కొనసాగిన వైసీపీ వేధింపులు.. దాడులు

ABN , First Publish Date - 2022-12-30T00:52:52+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రశ్నించినవారిని వేధించడం, దాడులు చేయడం అనే సంస్కృతి మొదలైంది. ముఖ్యంగా గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అది తీవ్ర రూపం దాల్చింది.

కొనసాగిన వైసీపీ వేధింపులు.. దాడులు

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ప్రశ్నించినవారిని వేధించడం, దాడులు చేయడం అనే సంస్కృతి మొదలైంది. ముఖ్యంగా గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అది తీవ్ర రూపం దాల్చింది. 2022లోనూ అదే సంస్కృతి కొనసాగింది. ఇంకా అరాచకపు స్థాయి పెరిగిందని విపక్షాలు అంటున్నాయి. ఇలా ఎన్నో వేధింపులు, దాడులను మిగిల్చి వెళ్తున్న 2022లో జరిగిన పది ప్రధాన ఘటనల సమాహారం...

- చిత్తూరు, ఆంధ్రజ్యోతి

1. జనవరి 29: చౌడేపల్లె బస్టాండు వద్ద అడ్డంగా ఉందని ఆర్‌అండ్‌బీ డీఈతో ఫిర్యాదు చేయించి టీడీపీ జెండా దిమ్మెను పోలీసులు ధ్వంసం చేశారు. అడ్డుకున్న టీడీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. తమ నేతలను పరామర్శించేందుకు టీడీపీ ఇన్‌ఛార్జి చల్లా రామచంద్రారెడ్డి బయల్దేరగా, ఆయన్ను, వెంట ఉన్న అనుచరులను రొంపిచెర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.

2. ఏప్రిల్‌ 1: సదుం మండలం బూరగమందకు చెందిన రాజారెడ్డి టీడీపీలో క్రియాశీలక నేత. ఈయన్ను కొందరు వైసీపీ నేతలు కిడ్నాప్‌ చేసి దారుణంగా కొట్టి కల్లూరు ఘాట్‌లో పడేశారు. అతడి రెండు కాళ్లూ విరిగిపోయాయి. వేలూరు ఆస్పత్రిలో ఆరు నెలల పాటు చికిత్స చేసుకున్నా, ఆయన ఇప్పటికీ నడవలేకపోతున్నారు. దీనిపై ఫిర్యాదు చేస్తే సదుం పోలీసులు కేసు నమోదు చేయలేదు. న్యాయం చేయాలని టీడీపీ నాయకులు అదే నెల 4న కల్లూరులో ధర్నా చేయగా.. వారి నిరసనను పోలీసులు భగ్నం చేశారు. రాజారెడ్డిని టీడీపీ అధినేత చంద్రబాబు ఈ ఏడాది మే 8న చిత్తూరులో పరామర్శించారు.

3. ఏప్రిల్‌ 7: వైసీపీ వేధింపులకు సొంత పార్టీ నేత బలైన సంఘటన ఇది. కుప్పంలోని తిరుపతి గంగమ్మ ఆలయ మాజీ చైర్మన్‌ పార్థసారథి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కొత్త పాలకవర్గం ప్రమాణస్వీకారం చేసిన రోజే ఆయన బలవన్మరణం చెందడం సంచలనంగా మారింది. ‘రెండేళ్ల పాటు చైర్మన్‌గా ఉన్నా, కరోనా కారణంగా నామమాత్రంగా ఉండాల్సి వచ్చింది. మరోసారి అవకాశాన్ని కల్పించాలని కోరినా పట్టించుకోలేదు. కనీసం గంగ జాతర వరకు కొనసాగించాలన్నా ఒప్పుకోలేదు. వైసీపీ నాయకులు పెట్టిన మానసిన క్షోభ వల్ల పార్ధసారథి చనిపోయారు’ అని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, వాల్మీకి బోయ సంఘ నాయకులు ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది.

4. జూన్‌ 17: పుంగనూరులో పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ 150 ప్రముఖ కంపెనీల్లో 10 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన మెగా జాబ్‌ మేళాకు అడ్డంకులు సృష్టించారు. జాబ్‌ మేళా నిర్వహించనున్న స్థలం కోర్టు వివాదంలో ఉందని, అనుమతి లేదని ఓ రోజు ముందు పోలీసులు ప్రెస్‌మీట్‌ నిర్వహించి చెప్పారు. ముందు రోజు రాత్రి అక్కడ ఏర్పాటు చేసిన టెంట్లను పోలీసులు ధ్వంసం చేశారు. మరుసటిరోజు జాబ్‌మేళాకు హాజరయ్యేందుకు వచ్చిన నిరుద్యోగులను తనిఖీ చేసి వెనక్కి పంపించేశారు.

5. ఆగస్టు 4: గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పూతలపట్టు మండలంలోని వేపనపల్లెలో ఎమ్మెల్యే ఎంఎ్‌సబాబు పర్యటించారు. అక్కడ జశ్వంత్‌ అనే యువకుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. దీనిపై అసహనానికి గురైన ఎమ్మెల్యే అనుచరులు ఆ యువకుడిపై దాడి చేశారు. నిందితులపై కాకుండా బాధిత యువకుడిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆ యువకుడికి మద్దతు తెలిపిన గ్రామస్థులు, టీడీపీ నాయకులపైనా కేసులు పెట్టి, అర్ధరాత్రి అరెస్టులు చేశారు. ఈ ఘటన పూతలపట్టులో రెండు రోజుల పాటు దుమారం రేపింది.

6. ఆగస్టు 25: టీడీపీ అధినేత చంద్రబాబు 24, 25, 26 తేదీల్లో కుప్పంలో పర్యటించారు. తొలి రోజు రామకుప్పం మండలం కొల్లుపల్లెలో చంద్రబాబు పర్యటన ఉందని తెలిసీ తమ పార్టీ జెండాలను కట్టిన వైసీపీ నేతలు టీడీపీ శ్రేణుల్ని రెచ్చగొట్టారు. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. మరుసటి రోజు కుప్పంలో చంద్రబాబు అన్న క్యాంటీన్‌ పరిశీలనకు వెళ్లనుండగా, వైసీపీ శ్రేణులు ఆ క్యాంటీన్‌ను ధ్వంసం చేసి, బ్యానర్లను చించేశారు. నిర్వాహకుడ్ని కొట్టారు. దీంతో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌ నుంచి చంద్రబాబు పాదయాత్రగా వచ్చి క్యాంటీన్‌ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ర్యాలీగా వస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు లాఠీఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఉల్టా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు సహా 60 మంది టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేశారు. 14 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

7. నవంబరు 1: కుప్పం మున్సిపల్‌ ఎన్నికల సమయంలో వైసీపీ ఎలాంటి అక్రమ మార్గాల్లో గెలిచిందో ఆ పార్టీ నాయకుల ద్వారానే తెలిసింది. నవంబరు 1న కుప్పంలో జరిగిన మున్సిపల్‌ సర్వసభ్య సమావేశంలో ఓటుకు రూ.5 వేలు పంపిణీ చేశామని 17వ వార్డు కౌన్సిలర్‌ దేవకి భర్త రంగయ్య చైర్మన్‌, అధికారుల వద్ద మాట్లాడారు. చిన్న చిన్న పనులు కూడా పూర్తి చేయలేకపోతే ఇక ఈ సమావేశాలు ఎందుకంటూ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బహిష్కరించారు.

8. నవంబరు 11: పుంగనూరులోని టీడీపీ కార్యాలయ యజమానులపై ‘అధికార’ ఒత్తిళ్లు తెచ్చి ఆ పార్టీ ఆఫీసును ఖాళీ చేయించారు. వాస్తవానికి ఇక్కడ అద్దె భవనంలో టీడీపీ కార్యాలయాన్ని నిర్వహిస్తుండగా, దాన్ని ఖాళీ చేయించాలనే ఉద్దేశంతో మున్సిపల్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉందని కూల్చివేతకు యంత్రాలను సిద్ధం చేశారు. ఈ క్రమంలో వారి ఉద్దేశాన్ని అర్థం చేసుకున్న యజమాని టీడీపీ కార్యాలయం లోపల ఉండే ఫర్నిచర్‌, ఎన్టీఆర్‌ విగ్రహం తదితర సామగ్రిని బయటపెట్టి ఇంటికి తాళం వేశారు.

9. డిసెంబరు 4: సదుంలో రైతు సమస్యలపై పారిశ్రామికవేత్త రామచంద్రయాదవ్‌ రైతు భేరి నిర్వహించేందుకు హైకోర్టు నుంచి అనుమతి పొందారు. సదుంలో ఇరుకు రోడ్లు, ట్రాఫిక్‌ ఇబ్బందులు, సున్నితమైన ప్రాంతం అనే కారణాలతో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ రోజు రామచంద్రయాదవ్‌ ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకున్నారు. అదే రోజు సాయంత్రం ఆయన అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, రైతు భేరిని అడ్డుకోవడంపట్ల మంత్రి పెద్దిరెడ్డిపై ఆగ్రహించారు. దీంతో ఆ రాత్రి సుమారు 200 మంది వైసీపీ శ్రేణులు రామచంద్రయాదవ్‌ ఇంటి మీద దాడి చేశారు. సుమారు రూ.5కోట్ల ఆస్తిని నష్టపరిచారు.

10. డిసెంబరు 25: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటనలో భాగంగా స్వాగత బ్యానర్లను తన సొంత స్థలంలో కట్టవద్దని చెప్పినందుకు పుంగనూరుకు చెందిన అడ్వకేట్‌, తెలుగు యువత అధికార ప్రతినిధి నవీన్‌కుమార్‌ యాదవ్‌ ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. పోలీసులు మాత్రం నవీన్‌కుమార్‌, అతడి తండ్రి మునిరాజాను అదుపులోకి తీసుకుని ఫ్లెక్సీలను చించారంటూ వీరిపైనే కేసు నమోదు చేశారు. న్యాయం చేయాలని స్టేషన్‌ ఎదుట ధర్నా చేసిన టీడీపీ నాయకులపైనా కేసులు పెట్టారు.

Updated Date - 2022-12-30T00:52:53+05:30 IST