూలు జాతీయ రహదారిపైనే రెండు వంతెనలున్నాయి. నిత్యం వేలాది వాహనాలు ఈ మార్గాల్లో రాకపోకలు సాగిస్తుంటాయి. చిన్నపొరబాటు జరిగినా పెను ప్రమాదం సంభవించక మానదు.  వరదలు వచ్చినప్పుడు  మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీలు మిథున్‌,  రెడ్డెప్ప, కలెక్టర్‌ హరినారాయణన్‌, కేంద్రబృందం తదితరులు పుంగనూరులో పర్యటించారు. కానీ ప్రమాదకరంగా మారిన రోడ్లు, కల్వర్టులు,  రక్షణ గోడల గురించి ఇంతవరకు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికైనా మంత్రి పెద్దిరెడ్డి, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది.



Updated Date - 2022-09-18T05:24:16+05:30 IST