కిక్కిరిసిన బోయకొండ

ABN , First Publish Date - 2022-07-18T06:24:26+05:30 IST

బోయకొండ ఆదివారం గంగమ్మ భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం వరకు అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.

కిక్కిరిసిన బోయకొండ
ప్రత్యేకాలంకరణలో అమ్మవారు - క్యూలైన్లలో వేచియున్న భక్తులు

అమ్మవారి సేవలో 50 వేలమంది భక్తులు

ఒక్క రోజే రూ.16.70 లక్షల ఆదాయం 


చౌడేపల్లె, జూలై 17: బోయకొండ ఆదివారం గంగమ్మ  భక్తులతో కిక్కిరిసింది. సాయంత్రం వరకు అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. ఉదయం అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసి, అమ్మవారికి ప్రీతికరమైన వేపాకు తోరణాలతో అలంకరించారు. అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు చేసి,  స్వర్ణాభరణాలతో, పూలతో అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారికి ప్రీతికరమైన ఆషాఢ మాసం ఆదివారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటకల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో  క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. ఇటీవల పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆదివారం  ఉదయం 5 గంటలకే అమ్మవారి దర్శనం ప్రారంభించినా  సాయంత్రం 5 వరకు క్యూలైన్లలో రద్దీ కొనసాగింది. సుమారు 50,000 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. మూడేళ్లలో అత్యధికంగా భక్తుల సంఖ్య నమోదు కావడం ఇదే ప్రఽథమం. వివిధ సేవా టిక్కెట్ల ద్వారా ఒక్క రోజే.. బోయకొండ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రూ.16.70,150 ఆదాయం వచ్చింది. ఇక వాహన రద్దీ పెరగడంతో రాకపోకలు స్తంభించాయి. కిలోమీటరు మేర వాహనాలు నిలిచిపోయాయి. మధ్యాహ్నం భక్తుల రద్దీ అధికం కావటంతో 2 గంటల పాటు వీఐపీ దర్శనాలు నిలిపేశారు. 35మంది పోలీసులతో ఎస్‌ఐ రవికుమార్‌ బందోబస్తు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ,  ఈవో చంద్రమౌళి సిబ్బందితో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

Read more